ఉద్యమ ద్రోహులకే రెడ్ కార్పెట్ పరుస్తారా..?
తెలంగాణ అమరవీరులు త్యాగాలతో, తెలంగాణ ఉద్యమకారుల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు ఒక కుటుంబం చేతిలో బందీ అయినట్లుంది.
తెలంగాణ అమరవీరులు త్యాగాలతో, తెలంగాణ ఉద్యమకారుల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు ఒక కుటుంబం చేతిలో బందీ అయినట్లుంది. ఇంకా 30 సంవత్సరాల పాటు పటిష్టంగా ఉండే పాత సచివాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రి తన మూఢ నమ్మకాల కోసం కూల్చివేసి వేలకోట్ల రూపాయలతో నూతన సచివాలయం నిర్మించారు. ఈ సచివాలయంలో ప్రవేశం విషయానికి వస్తే రేపటినుండి తెలంగాణ ఉద్యమ ద్రోహులకే రెడ్ కార్పెట్ పరుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
నీళ్లూ, నిధులూ, నియామకాలూ..?
వేలకోట్ల రూపాయలతో నూతన సెక్రటేరియట్ నిర్మించడం కంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు ఏ కలలు కని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారో ఆ నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజలకు చేరాలి. కానీ ఈరోజు ఆ నీళ్లను, ప్రధాని కావాలని కలలు కంటున్న కేసీఆర్ పొరుగు రాష్ట్రాలకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇక నిధుల విషయానికి వస్తే ఈ రోజు ప్రధాన కాంట్రాక్టర్లు అందరూ ఆంధ్రావాళ్లే కావడం గమనార్హం. మెగా సంస్థ నుంచి మొదలుపెడితే ఈ రోజు తెలంగాణలో నిర్మాణమవుతున్న ప్రాజెక్టులు అన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు కడుతున్నవే.
అమరుల కుటుంబాలకు అటెండర్ పోస్టులు..
ఇక నియామకాలంటారా.. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి కుటుంబీకులు. కానీ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు కేవలం మిగిలింది అటెండర్ ఉద్యోగాలు మాత్రమే. కెసిఆర్ కుటుంబంలో ఉద్యమం నడిపిన వారికి రాజ్యాంగ ఉన్నత పదవులు లభిస్తే తమ భవిష్యత్తును పణంగా పెట్టి ఉద్యమాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులకు మిగిలింది అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన ఏ రోజూ ఇంతటి నిర్బంధాన్ని తెలంగాణ ఉద్యమకారులు చూడలేదు.
ప్రాణత్యాగాలకు గుర్తింపు ఏది..?
ఈ రోజు తెలంగాణ సెక్రటేరియట్ నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించిన, 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన కేవలం తమ రాజకీయాలకే కానీ సామాన్య తెలంగాణ ప్రజల కోసం కాదు. నిజంగా కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదట ఈరోజు నూతన సెక్రటేరియట్లో చేయవలసిన మొట్టమొదటి సంతకం తెలంగాణ అమరుల కుటుంబాలకు చెందిన 1386 మందిని గుర్తిస్తూ జీవో జారీ చేయడం. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపునిస్తూ జీవో జారీ చేయడం. ఇప్పటికైనా కేసీఆర్ నూతన సచివాలయంలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణ ప్రజల సాధక బాధకాలు చూస్తారేమో అని తెలంగాణ ప్రజలు కలలు కంటున్నారు. మరి రేపటి నుండి సచివాలయ ప్రవేశం తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారికా? లేక తెలంగాణ ఉద్యమ ద్రోహులకా?
ఎం. రఘుమా రెడ్డి,
తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ అమర వీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక
83282 12979