ధరల పెంపుతో...బీజేపీ కుదేల్!
With increase in prices, the BJP has put the common people in trouble
త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అతి పెద్ద ఎజెండా ధరల పెంపుదలే అంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి మొదటి నుంచి వ్యాపారులకు మద్దతిచ్చే బనియా పార్టీగా ముద్రపడిన బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలకు హద్దు, అదుపు లేకుండా పోతుంది. ఈ ధరాఘాతంతో సామాన్యులు కోలుకోలేని దెబ్బలకు విలవిల్లాడుతున్నారు. నిరు పేద మధ్యతరగతి ప్రజలపై ప్రతిరోజు ఏదో ఒక నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల భారం పడుతూనే ఉంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ 2014లో రూ.399 ఉంటే ఇప్పుడు రూ.955కి పెరిగింది, రూ.71, రూ.55గా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మోదీ పాలనలో ఏకంగా సెంచరీని దాటేసాయి. 2014 నుంచి ఇప్పటిదాకా బీజేపీ డీజిల్ పై 512 శాతం, పెట్రోల్‌పై 194 శాతం చొప్పున ఎక్సైజ్ పన్నులు పెంచేసింది. దీంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి.
మోత మోగనున్న ఉల్లి ధర!
నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడంతో, సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది. కనీసం కడుపునిండా తిండి తినే పరిస్థితి కూడా కనిపించడం లేదు. 2014లో బియ్యం కిలో 27 రూపాయలు ఉంటే ఇప్పుడు 52 రూపాయలకు పెరిగింది. ఉల్లిపాయలు రూ. 17 ఉంటే కొన్ని మహానగరాల్లో ఇప్పుడు 80కి చేరింది. గోధుమపిండి రూ. 22 ఉంటే ఇప్పుడు 60కి చేరింది. ఇలా ఉప్పు, పప్పు వంటివి సైతం పెరిగాయి. మొన్నటి వరకూ టమోటా ధరలు 'మోత' మోగించగా, ఇప్పుడు మార్కెట్లో ఉల్లిగడ్డ ధర కొండెక్కి కూర్చున్నాయి. గత నెలరోజుల వ్యవధిలో ఉల్లి ధర దాదాపు రెట్టింపు అయింది. దేశవ్యాప్తంగా సగటు ఉల్లి ధర 57 శాతం పెరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖకు, మార్కెట్ వ్యవస్థ మధ్య సమన్వయం లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులపై వాటి కొరతలపై సరైన అంచనాలు లేవు. మార్కెట్ ధరల పరిశోధన, అధ్యయనం శాస్త్రీయంగా లేవు. ప్రతిసారి మార్కెట్ అంచనాలు స్థిరంగా ఉండటం లేదు.
ఉదాహరణకు ఈ ఏడు ఖరీఫ్ పంట ఉత్పత్తి ఆలస్యం కావడంతో, ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, వినియోగదారులు వాపోతున్నారు. మరొకవైపు ధరలను నియంత్రించే పేరుతో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది. బియ్యం, గోధుమలు, చక్కెర తదితర పంటలు మన దేశంలో బాగా పండినప్పుడు కొరత ఉన్న రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతులపై నిషేధాలు, ఆంక్షలు విధిస్తుంది. దానితో మన రైతులకు తమ పంటలపై లాభాలు వచ్చే అవకాశాలను కోల్పోతున్నాడు. మన దేశాల ఎగుమతులపై విదేశాలు ఎక్కువ పన్నులను వసూలు చేస్తున్నాయి. ఆ విధంగా కూడా మన రైతులు నష్టపోతున్నారు. మన దగ్గర గోధుమలు, చక్కెర బాగా నిలువ ఉన్నప్పుడు అనాలోచితంగా అవే ఉత్పత్తులను రాయితీలు ఇచ్చి విదేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నారు. అప్పుడు విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరలకే మన ఉత్పత్తులను అమ్ముకొనే దుస్థితి మన రైతులకు దాపురించింది.
ఎన్నికలు రావడంతో..
ఈ ధరల పెరుగుదలతో కుటుంబ వ్యయం బాగా పెరుగుతుంది. నిత్యావసర ధరలతో ఒక సామాన్యుడి కుటుంబం తడిసి మోపెడు అవుతుంది. అంచనాలకు అందనంతగా ధరాఘాతంతో వారి బతుకులు అతలాకుతలం అవుతున్నాయి. ఓవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నా సామాన్యుడి ఆదాయం మాత్రం పెరగడం లేదు. కుటుంబానికి వస్తున్న నెలసరి ఆదాయానికి, ధరల పెరుగుదల కారణంగా అవుతున్న ఖర్చుకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు.
ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం జిమ్మిక్కులు మామూలుగా లేవు. సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రానున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలను కొంత మేర తగ్గించింది... బీజేపీ చేతలన్నీ కేవలం ఎన్నికల వ్యూహాలే తప్ప ప్రజల సంక్షేమంపై నిబద్ధత కానరాదు. ఎంతసేపు కార్పోరేట్లకు మేలు చేకూర్చడమే తప్ప సామాన్య ప్రజల అగచాట్లను ముఖ్యంగా పేదల మధ్యతరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగం, ఉపాధి కరువు దానితో పాటు ఈ ధరల పెరుగుదల పెను భారం మోసే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రానున్న ఎన్నికలలో అధికార పక్షానికి సరైన గుణపాఠం చెబుతారు. కల్లబొల్లి మాటలతో అన్నిసార్లు సామాన్య ప్రజలను బోల్తా కొట్టించలేరు. ప్రజలు తమ నిత్య జీవిత అనుభవాల నుండి చైతన్యం పొందుతారు. సుదీర్ఘ ఉపన్యాసాలకు,శుష్క వాగ్ధానాలకు, తాత్కాలిక తాయిలాలకు ఎంతో కాలం మోసపోరు.
డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496