‘విశ్వ’విద్యకు పూర్వవైభవం దక్కేనా..!

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భావం అనంతరం విశ్వవిద్యాలయాల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గత ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్ర

Update: 2024-06-22 01:15 GMT

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భావం అనంతరం విశ్వవిద్యాలయాల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గత ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్ర యూనివర్సిటీల అభివృద్ధిని పాతరేసి, విధ్వంసానికి పాల్పడింది, పైగా అదే సమయంలో ‘ప్రైవేటు యూనివర్సిటీల’ ఏర్పాటుకు ద్వారాలు తెరిచి నిరుపేద విద్యార్థులను ‘ఉచిత చదువులకు’ దూరం చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

‘విశ్వవిద్యాలయాలు’ మానవత్వానికి, సహనానికి, తర్కానికి, సాహసోపేత ఆలోచనలకు, సత్యశోధనాల కోసం నిలబడాలని ఆనాడు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆకాంక్షించినట్టే.. స్థానిక అంశాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలన్నా..విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పాలన్నా, ఉన్నత విద్యావకాశాలు ఉచితంగా దక్కాలన్నా..చైతన్యవంతులైన పౌరులతో పాటు సామాజిక బాధ్యత కలిగిన నాయకులను తయారుచేస్తూ..సమాజ ప్రగతి జరగాలన్నా ఆ ప్రాంతంలో ‘విశ్వవిద్యాలయం’ అందుబాటులో ఉండటం అత్యంత కీలకం. అందుకే ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. మౌలిక వసతులు, నైపుణ్యాలను మెరుగుపరుస్తూ, బోధనను సులభతరం చేసేలా విస్తృత స్థాయిలో నియామకాలు చేపడుతుంటారు. కానీ, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ విషయం తారుమారైంది.

తిరోగమనంలో.. విశ్వవిద్యాలయాలు

గత పదేళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విశ్వవిద్యాలయ విద్యను పూర్తిగా విధ్వంసం చేసింది. ఉస్మానియా, కాకతీయతో పాటు అప్పటికే ఉన్న 15 విశ్వవిద్యాలయాల నిర్వహణకు, సంక్షేమానికి నిధులు కేటాయించలేదు. పైపెచ్చు ఇన్చార్జిల రెండేళ్ల పాలన కారణంగా నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. అనంతరం కొత్తగా వీసీలను నియమించినా.. పనితీరులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, నిధుల లేమి.. వెరసి పూర్వవైభవం కోల్పోయే దుస్థితికి దిగజారాయి. ఫలితంగా కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకుల్లో మన ప్రాంత విశ్వవిద్యాలయ ర్యాంకులు పడిపోయాయి. శాతవాహన, తెలంగాణ వంటి కొన్ని కొత్త యూనివర్సిటీలు ఏర్పడి 16 సంవత్సరాలు పూర్తవుతున్నా వాటిలో కొత్త కోర్సులు అందుబాటులోకి రాలేదు. ఇంజినీరింగ్, లా, బీఎడ్ వంటి అనుబంధ కళాశాలలను ఏర్పాటు చేయలేదు. బ్లాక్ గ్రాంట్ నిలుపుదల కారణంగా సిబ్బంది జీతభత్యాలకు వెంపర్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశోధనలకు బాటలు వేసే ప్రయోగశాలలు అగమ్యగోచరంగా మారాయి. గ్రంథాలయాలు అస్తవ్యస్తమయ్యాయి. మౌలిక వసతుల కల్పన ఊసే లేకుండా పోయింది. మొత్తంగా విశ్వ విద్య తిరోగమనంలో పడిపోయింది.

బోధన లేకుండానే పరీక్షలు.. ఫలితాలు..

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో 80 శాతం ప్రొఫెసర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒక ప్రొఫెసర్ పోస్టు తప్పకుండా ఉండాలి. కానీ, ఇప్పటికీ వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా పోటీ పరీక్షల్లో కష్టపడి ర్యాంకులు సాధించి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందకుండా పోయింది. బోధించే వారు లేక కొన్ని కళాశాలల్లో కోర్సులు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. పాఠాలు వినక, పరిశోధనలు చేయక. అసలు విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారు, ఎలా పట్టభద్రులవుతున్నారనేది సందేహాస్పదమే. నియామకాల కోసం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందకుండా చివరకు న్యాయస్థానం జోక్యంతో రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లి పెండింగ్‌లో పడిపోయింది. ఓ దశలో యూనివర్సిటీల పాలనను ముఖ్యమంత్రి పరిధిలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

నామమాత్రపు పట్టాలు ఎందుకు?

రాజకీయ జోక్యం పెరిగితే విశ్వవిద్యాలయాలు నామరూపాల్లేకుండా పోతాయని, ఈ విధ్వంస రచనను మానుకోవాలని మేధావులు చేసిన వ్యతిరేకత కారణంగా ఆ ఆలోచన అమలు చేయకుండా నిలిపేశారు. వైద్య శాఖలో ప్రత్యేక శ్రద్ధతో ఆగమేఘాల మీద ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు మాత్రం మొండిచేయి చూపింది. మరోవైపు వయోపరిమితి దాటిపోతున్నా తాత్కాలిక ప్రొఫెసర్ల క్రమబద్ధీకరణ లేక, బోధనేతర సిబ్బంది నియామకం చేపట్టక, ప్రతిభావంతులైన ప్రొఫెసర్లు లేక పరిశోధనలు కుంటుపడుతున్నాయి. అసౌకర్యాల నడుమ యూనివర్సిటీలు కేవలం పట్టభద్రులను తయారుచేసే కర్మాగారాలుగా మారాయి. దీంతో సరైన ప్రతిభ లేకుండా నామమాత్రపు పట్టాలతో విద్యార్థులు బయటకొచ్చి, పోటీ ప్రపంచంలో అవకాశాలు దక్కించుకోలేక నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఏర్పడింది. ఏళ్లుగా నియామకాల ప్రకటన కోసం వేచి చూసి వయోపరిమితి దాటిపోయిన నిరుద్యోగ పట్టభద్రులు లెక్కలేనంతమంది. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగ విరమణ పొందే ప్రొఫెసర్ల గరిష్ట వయసును 65 సంవత్సరాలకు పెంచాలన్న ఆలోచన పక్కనపెట్టి , నూతన నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తే నిరుద్యోగ పట్టభద్రులకు అవకాశాలు మెరుగవుతాయి.

ప్రైవేట్ మాఫియాని ప్రోత్సహించి..

ప్రభుత్వ విద్యారంగానికి సమాంతరంగా ప్రైవేటు మాఫియాని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెరిగిన కొత్త జిల్లాల్లో నూతనంగా మంజూరు చేయాల్సిన ప్రభుత్వ రాష్ట్ర విశ్వవిద్యాలయాల సంగతి పక్కన పెట్టింది. అవసరం లేకపోయినా ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు బిల్లుకు ఆగమేఘాల మీద ఆమోదం తెలిపింది. కేవలం తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు మహీంద్రా, వోక్సెన్‌, మల్లారెడ్డి, ఎస్.ఆర్., అనురాగ్ పేరిట అయిదు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును గవర్నర్‌తో ఆమోదింపజేసుకున్నారు. అదనంగా మరో అయిదింటిని ఏర్పాటు చేయాలనుకున్నా, ఆ బిల్లును గవర్నర్ తిప్పి పంపించారు. ప్రభుత్వ అనాలోచితం కారణంగా ఈ అయిదు విశ్వవిద్యాలయాల్లో అప్పటికే ప్రవేశం పొందిన దాదాపు 40 వేల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనుమతి వచ్చిన యూనివర్సిటీల్లోనూ నిబంధనలకు పాతరేశారు. సరైన భవనాలు లేకపోయినా, లీజు, ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో వీటిని ప్రారంభించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్రైవేట్ వర్సిటీల్లో నో రిజర్వేషన్

ఈ ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి పర్యవేక్షణ లేకుండా వీటికి ప్రత్యేక నిబంధనలు రూపొందించడం అనుమానాలకు తావిచ్చింది. ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయకపోవడం విడ్డూరం. తాజాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రిజర్వేషన్లు అమలు చేస్తామని, ప్రవేశాలపై ఆంక్షలు విధిస్తామని, ఫీజుల నియంత్రణకు కమిటీలు నియమిస్తామని, అవసరమైతే చట్ట సవరణ చేపడుతామని ప్రకటించడం ఊరటనిచ్చే విషయం. అదే సమయంలో భౌగోళికంగా పెద్దదైన ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని. నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య విశ్వవిద్యాలయం నెలకొల్పుతామని, ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలివ్వడం మార్పునకు సంకేతంగా భావించొచ్చు.

నంగె శ్రీనివాస్

ప్రిన్సిపాల్, విద్యా విశ్లేషకుడు

94419 09191

Tags:    

Similar News