పార్టీ ఫిరాయింపులతో.. రాజకీయ అస్థిరత!

With party defections.. political instability!

Update: 2023-09-07 00:45 GMT

ఈ దేశానికి స్వాతంత్య్రమొచ్చిన తొలి నాళ్ళలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేస్తూ ఊపిరున్నంతవరకూ ఒకే పార్టీలో కొనసాగడమే కాకుండా మరణిస్తే తమ పార్థివ దేహంపై ఆ పార్టీ జెండాను కప్పి తమ అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆశించేవారు. కానీ నేడు కాలం మారింది. అధికారమే పరమావధిగా రాజకీయ నాయకులు అంగవస్త్రాలను మార్చినంత సులువుగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. మూడేసి పార్టీలు మార్చిన వారు సైతం ముఖ్యమంత్రులుగా అధికారాన్ని అనుభవిస్తున్నారు. అధికారం కోసం ఊసరవెల్లుల్ని మరిపించేలా రోజుకో పార్టీ మార్చుతూ తమను గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసమే మారాల్సి వస్తుందని నమ్మబలుకుతున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ప్రజల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. అయితే ఫిరాయింపులకు పాల్పడుతున్న నాయకులు మాత్రం ఆర్థికంగా, పదవుల పరంగా ప్రయోజనాలు పొందుతున్నారు.

ఫిరాయింపు చట్టం ఉన్నా!

ఒక పార్టీ దేశాన్ని, లేదా రాష్ట్రాన్ని పాలించడానికి అవసరమైన మెజార్టీని కలిగివున్నప్పుడు ఏ పార్టీ టికెట్‌తో నైనా చట్ట సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ప్రతిధులుగానే కొనసాగేవారు. కానీ కాల గమనంలో సంకీర్ణాల యుగం ప్రారంభమై జాతీయ పార్టీల ప్రాధాన్యత తగ్గి, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని ఇతర జాతీయ పార్టీతో అలయెన్స్ భాగస్వాములుగా మారి సదరు జాతీయ పార్టీకి కేంద్రంలో అధికారాన్ని అందించడానికి ఉపయోగపడడం ప్రారంభమైన తర్వాత పార్టీల ఫిరాయింపులు ఉధృతమైనవనే సత్యాన్ని జీర్ణించుకోక తప్పదు. తమను ఎన్నికల్లో గెలిపించిన పార్టీల పట్ల, సిద్ధాంతాల పట్ల కృతజ్ఞత లేకుండా అధికారం కోసం కళ్ళు చెదిరే ప్యాకేజీల ఆకర్షణ వలలో పడి యధేచ్ఛగా పార్టీలు ఫిరాయిస్తూ తమని గెలిపించిన తల్లి లాంటి పార్టీని గేలిచేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వైనం అత్యంత దురదృష్టకరం.

ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలనే కూల్చుతూ రాజకీయ అస్థిరతను సృష్టిస్తున్నారనే 1985లో యూపీఏ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని జారీ చేసింది. మళ్లీ 2003లో దానిని సవరించినా చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని పార్టీ మారిన ఉదంతాలను చూస్తున్నాం. ఇటీవలే ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసిన సంఘటనలతో రాజకీయ విలువలు అధఃపాతాళానికి చేరిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి లొసుగులను సరిచేయాలనే వాదన క్రమేణా బలపడుతోంది.

ప్రజాస్వామ్యం.. ఆచరణలో నియంతృత్వం

రాజ్యాంగం ప్రసాదించిన రాజకీయ స్వేచ్ఛతో తమ రాజకీయ పార్టీల సిద్ధాంతాల బలంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి తలలో నాలుకగా మారి వారి అభిమానాన్ని చూరగొనాల్సిన రాజకీయ విధానానికి కాలం చెల్లింది. ప్రస్తుతం కులాల కుంపట్లు రాజేస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతూ, ఓటర్లను ప్రలోభపెడుతూ నోట్ల కట్టల ద్వారా ధనవంతులే చట్ట సభల్లోకి ప్రవేశించగలుగున్నారు. పార్టీలు సైతం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఓ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవడం కన్నా అందులోని సగం ఖర్చుతో ఫిరాయింపు ద్వారా తమ పార్టీలో కలుపుకోవడం సులభమనే కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. ఫిరాయింపులు జరిగినప్పుడు హార్స్ ట్రేడింగ్ ద్వారా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లా కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం మా అభివృద్ధి కార్యక్రమాలతో ఆకర్షితులై మా ప్రభుత్వంలో చేరుతున్నారని బుకాయిస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి.

ఇటు గెలిచిన ఎమ్మేల్యేలు సైతం అధికారంలో వున్న వారికే అన్ని అభివృద్ధి పథకాలు, ఆర్థిక వనరులు సమకూర్చబడుతాయని రాజ్యాంగాన్ని విస్మరించి ఫిరాయింపుల ద్వారా అధికారానికి చేరువై స్వామి కార్యంతో పాటు కోట్లకు పడగెత్తాలనే తమ స్వకార్యం కూడా నెరవేరుతోందనే భావన ఉంటోంది. ఫలితంగా ప్రతిపక్షమే లేని ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని బుద్ధిజీవులనుకుంటున్నారు. ఈ చర్యల ఫలితంగా చట్ట సభల లోపలా, బయటా ప్రజల సమగ్ర అభివృద్ధికవసరమైన పాలనా విధానాల రూపకల్పనపై అధికార, విపక్షాల మధ్య అర్థవంతమైన చర్చ జరగాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడి ప్రజాస్వామ్యం ప్రహసనంగా మారుతోంది. ఫలితంగా ప్రజాస్వామ్యం ఆచరణలో నియంతృత్వ పాలనా విధానంగా రూపాంతరం చెందుతోంది. ఈ పరిణామం ప్రజలకూ, దేశానికి మంచిది కాదనే భావన సర్వత్రా వెల్లువెత్తుతోంది.

ఫిరాయింపులు అరికట్టడమెలా?

త్వరలో రాష్ట్రంలో, దేశంలో ఎన్నికలు జరగబోతున్నవేళ కోట్లాది రూపాయలను వెచ్చించి ఓటర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అధికార, విపక్షాలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు మేమే డబ్బు సంచులను పంపుతున్నామని గెలిచాక వారు మా పార్టీలోకి వస్తారని క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రులు చేస్తున్న బహిరంగ ప్రకటనలు రాజకీయాల్లో దిగజారుతున్న నైతిక విలువలకు దృష్టాంతంగా నిలిచిపోయేవే. ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఫ్రీ అండ్ ఫేర్‌గా ఎన్నికలను జరిపాల్సిన ఎన్నికల యంత్రాంగం అస్థిత్వానికీ, నిబద్ధతకు సవాల్ విసిరేవే. ఈ పరస్పర ఆరోపణలు ప్రపంచ రాజకీయ యవనికపై మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించేవే.

ఈ నేపథ్యంలో పార్టీల ఫిరాయింపు రాజకీయ రంగంలో ఓ అనైతిక చర్యగా సమాజం గుర్తించాలి. ఓ పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీ జెండా మోయడం ఆత్మహత్యా సదృశ్యంగా రాజకీయ పార్టీలు భావించాలి. ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నపుడు వారి గెలుపుకు కారకులైన ప్రజలు తమ తీర్పుని ధిక్కరిస్తూ ఇతర పార్టీలలోకి ఫిరాయిస్తున్న వారిని చిత్తు చిత్తుగా ఓడించాలి. అలాగే ఎన్నికల చట్ట సవరణ ద్వారా ప్రజాప్రతినిధి ఎన్నికలలో గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయింపుకు పాల్పడినా వారి శాసన సభ్యత్వాన్ని రద్దుచేయడంతో పాటు మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి. ఫిరాయింపుల నరికట్టినప్పుడే రాష్ట్రంలో, దేశంలో సుస్థిరతతో కూడిన పాలన కొనసాగి రాష్ట్రం, దేశం ప్రగతి పధం వైపు పయనిస్తాయి. రాబోయే ఎన్నికలలో మన రాష్ట్రంలో, దేశంలో ఫిరాయింపులకు ఆస్కారం లేని రాజకీయాలు కొనసాగి ప్రపంచ వేదికపై మన ప్రజాస్వామ్య వ్యవస్థ తిరుగులేని పాలనా విధానంగా వెలుగొందాలనే బుద్ధిజీవుల కలలు నెరవేరుతాయో లేదో కాలమే తేల్చిచెప్పాలి.

డా. నీలం సంపత్,

సామాజిక కార్యకర్త

98667 67471

Tags:    

Similar News