దేశ ఆర్థిక వ్యవస్థ కల్లోలమే!?

Will RBI’s Rs 2,000 note withdrawal, is it impact on country economy?

Update: 2023-05-26 00:45 GMT

గత శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండోసారి భారత ప్రజలకు పిడుగులాంటి వార్తను విడుదల చేసింది. ఇప్పటివరకు చలామణిలో ఉన్న 2000 రూపాయల నోటును ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిని మే 23 నుంచి సెప్టెంబర్ 30 తేదీలోపు బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం కల్పించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 లో చేసిన నోట్ల రద్దు ప్రకటన భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. చలామణిలో ఉన్న 500 , 1000 రూపాయల నోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించి వాటి స్థానంలో కొత్త 500 , 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చారు. ఇప్పుడు 2000 రూపాయల నోట్లను చెలామణీ నుండి ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం దేశం మొత్తంలో చలామణిలో ఉన్న 3.62 లక్షల కోట్ల విలువైన ₹2,000 నోట్లలో 80% వరకు అతి కొద్ది మంది చేతుల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అందులో అధిక భాగం అక్రమ లావాదేవీలకు ఉపయోగ పడుతున్నాయని గుర్తించారు. నిజానికి నోట్ల రద్దు తర్వాత ప్రధాని చెప్పినట్టుగా డిజిటల్ లావాదేవీలు గనుక పెరిగితే వాస్తవంలో కాగితపు కరెన్సీ చలామణి తగ్గిపోవాలి. కానీ, జరిగింది ఏమిటి?

ఈ నోట్లన్నీ ఏమైనట్టు?

2016లో పెద్ద నోట్ల రద్దు జరిగేనాటికి చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 17.74 లక్షల కోట్లు. కాగా, 2022 డిసెంబర్ 23 నాటికి రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఈ మొత్తం 32.42 లక్షలు కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే, కాగితపు కరెన్సీ స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టిన లక్ష్యం సంపూర్ణంగా వైఫల్యం చెందింది. పైగా ఈ కాలంలోనే కాగితం కరెన్సీ చలామణి రెట్టింపు అయింది .క్రెడిట్ డెబిట్ కార్డుల చెల్లింపులు, ఆన్లైన్ రూపంలో లావాదేవీలు కూడా భారీగానే పెరిగాయి. 2000 నోట్లు ఇప్పుడు పెద్దగా సామాన్య ప్రజల చేతుల్లో కనిపించడం లేదు. మరి ఈ నోట్లన్నీ ఏమైనట్టు?

పెద్ద నోట్లు నేడు బడా బాబులకు, అవినీతి రాజకీయ నేతలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవసరాల కోసం, నల్ల డబ్బు రూపంలో అండర్ గ్రౌండ్‌కి ఎప్పుడో చేరిపోయింది. అంటే కాగితం కరెన్సీ చలామణిలో అధిక భాగం ఈ పెద్ద మనుషుల వద్ద నల్లధనం రూపంలో, లెక్కకు అందకుండా ఉంది అని అర్థం చేసుకోవాలి. కానీ, సామాన్య జనం చెల్లింపులు మాత్రం పారదర్శకంగా నేడు డిజిటల్ ఎకానమీ రూపంలో కనపడుతున్నాయి. ప్రభుత్వం ఆదాయపు లెక్కలకు అందుబాటులో నమోదు అవుతున్నాయి.

ఆ గాయాలు మానకుండానే!

గతంలో యూపీ ఎన్నికల వేళ హడావుడిగా పెద్ద నోట్లను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనుండగా 2000 రూపాయల నోటును వెనక్కి తీసుకుంది. కేవలం సంపన్నుల ప్రయోజనం కోసమే ఈ నోట్లను ఇంత కాలం ఇలా చెలామణిలో ఉంచారు అన్నది వాస్తవంగా విమర్శకులు భావిస్తున్నారు. 2016 లో రద్దు చేసిన నోట్లు 99.3% బ్యాంకులకు చేరాయి. అంటే ప్రత్యక్షంగా నల్లధనం అనేది లేదని తేలింది. ఇప్పుడు నల్లధనం తగ్గే అవకాశాలు భవిష్యత్తులో కూడా ఏమీ ఉండవు. ఇప్పటివరకు చెప్పిన ఏ ఒక్క లక్ష్యాన్ని సాధించుకోలేకపోగా భారత ఆర్థిక వ్యవస్థని అధోగతి పాలు చేయకతప్పదు. ఆరేళ్ల క్రితం పెద్ద నోట్ట రద్దుతో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, దేశ వ్యాపారాన్ని అస్తవ్యస్తం చేయడంతో, ఆర్థిక వ్యవస్థకు తగిలిన దెబ్బ సామాన్యమైంది కాదు.

2015-16 ఆర్థిక సంవత్సరంలో నమోదైన జీడీపీలో (8.2శాతం) వృద్ధి రేటును మళ్ళీ ఇప్పటి వరకు దేశం సాధించలేకపోయింది. మన దేశంలో నోటు రద్దయిన వెంటనే వరుసగా 2016-17లో (7.1శాతం ), 2017-18లో (6.7శాతం), 2018- 19లో (6.1శాతం) అంటే మూడేళ్లలోనే 6.1 శాతానికి దిగజారిపోయింది. అప్పట్లో పూర్తిగా మూతపడిన చిన్న మధ్య తరహా వ్యాపారాలు మళ్లీ తెరుచుకోలేదు. పెద్ద నోట్లు ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్ కావడంతో బ్యాంకులు రుణ వితరణను పెంచాయి. దీనితో మొండి బకాయిల్ని 2016 మార్చిలో (7.6శాతం), 2017 మార్చిలో (9.6శాతం) 2018 మార్చిలో (11.2 శాతం) పోగు చేసుకున్నాయి.

మొదలైన ప్రకంపనలు

దేశంలోనే మొత్తం వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు రెండేళ్లలో 7.5శాతం నుంచి 11.2 శాతానికి రికార్డు స్థాయికి పెరిగిపోయాయి. వాటన్నింటి ప్రభావంతో రూపాయి విలువ నిలువునా కుప్పకూలి పోయింది. ఈ రూపాయి విలువ క్షీణత 2016 అక్టోబర్‌లో 66.5 నుండి 2018 అక్టోబర్ లో 74.5 శాతం (-12శాతం), 2023లో (-24.3 శాతం) వరకు క్షీణత కొనసాగింది. దీంతో ధరలు పెరిగాయి. రెండేళ్లలో రూపాయి విలువ 12 శాతం పతనమైంది. ఇప్పుడీ రెండు వేల నోట్ల ఉపసంహరణ కూడా సామాన్య ప్రజల రాబడిని, వ్యాపారాన్ని, మొత్తంగా ఆర్థిక వ్యవస్థనీ దెబ్బ తీస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకంపనల సూచనలు ఆ రోజు రాత్రే విదేశీ మార్కెట్లలో కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ తిరిగి ఆల్ టైం కనిష్ట స్థాయిని సమీపించింది. మన ఫారెక్స్ మార్కెట్లో 82.67 వద్ద ముగిసిన రూపాయి విలువ రెండు వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన వెంటనే అంతే వేగంగా 82.90 స్థాయికి పడిపోయింది. ఇక ముందు ముందు ఆర్థిక పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చెప్పలేము. వేచి చూడాల్సిందే.

డా. కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Tags:    

Similar News