‘ఇండియా’ కూటమి తీరం చేరేనా!

Will the I.N.D.I.A Alliance succeed?

Update: 2023-08-01 00:45 GMT

చ్చే 2024 సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టకుండా, నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా నిలువరించడానికి దేశంలోని 26 పార్టీలు కలిసి ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలియన్స్)గా జతకట్టాయి. భారత్ జోడో యాత్రతో నూతన ఉత్సాహంతో ఉండడమే కాకుండా ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయంతో మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ విపక్షాలన్నిటిని ఏకతాటిపై తెచ్చి జతకట్టే ప్రయత్నంలో కొంతవరకు సఫలీకృతమైందని అనొచ్చు.

దక్షిణాదిలో...

ఇండియా 26 జాతీయ, ప్రాంతీయ పార్టీల కలయికతో ఏర్పడ్డ కూటమి. ఈ కూటమి రాజకీయ దురంధరుల నేతృత్వంతో ప్రస్తుతానికి బలంగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ కూటమి లోక్ సభలో 143 సీట్లు కలిగి ఉంది. అలాగే రాజ్యసభలో 245 సీట్లకు గాను 98 సీట్లు కలిగి ఉంది. దేశం మొత్తంలోని 4036 అసెంబ్లీ స్థానాలకు గాను 1934 చోట్ల ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 11 చోట్ల అధికారంలో ఉంది. ఇక ప్రాంతాల వారీగా బలాలను బేరీజు వేసుకుంటే దక్షిణాదిన కేరళలో ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ నేతృత్వంలోని ఎల్‌డి‌ఎఫ్ కూటమి, అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని మరోకూటమి యూడిఎఫ్ కూడా బలంగా ఉంది. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే 34 పార్లమెంటు స్థానాలను (24 లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు) కలిగి ఉంది. వైగోకు చెందిన ఎండీఎంకే కూడా మద్దతుగా ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి మద్ధతిస్తారనేది సస్పెన్స్‌గానే ఉంది. వీరిలో కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఈ విషయమై సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు.

ఉత్తరాదిలో...

ఇక ఉత్తరాది రాష్ట్రాల విషయానికి వస్తే, ఇండియా కూటమికి పేరు పెట్టిన మమత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవల ఆ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల్లో భారీగా గెలిచి తన పట్టును కొనసాగిస్తోంది. అలాగే అక్కడ సుదీర్ఘ కాలం పాలించిన కమ్యూనిస్టు పార్టీ కూడా కూటమిలో భాగస్వామిగానే ఉండడం కలిసి వచ్చే అంశం. ఇక ఇండియా మొదటి సమావేశానికి వేదికైన బీహార్ విషయానికి వస్తే అప్రతిహాసంగా విజయ యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీఎస్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలు బలంగా ఉన్నాయి. మహారాష్ట్రలో శరత్ పవార్ ఎన్‌సీపీ పార్టీ, ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన పార్టీలు జట్టు కట్టాయి. దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన కేజ్రీవాల్ హయాంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో బలీయ శక్తిగా ఎదిగింది. వారు ఈ కూటమికే మద్దతు తెలపడం విశేషం. అలాగే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదర్ ఎస్పీ పార్టీ, జమ్ము కాశ్మీర్లో ఫారుక్ అబ్దుల్లా, ముక్తి మహబూబ్ పార్టీలు కూటమికి మద్దతు అందిస్తున్నారు.

పొత్తుల పంచాయతీ తెగేనా!

ఇండియా కూటమి మొత్తంగా చూస్తే బలంగా కనబడుతున్నప్పటికీ, మెజార్టీ రాష్ట్రాలలో కూటమిలోని పార్టీలు గత ఎన్నికల్లో ప్రధాన పక్షాలుగా పోటీపడ్డాయి. బీహార్లో నితీష్ కుమార్, లాలు తనయుడు తేజస్వీ యాదవ్ నువ్వా నేనా అన్నట్టు మాటల యుద్ధంతో తలపడ్డారు. అలాగే పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు కుస్తీ పడ్డాయి. ఇలా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తోనో, లేదా ప్రతిపక్ష పార్టీతోనో ప్రాంతీయ పార్టీలు గత ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. ఇప్పుడు ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతున్నది. రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవు అనేది నానుడి. కానీ క్షేత్రస్థాయిలో విరోధి పార్టీ కార్యకర్తలతో ఒక్కసారిగా మిత్రుత్వం వస్తే సీట్ల పంపిణీ విషయంలో కూడా పేచీలు వచ్చే అవకాశం మెండుగా కనబడుతున్నది.

ఇండియా కూటమికి వెన్నెముక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, ప్రధాని పీఠానికి రేసులో ఉండదని ముందుగానే అస్త్ర సన్యాసం చేశారు. ఇక మిగిలినవారిలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బలమైన అభ్యర్థిగా కనబడుతున్నప్పటికీ ఆమె అభ్యర్థిత్వాన్ని మిగిలిన పార్టీలు సమర్థిస్తాయా? ఇప్పటికే ప్రధాని రేసులో నేను కూడా ఉన్నాను అంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్థిస్తారా? అలాగే మేధావి వర్గంలో మంచి పేరును సంపాదించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ వైపు మొగ్గు చూపుతారా? లేదా అన్ని పార్టీల సమన్వయంతో కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేనే ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంటారా అనేది తేలాలంటే ముంబైలో జరిగే కూటమి మూడవ సమావేశం వరకు వేచి చూడాల్సిందే.

బొల్లం సునీల్ కుమార్

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

90596 66011

Tags:    

Similar News