మార్చి నెల నుండి ఉద్యోగ విరమణలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ పొందకుండానే రిటైర్ అవుతామేమో అన్న నిరాశలో ఉపాధ్యాయులు ఉన్నారు. సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండా రిటైర్ అయ్యేవారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. గత ఎనిమిదేళ్లుగా పదోన్నతులు లేకుండా ఉన్న ఏకైక శాఖ విద్యాశాఖ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఒకే పాఠశాలలో పుష్కరకాలం పూర్తిచేసి బదిలీల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ లోకానికి నూతన ప్రభుత్వం దారి చూపిస్తుందేమోనన్న ఆశతో ఉంటున్న తరుణంలో గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా డిప్యుటేషన్‌లకు తెరతీయడం ఉపాధ్యాయ లోకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. యాదాద్రి జిల్లా నుండి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాకు ఒక సంవత్సరం డిప్యుటేషన్ పేరుతో ఉత్తర్వులు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులోనూ తమ దగ్గరి వారికి అనుకూల పాఠశాలను కేటాయించడం శోచనీయం.
తాత్కాలిక టీచర్లు.. కంటితుడుపు చర్యే!
టీచర్ల ప్రమోషన్లు వారి వ్యక్తిగత ప్రయోజనంగా భావించకూడదు. ఆ దృష్టితో చూడకూడదు. అది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు, వారి విద్యాభ్యాసానికి, పాఠశాలవిద్య బలోపేతానికి చెందిన అంశంగా భావించాలి. పాఠశాలకు దిశానిర్దేశం చేసే ప్రధానోపాధ్యాయుల పోస్టులు చాలా హైస్కూళ్లలో ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఇంచార్జ్‌ల పాలనే కొనసాగుతోంది. అలాగే సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. బోధించే టీచర్లులేక విద్యార్థులు ఆ సబ్జెక్టులకు దూరమవుతున్నారు. ఇవేవీ పట్టని అధికారులు మాత్రం వందశాతం ఉత్తీర్ణత తేవాలని టీచర్లకు టార్గెట్‌లు విధిస్తున్నారు. తాత్కాలికంగా వర్క్ అడ్జస్ట్మెంట్‌లు, డిప్యూటేషన్ల పేరుతో హైస్కూల్‌కి కేటాయిస్తున్నారు. ఇది కంటితుడుపు చర్యగా కొనసాగుతున్నది.
విద్యాశాఖలో పూర్తిస్థాయిలో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు లేరు. పాఠశాలల్లో హెడ్ మాస్టర్లు లేరు, రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు కోకొల్లలు. పరిస్థితి ఇలా ఉంటే విద్యావ్యవస్థ సమర్థవంతంగా ఎలా నడుస్తుంది? విద్యా లక్ష్యాలు ఎలా సాధించబడతాయి? ఇంకెంతకాలం ఇంచార్జ్‌ల పాలన కొనసాగుతుంది? టీచర్లకు న్యాయంగా రావాల్సిన జూనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్ల ప్రమోషన్‌లు లేవు. ప్రమోషన్లు, బదిలీల పేరుతో టీచర్ల ఎమోషన్‌లతో ఆడుకోవడం పరిపాటిగా మారింది. ఇతర శాఖల్లో కారుణ్య నియామక పథకంలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో నియమితులైన ఉద్యోగులు అనతికాలంలోనే మూడు, నాలుగు పదోన్నతులు పొందుతుంటే, టీచర్లు ఇరవై ఐదేళ్లుగా ఒక్క ప్రమోషన్‌కు నోచుకోకపోవడం దురదృష్టకరం. టీచర్లుగా విద్యాశాఖలో నియామకమవ్వడమే మేము చేసిన పొరపాటా అని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వం అధికారులు ఈ విషయంపై శ్రద్ధ వహించాలి.
వందల సంఖ్యలో డెప్యూటేషన్‌లు..
గత ఏడాది సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో అది కోర్టులోనే ఉంది. ఇప్పటికే కాలయాపన జరిగింది. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తే సమస్యలకు పరిష్కారం దొరక్కపోదు. ఉన్నతాధికారులు బదిలీలు, పదోన్నతులపై అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న కేసులను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఆ కేసులన్నింటినీ పరిష్కరిస్తూ పదోన్నతుల తదనంతరం బదిలీలు చేపట్టాలి. ప్రతి ఏడాది పదోన్నతులు, బదిలీల ప్రక్రియలను చేపట్టే విధంగా శాశ్వత విధివిధానాలను రూపొందించాలి. గౌరవ ముఖ్యమంత్రి ఈ విషయంలో చొరవ తీసుకుని ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలు తీసుకుని ఇప్పటికే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను వెంటనే పూర్తిచేయాలి.
గత ప్రభుత్వం విచ్చలవిడిగా దొడ్డిదారి బదిలీలకు తెరతీయడంతో సగటు ఉపాధ్యాయుడు నష్టపోయాడనేది నిర్వివాదాంశం. ఇతర జిల్లాల నుంచి పట్టణ ప్రాంత జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరికి డిప్యూటేషన్‌ల పేరుతో వందల కొద్ది బదిలీలు జరిగాయన్నది వాస్తవం. ఈ వేసవి సెలవుల్లోనైనా బదిలీలు జరిగి తమకు అనుకూలమైన పాఠశాలకు వస్తామనుకున్న ఉపాధ్యాయులకు అక్రమ బదిలీలు ఆశనిపాతంగా మారాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే వందల సంఖ్యలో అక్రమ డిప్యూటేషన్‌లు జరగడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్ విడుదల చేసి సగటు ఉపాధ్యాయునికి న్యాయం జరిగేలా చూడాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
- సుధాకర్.ఏ.వి
రాష్ట్ర కార్యదర్శి, STUTS
90006 74747