నిరంతర సినిమా దార్శనికుడు..
సంక్లిష్ట సమస్యలకు సాధారణ పరిష్కారాలు ఉండవు, ఒకవేళ తీవ్రమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు ఉంటాయని ఎవరైనా విశ్వసిస్తే అది కేవలం
‘సంక్లిష్ట సమస్యలకు సాధారణ పరిష్కారాలు ఉండవు, ఒకవేళ తీవ్రమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు ఉంటాయని ఎవరైనా విశ్వసిస్తే అది కేవలం హాస్యాస్పదమయినా అయివుండాలి లేదా వారి ఆమాయకత్వమయినా కావాలి’ అని విశ్వసించే దర్శకుడు దార్శనికుడు శ్యాం బెనెగల్. దర్శకుడిగా కళాత్మకతను వాస్తవికతను మేళవించి అనేక ప్రభావవంతమైన సినిమాల్ని రూపొందించిన దర్శకుడు శ్యాం బెనెగల్. మన దేశంలోని సంక్లిష్ట సామాజిక స్థితిగతుల్ని, వైవిధ్యాల్ని, వైరుధ్యాలనీ తన సినిమాల్లో ఆవిష్కరించినవాడాయన. దృశ్య మాధ్యమం ముఖ్యంగా సినిమా సమాజానికి సహజత్వానికీ దగ్గరగా వుంది. ఓ వ్యాఖ్యానంలా ఉండాలని భావించాడాయన. బెనెగల్ ‘వాస్తవీకరించబడిన కళా రూపమే సినిమా’అన్నాడు. తన 90 ఏండ్ల జీవితంలో ఉద్వేగంతో నిండిన ఉత్సాహంతో ఉన్నాడాయన.
ఇటీవలే డిసెంబర్ 14న శ్యామ్ బెనెగల్ తన 90 వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహి తుల మధ్య జరుపుకున్నారు. ఎప్పుడూ అంత ఘనంగా జన్మదినం జరుపుకోని బెనెగల్ మిత్రుల చొరవతో ఆ రోజు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆ ఉత్సవంలో నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, కుల్‌భూషన్ కర్భందా లాంటి గొప్ప నటులు హాజరయ్యారు. కానీ ఉత్సవం జరిగిన పదిరోజులకే ఆయన సెలవంటూ సినీ రంగాన్ని, ఈ లోకాన్ని వదిలేసి పోయారు. సమాంతర అర్థవంతమైన సినిమా రంగంలో ఆయన మిగిల్చిన శూన్యం ఎవరూ పూడ్చలేనిది.
సినిమా కళను పరిపుష్టం చేసినవాడు
శ్యాం బెనెగల్ నిర్మించిన సినిమాలూ, సీరియల్స్ భారతీయ సినిమా రంగాన్ని ఎంతో పరిపుష్టం చేసాయి. సత్యజిత్ రేతో అత్యంత ప్రభావితుడైన బెనెగల్ సినిమాల్ని రూపొందించడంలో తన సొంత స్వరాన్ని రూపొందించుకున్నారు. ‘భాషా సంస్కృతులే మతానికన్నా ప్రధానమయినవి అని నమ్మిన బెనెగల్ తన సినిమాల్లో సమాజమూ సామాజిక సమస్యల పైననే దృష్టి పెట్టారు. విరివిగా సినిమాలూ, సీరియల్లూ తీసి అలసటెరుగని చలన చిత్రకారుడిగా నిలబడ్డాడు. తన 90 ఏళ్ల సంపూర్ణ జీవితాన్ని చూసిన బెనెగల్ కళాకారుడికి అలసట సంతృప్తి ఉండదని అన్నట్టుగా వైభవోపేత కళాత్మక జీవితాన్ని గడిపి సెలవంటూ వెళ్ళిపోయారు.
హైదరాబాద్‌లో బాల్యం, విద్య
కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 23 సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు పలికారు.. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శ్యాం బెనెగల్ హైదరాబాద్ బోలారం కంటోన్మెంట్‌లో తన బాల్యాన్ని గడిపారు. బెనగళ్ళ శ్యాం సుందర్ రావుగా చాలా పెద్ద కుటుంబంలో జన్మించిన ఆయన చదువు హైదరాబాద్ లో జరిగింది. తన ఎం.ఏ.ను నిజాం కాలేజీలో పూర్తి చేసుకున్నారు. ఆయన తండ్రి మంచి ఫోటోగ్రాఫర్. 1934లో జన్మించిన బెనెగల్ 1959 నుంచి 63 దాకా లింటాస్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో ఫిలిమ్స్ అసిస్టెంట్ గా పనిచేసాడు. ఆ తర్వాత బ్లేజ్ కంపనీలో పదేళ్ళ పాటు వున్నాడు. 1970లో హోమిబాబా ఫెల్లోషిప్ పొంది అమెరికా బోస్టన్ లో టి.వీలలో అసోసియేట్ ప్రొడ్యుసర్‌గా పనిచేసాడు. బాంబే చేరిన బెనెగల్ అడ్వర్టైజ్మెంట్ రంగంలో పనిచేస్తూనే పూర్తి నిడివి సినిమాల వైపునకు దృష్టి సారించాడు. మొట్టమొదట ‘చరందాస్ చోర్’ సినిమా తీసాడు. అందులో స్మితాపాటిల్ తన సినీ జీవితాన్ని ఆరంభించింది.
తెలంగాణ జీవిత చిత్రణ.. అంకుర్
బెనెగల్ నిజాం కాలేజీలో ఎం.ఏ చదువుతున్న కాలంలో తానే రాసుకున్న కథ ఆధారంగా ‘అంకుర్’ నిర్మాణానికి పూనుకున్నాడు. తెలంగాణాలోని ఫ్యూడల్ వ్యవస్థ వికృత రూపాన్ని, అది చేసే విశృంఖల అమానవీయ నృత్యాన్ని ఆ నృత్యం కింద పక్కటెముకలు విరిపోతున్న సామాన్య జన జీవితాన్ని ఆవిష్కరించాడు. అత్యంత మానవీయ కోణంలో వాస్తవిక దృష్టితో అంకుర్ రూపొందింది. చివరి సన్నివేశంలో ఓ బాలుడు వెనక్కి తిరిగి భూస్వామి ఇంటి పైకి రాయి విసిరే దృశ్యం గొప్ప ప్రతీకాత్మకంగా వుండి గొప్ప సినిమా స్థానాన్ని పొందింది. అంకుర్‌తో షబానా ఆజ్మీ చిత్ర రంగ ప్రవేశం చేసింది. చరందాస్ చోర్‌తో స్మిత, అంకుర్‌తో షబానాలను సినిమా రంగానికి పరిచయం చేసిన శ్యాం బెనెగల్ అనేక మంది గొప్ప నటుల్ని తొలిసారిగా తెర మీదికి తెచ్చారు. బెనెగల్ సినిమాల్లో నసీరుద్దీన్ షా, ఓంపురి, అమ్రీష్ పూరి, అనంత్ నాగ్, మోహన్ అగాసే, కుల్భూషన్ ఖర్బందా, ఇలా అరుణ్, నీనా గుప్తా, కే.కే. రయినా లాంటి అనేకమంది ప్రతిభను వెలుగులోకి తెచ్చారు బెనెగల్.
లైంగిక దోపిడీకి అద్దం పట్టిన నిశాంత్
అంకుర్ తర్వాత బెనెగల్ తీసిన సినిమా ‘నిశాంత్’. 1975, సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రంలో గిరీష్ కర్నాడ్, అమ్రీష్ పురి, షబానా అజ్మీ, అనంత్ నాగ్, సాధు మోహర్, స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు. విజయ్ టెండూల్కర్ రచనలో సత్యదేవ్ దూబే మాటలు రాసిన ఈ చిత్రం నసీరుద్దీన్ షా తొలి చిత్రం. ఫ్యూడలిజం నేపథ్యంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత వర్గాల వారి దౌర్జన్యం, మహిళలపై జరిగే లైంగిక దోపిడీల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది. నిశాంత్ 1976 లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, 1977 మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 1977లో జరిగిన చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి గోల్డెన్ జ్ఞాపికను అందుకుంది.
5 లక్షల మంది రైతుల సినిమా మంథన్
ఆ తర్వాత బెనెగల్ రూపొందించిన సినిమా ‘మంథన్’. మొట్టమొదటి క్రౌడ్ ఫండెడ్ సినిమా. అయిదు లక్షల మంది రైతులు ఒక్కొక్కరు రూ. 2 చొప్పున ఇచ్చిన విరాళంతో మంథన్ నిర్మితమయింది. డాక్టర్ కురియన్ సహకారంతో ఈ సినిమా రూపొందింది. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటు, వారి కృషి ఫలితంగా గుజరాత్‌లోని ఆనంద్‌లో పాల విప్లవం రావడం అది కాస్తా శ్వేత విప్లవంగా రూపాంతరం చెందటాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమా తీశారు బెనెగల్. ఇందులో కురియన్ ప్రేరణగా రూపొందిన పాత్రలో గిరీష్ కర్నాడ్, ఇతర పాత్రల్లో స్మితాపాటిల్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పూరీ తదితరులు నటించారు.
కళాత్మక సినిమా భూమిక
ఇక ఆ తర్వాత బెనెగల్ తర్వాతి చిత్రం ‘భూమిక’. అది ఆయనలోని కళాత్మక దృష్టికి ప్రతిబింబం. సుప్రసిద్ధ నటీమణి హంసా వాడేకర్ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలను ఈ సినిమా ప్రతిభావంతంగా వాస్తవికంగా చిత్రించింది. స్మితా పాటిల్ హన్సా పాత్రను పోషించింది. ఇట్లా సాగిన శ్యాం బెనెగల్ చలన చిత్ర జీవితంలో అనేక సినిమాలు తీసాడు. వాటిల్లో కొండూరా, అనుగ్రహం, జునూన్, కలియుగ్, ఆరోహన్ మండి, త్రికాల్ సుష్మన్, మమ్మో, సూరజ్ కా సాతవా ఘోడా, సమర్, హరి భరి, జుబేదా, వెల్డన్ అబ్బా లాంటి ఎన్నో గొప్ప సినిమాలున్నాయి. వాటితో పాటు భారత్ ఏక ఖోజ్, అమరావతి కి కహాని’ లాంటి టీవీ సీరియల్స్ కూడా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శ్యాం బెనెగల్ రూపొందించిన సినిమాలు వాటి క్రమమూ, నేపధ్యమూ, ప్రభావమూ పరిశీలిస్తే భారతదేశ చరిత్ర అందులో అణగారిన వారి జీవితాలూ సంస్కృతి కనిపిస్తాయి. స్వాతంత్రానంతర భారతంలో జరిగిన సామాజిక రాజకీయ ఆర్థిక మార్పులు అన్నీ స్పష్టమవుతాయి. ఆయన సినిమాలు సామాజిక విప్లవాత్మకమయినవే కాకుండా కళాత్మకమూ, సాధికారికం అయినవి. ఆయన పని రాక్షసుడు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తూ నివాళి అర్పించడమే కళాభిమానులుగా అర్థవంతమైన సినిమా ప్రేమికులుగా మనం చేయగలిగింది.
వారాల ఆనంద్
94405 01281