కృష్ణా జలాల పంపకంతో... సీమాంధ్ర సాగుకు సంకెళ్లు?

రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పున:సమీక్షకు అంగీకారం తెలిపి బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కొత్త నిబంధనల పరిశీలనా

Update: 2023-10-11 01:00 GMT

రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పున:సమీక్షకు అంగీకారం తెలిపి బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కొత్త నిబంధనల పరిశీలనా బాధ్యత అప్పగిస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానించింది. ఈ నిర్ణయంతో సీమాంధ్ర సాగుకు సంకెళ్లు వెయ్యడమే అవుతుంది. ఇది ప్రధానంగా రాయలసీమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బచావత్‌, బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునళ్లు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెరి సగం పంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న వాదనకు అనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పాతరేశారు.

సీఎం జగన్.. ఢిల్లీలోనే ఉన్నా

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అడుగడుగునా అన్యాయం చేస్తూనే వున్నది. ఒక పక్కన విభజన హామీలు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టగా, ఇప్పుడు తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు నీటి వాటాల పునఃసమీక్షతో ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు బీటలు బారుస్తుంది. ప్రధానంగా ఇది రాయలసీమ సాగునీటి అవసరాల హక్కులను కాలరాయడమే అవుతుంది. కర్నాటక ఎన్నికలలో లబ్ధి పొందటానికి తుంగభద్ర డ్యామ్‌ పై భాగంలో నిర్మిస్తున్న ఎగువభద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా బడ్జెట్లో రూ. 5,300కోట్లు కేటాయించింది కేంద్రం. ఎగువభద్ర మొదటి రెండు దశల్లో 48 టీఎంసీల నీటిని తుంగభద్రకు రాకముందే మళ్లిస్తున్నారు .కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా రాయలసీమ ప్రయోజనాలు పూర్తిగా ప్రమాదంలో పడినట్లే. ఈ దురాగతాన్ని, దుశ్చర్యను అడ్డుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.

కేసుల నుండి బయటపడటం, అప్పులు చేయడంపై చూపుతున్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై చూపడం లేదు సీఎం జగన్ రెడ్డి. కృష్ణా జలాల కేటాయింపులపై రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రాన్నిఎదిరించే ధైర్యం చెయ్య లేదు. రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేంద్ర నిర్ణయం అమలు చేస్తే రాష్ట్రానికి జరిగే నష్టమేమిటో నిపుణులు అప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించారు. కేబినెట్‌ నిర్ణయం తర్వాత 48 గంటలలోపే బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ను కొనసాగిస్తూ ప్రాజెక్టుల వారీగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి కేటాయింపులు నిర్వహించేలా గెజిట్‌ను కూడా కేంద్రం విడుదల చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీలోనే ఉన్నా రాష్ట్రానికి జరిగే తీవ్ర నష్టాన్ని కేంద్రానికి గట్టిగా వివరించి కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయకపోగా, మొక్కుబడిగా లేఖ రాసి జగన్ రెడ్డి చేతులు దులుపుకోవడం చూస్తే ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలపై ఎంత ప్రేమ వున్నదో ప్రజలే అర్థం చేసుకోవాలి.

30 లక్షల ఎకరాలు..ఎడారిగా

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో సగం వాటా కావాలన్న కేసీఆర్‌ డిమాండ్‌పై జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఏపీ, తెలంగాణ మధ్య 811 టీఎంసీలలో 512, 299 టీఎంసీల వాటా మాత్రమే ఉందంటూ బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలు అమలు కావాల్సిందేనని పట్టు బట్టనూ లేదు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలను కలిపి కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు ప్రత్యేకంగా ట్రైబ్యునల్‌ ఎలా వేస్తారంటూ జగన్‌ అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. ట్రైబ్యునల్‌ వేయడం వల్ల ఎదురయ్యే సమస్యలనూ ప్రస్తావించలేదు. నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులకే కేటాయింపులు పరిమితం చేయాలన్న కేసీఆర్‌ వాదనకూ జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ నెల 4వ తేదీన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో అపెక్స్‌ కౌన్సిల్‌లో కొత్త ట్రైబ్యునల్‌ వేయాలన్న కేసీఆర్‌ డిమాండ్‌ మేరకు బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌కు తెలుగు రాష్ట్రాల నదీ జలాల పంపకాల బాధ్యతను అప్పగించామని కేబినెట్‌ నోట్‌లో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఆ రోజు అపెక్స్‌లో కేసీఆర్‌ను నిలువరించి. కృష్ణా జలాలపై కేంద్రం జారీ చేసిన గెజిట్‌ రాష్ట్రానికి గొడ్డలి వేటేనని కేంద్రం ఇచ్చిన గెజిట్‌ అమలైతే మొత్తంగా 30 లక్షల ఎకరాలకు శాశ్వతంగా చుక్కనీరు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల నీటిలో ఆంధ్రప్రదేశ్‌ వాటా 512 టీఎంసీలు. అనేక ఏళ్లుగా వాడుకుంటున్న హక్కు పున:సమీక్షకు సిద్ధం కావడం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే. తెలంగాణలో చట్ట విరుద్ధంగా 299 టీఎంసీల నిలువతో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించి, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనివల్ల దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సాగుకు సంకెళ్లు పడనున్నాయి. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల కింద మొత్తంగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లేక ఎడారిగా మారే ప్రమాదముంది.

ఎప్పుడూ.. రాజకీయ ప్రయోజనాలేనా?

2014 పునర్విభజన చట్టంలో ఆమోదించిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలకు పంగనామాలు పెడుతూ తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ బరితెగించింది. తన కేసుల కోసం జగన్‌ కేంద్రానికి లొంగిపోయి చివరికి కృష్ణా జలాలను కూడా కృష్ణార్పణం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూలంగా రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలుగుతుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇక రాష్ట్రాలన్నిటినీ సమ దృష్టితో చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్న దుష్ట తలంపుతో వ్యవహరిస్తున్నది. కేంద్రం తీసుకొన్న నిర్ణయంతో అనుమతు ల్లేకుండానే తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ సక్రమం కానున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కొత్తదని ఇప్పటికే బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ చెప్పింది. ట్రైబ్యునల్ దానికి నీటి కేటాయింపులు జరిపితే ఆంధ్రప్రదేశ్‌కే తీవ్ర నష్టం వాటిల్లనున్నది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తన రాజకీయ ప్రయోజనాలు తప్ప,రాష్ట్ర ప్రయోజనాలు పట్టడంలేదు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి, బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ ఏక పక్షంగా కృష్ణాజలాలు పంపిణీకి కేంద్రం నిర్ణయం తీసుకోవడం అసంబద్ద మైనదే కాదు రాజ్యాంగ వ్యతిరేకం కూడా. కృష్ణా జలాల్లో పెంపకానికి కేంద్రం నిర్ణయం తీసుకొంటే జగన్ ఎందుకు మాట్లాడరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్ తెలంగాణలో వున్న తన ఆస్తులు కాపాడుకునేందుకే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని విమర్శిస్తున్నారు. కృష్ణా జలాల అంశంలో సీఎం జగన్ రెడ్డి బాధ్యత లేకుండా ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలులోనికి వస్తే తనకు రాజకీయ జన్మనిచ్చిన రాయలసీమకు ఉరి బిగించబోతుందన్న ఆలోచన చెయ్యకుండా, 2016లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ తీర్మానాన్ని గుర్తు చేయకుండా జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు.

కేసులున్నా..దానికే బాధ్యతలు

2020లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కేసీఆర్‌ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడే జగన్‌ అభ్యంతరం చెప్పక పోవడంతో జగన్ రెడ్డి మెతక వైఖరిని ఆసరాగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తే కేసీఆర్ మాత్రం చెరి సగం నీటి వాటాను డిమాండ్‌ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోరుమెదపలేదు. జగన్‌ సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినా మౌనంగా వున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చినా ఎన్‌జీటీ స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. స్టే ఉత్తర్వుల ఎత్తివేత దిశగా జగన్‌ రెడ్డి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ అవార్డును ఇంతవరకు నోటిఫై చేయని ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ వ్యవహారాన్ని తేల్చే బాధ్యతను మళ్లీ అదే ట్రైబ్యునల్‌కు కేంద్రం కట్టబెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టడమే. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తుండగా. జలాల పంపిణీ బాధ్యతను కూడా కొత్తగా దానికెలా అప్పగిస్తారు? రాష్ట్రానికి శరాఘాతం లాంటి నిర్ణయాలను కేంద్రం తీసుకుంటున్నా ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు మౌనంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటి?

రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పంపకం జరిగితే శ్రీశైలం కుడి కాలువ ద్వారా కర్నూలు జిల్లాలో గోరుకల్లు 10 టీఎంసీలు, అవుకు 3 టీఎంసీలు, వెలుగోడు జలాశయం 16 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం 17 టీఎంసీలు, ఎస్ ఆర్ -11.8 టీఎంసీలు, ఎస్ ఆర్ 22.27 టీఎంసీలు. కడప జిల్లాలో గండికోట 26 టీఎంసీలు, చిత్రావతి, మైలవరం, పైడిపాలెం, వంటి రిజర్వాయర్లకు చుక్క నీరు రాదు. ఈ రిజర్వాయర్లకు నీరు రాకపోతే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఆయకట్టు ఎడారిగా మారనున్నది. లక్షల ఎకరాలు బీడు భూములుగా మారనున్నాయి. రాయలసీమ వాసులకు గుక్కెడు మంచినీరు దొరకడం కూడా కష్టం కానుంది. తన కేసుల కోసం కేంద్రానికి సాగిలపడి కృష్ణా జలాలను కూడా కృష్ణార్పణం చేసిన పాపాన్ని ప్రజలు ప్రశ్నించాలి.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Tags:    

Similar News