నూతన హెల్త్ స్కీంతో.. మెరుగైన వైద్యం అందేనా?

ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్‌లకు మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉచిత హెల్త్ స్కీం ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు 186 విడుదల చేయడంతో

Update: 2023-10-20 00:30 GMT

ద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్‌లకు మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉచిత హెల్త్ స్కీం ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు 186 విడుదల చేయడంతో వేతన జీవుల్లో మరోసారి ఆశలు చిగురించాయి. గతంలో అందించిన హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన వైద్యం అందకపోవడంతో ఉద్యోగుల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయింది. దీంతో ఎంతోకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మెరుగైన వైద్యం కోసం ప్రాతినిధ్యం చేస్తూ వస్తున్నాయి. పలుమార్లు వైద్య అరోగ్య శాఖామాత్యుల వారికి నెలకు కొంత ఉద్యోగుల నుండి కూడా కంట్రిబ్యూషన్ తీసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరాగా ఎట్టకేలకు ఆ దిశగా ఉత్తర్వులు విడుదల చేయడం హర్షించదగ్గ పరిణామం. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మూల వేతనం నుండి రెండు శాతం కంట్రిబ్యూషన్ ఇస్తామన్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరించాలి!

గతంలోని హెల్త్ కార్డులు పనిచేయక ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్‌లను ఆశ్రయించక తప్పలేదు. తమకు, తమ కుటుంబ సభ్యులకు కలిపి ఏడాదికి సుమారుగా ముప్పై వేలకు పైగా వెచ్చించడం తలకు మించిన భారంగా మారింది. ఆయా ఇన్సూరెన్స్‌లలో కూడా పూర్తి మొత్తం రాకపోవడంతో ఉద్యోగుల జేబులకు చిల్లులు పడిన ఉదంతాలు కోకొల్లలు. రెఫరెల్ హాస్పిటల్‌లో వైద్యం పొంది బిల్లులు ప్రభుత్వానికి పంపి నగదు పొందే రీయంబర్స్‌మెంట్ పథకానికి చాలా సమయం పడుతుండడం అలాగే సీజీహెచ్ఎస్ ప్యాకేజీ‌లో చాలా రకాల వ్యాధుల చికిత్సకు తక్కువ మొత్తం లిమిట్ ఉండడంతో ఉద్యోగులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రీయంబర్స్ మెంట్ పథకంలో ఉన్న రెండు లక్షల లిమిట్‌ను తొలగించాలి. ఎందుకంటే ఈ మొత్తం దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఏ మాత్రం సరిపోవడం లేదు. అందుకే కొత్తగా వచ్చే నూతన హెల్త్ స్కీంలో ఆ వ్యాధికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే చెల్లించాలి. అలాగే ఔట్ పేషెంట్ చికిత్సలకు, టెస్టులకు కూడా అవకాశం కల్పించాలి.

నూతన హెల్త్ స్కీం అమలుకు ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమికంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం అలాగే ఆ ట్రస్టులో అధికారులతో పాటు ఉద్యోగులను, పెన్షనర్‌లను సభ్యులుగా చేర్చడం శుభపరిణామం. ఉద్యోగుల నెల వారి కంట్రిబ్యుషన్‌తో సమానంగా ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమ చేస్తుండడం ఆనందదాయకం. ఉద్యోగుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ విధివిధానాలు ఖరారు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు కోరుకుంటున్నారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డు చూపించగానే మెరుగైన వైద్యం అందేలా నూతన హెల్త్ స్కీం పనిచేయాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ఉద్యోగుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా పని చేస్తారని ఆశిద్దాం.

- సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు STUTS

90006 74747

Tags:    

Similar News