ఇదీ సంగతి:ఇకపై వృద్ధులకు ఆ రాయితీ లేనట్లేనా!
వృద్ధులకు, అంటే సీనియర్ సిటీజన్స్‌కు చాలా సంవత్సరాలుగా అమలులో ఉన్న 50 శాతం రైలు ప్రయాణ రాయితీని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉన్నది.
అసమానతలు, అధిక ధరలు, పేదరికం, ఆకలి, నిరుద్యోగంతో దేశం అట్టుడికిపోతున్నది. విపక్షాల ఆందోళనలు పార్ట్ టైమ్ అన్నట్టుగా ఉన్నాయి. 378 రోజుల రైతుల ఆందోళనను, 750 మంది ఊపిరి వదిలిన ఆ ఉద్యమాన్ని విపక్షాలు స్ఫూర్తిగా తీసుకోలేకపోతున్నాయి. ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు, దాడులకు విపక్ష నేతలు కొందరు భయపడుతున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచులు ఎక్కువయ్యాయి. నిజం చెప్పేవారి, ప్రశ్నించేవారి గొంతులను అణిచివేసి జైలులో పెడుతున్నారు. పార్లమెంటులో కూడా సభ్యులు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోతున్నది. నిజం రాసే, చూపించే, చెప్పే పాత్రికేయులు, పత్రికలు, ఛానల్స్‌ను సైతం సహించకలేకపోతున్నారు.
వృద్ధులకు, అంటే సీనియర్ సిటీజన్స్‌కు చాలా సంవత్సరాలుగా అమలులో ఉన్న 50 శాతం రైలు ప్రయాణ రాయితీని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉన్నది. దీని వలన యేటా రూ.15 వేల కోట్ల భారం ఖజానా మీద పడుతున్నదని సంబంధిత శాఖా మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. అందుకే రాయితీ తొలగించక తప్పడం లేదన్నారు. వయోధిక పౌరులకు ప్రధాని నరేంద్ర మోడీ మంచి బహుమతే ఇచ్చారు. పెన్షన్ సరిపోతలేదని, పెంచాలని 1998-2008 మధ్యలో రిటైర్డ్ అయిన బొగ్గు గని కార్మికులు విన్నవిస్తున్న వేళ వారికి కూడా రైల్వే కన్సెషన్ 'ఉఫ్' అయిపోయింది. కార్మిక సమ్మాన్ కాదు, ఇది కార్పొరేట్ సమ్మాన్ యోజన ప్రభుత్వం అనక తప్పదు.
ప్రజల సొమ్ముతోనే పథకాలు, సబ్సిడీలు అమలవుతాయి. 'వృద్దులు వద్దు, కార్పొరేట్‌లే ముద్దు' అనే విధంగా ప్రభుత్వం ఉంది. కార్పొరేట్‌లకు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారు. పన్నులను మినహాయిస్తున్నారు. ఎవరికి రుణాలు మాఫీ చేశారో, ఎవరికి మినహాయింపులు ఇచ్చారో బయటకు తెలియకుండా బ్యాంకులలో ఆ పేజీలను మూసివేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బడి పిల్లలు వినియోగించే షార్ప్‌నర్లు, పెన్సిళ్ల మీద జీఎస్‌టీ అమలు చేస్తున్నారు. వృద్ధులకు ఏ దేశంలో అయినా ఉచిత పథకాలు, సబ్సిడీ సౌకర్యాలు ఉన్నాయి. మన వద్ద ఉన్న రాయితీలను మాత్రం తీసేస్తున్నారు.
వివరాలు బయటకు రాకుండా
గతంలో బడ్జెట్‌లో రుణాలకు సంబంధించి కేటాయింపుల వివరాలు, వాటి రికార్డులు ఉండేవి. 2018 నుంచి అవేమీ లేవు. సర్కార్ ఖజానా మీద భారం కార్పొరేట్‌ల విషయంలో పడడం లేదా? ఎందుకంటే వారంతా వీరిలోని వారే కదా! వీరి దోస్తులు కదా!! దేశంలో 255 మంది బడాబాబులు 1000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు రుణాలు పొంది డిఫాల్టర్‌లుగా ఉన్నారు. ఒకసారి 50 శాతం కన్సెషన్ రైలు ప్రయాణ భారం, కార్పొరేట్‌ల రుణమాఫీ వివరాలను పరిశీలిద్దాం.
2017-18లో వృద్ధుల రైలు ప్రయాణ భారం రూ. 1,491 కోట్లు కాగా, కార్పొరేట్‌ల రుణ మాఫీ ఒక్క ఎస్‌బీఐలోనే రూ.17,548 కోట్లుగా ఉంది. 2018-19లో వృద్ధుల భారం రూ.1,667 కోట్లు కాగా, కార్పొరేట్‌ల రుణమాఫీ రూ.27,225 కోట్లుగా ఉంది.2019-20లో వృద్ధులకు రూ.1,667 కోట్లు ఖర్చు కాగా, కార్పొరేట్‌ల రుణ మాఫీ రూ.46,348 కోట్లుగా ఉంది. మొత్తంగా ఒక్క ఎస్‌బీఐలోనే రుణమాఫీ రూ. 1 లక్షా 45 వేల 248 కోట్లుగా ఉంది. వృద్దులకు పదేండ్లపాటు ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పించినా అంత ఖర్చు కాదు. మొత్తంగా రూ. 8 లక్షల 33 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, ఇందులో 2021-22 లో 1 లక్షా 75 వేల కోట్లు వే ఆఫ్ చేసారు. దేశంలో కరెప్షన్ ట్రాన్స్పరెన్సీ అయింది. కార్పొరేట్‌లకు పంచుతూ పోతున్నారు. పేద, మధ్య తరగతి, ధనిక వర్గానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదు. ఆర్థిక పాలసీ లేదు.
ఎవరిని చూసినా వేల కోట్లే
ఉచిత రేషన్ బియ్యానికి యేడాదికి రూ.80 వేల కోట్లు, ఇతర రేషన్ సరుకులకు రూ. లక్ష కోట్లు ఖర్చు అవుతున్నాయి. వీటిని ఎప్పుడో ఒకప్పుడు బంద్ చేయాల్సిందే. అప్రమత్తత అవసరమే. షిప్పింగ్ కార్పొరేషన్, బీఎస్ఎన్‌ఎల్, ఎయిర్‌పోర్ట్, రైల్వే భూములు కూడా అమ్ముతున్నారు. ఎవరికీ అమ్ముతున్నారో, ఎంతకు అమ్ముతున్నారో కూడా తెలియదు. సంజయ్ జంజున్‌వాలా రూ. 2,000 కోట్లు, అర్వింద్ రూ. 5,000 కోట్లు, రిషి అగర్వాల్ రూ. 6,000 కోట్లు, కపిల్ రూ. 2,780 కోట్లు, విక్రం కొఠారి రూ.1,870 కోట్లు, విజయ్‌రాజ్ రూ. 1,700 కోట్లు, సురేఖ సంజయ్, కృష్ణకుమార్, అమిత్ పటేల్ తదితరులు వేలాది కోట్ల రూపాయలు తీసుకుని బ్యాంకులకు సున్నం పెట్టారు. మహారాష్ట్రలో రూ.80 వేల కోట్లు, ఢిల్లీలో రూ. 40 వేల కోట్లు, బెంగాల్‌లో రూ. 20,777 కోట్లు, గుజరాత్‌లో రూ. 18,546 కోట్లు, తమిళనాడులో రూ.14,000 కోట్లు, పంజాబ్‌లో రూ. 5,724 కోట్లు, చండీగఢ్‌లో రూ. 6,015 కోట్లు ఇలా వివిధ రాష్ట్రాలలో కంపెనీల పేరిట రుణాలు తీసుకుని ఎగగొట్టారు. ఇదంతా ప్రజల సొమ్మే. పన్నులు, జీఎస్‌టీ ద్వారా వసూలు చేసినదే. పీఎం నరేంద్ర మోడీ పదే పదే చెప్పే 'న్యూ భారత్' స్వరూపం ఇది.
కదలని విపక్షాలు
అసమానతలు, అధిక ధరలు, పేదరికం, ఆకలి, నిరుద్యోగంతో దేశం అట్టుడికిపోతున్నది. విపక్షాల ఆందోళనలు పార్ట్ టైమ్ అన్నట్టుగా ఉన్నాయి. 378 రోజుల రైతుల ఆందోళనను, 750 మంది ఊపిరి వదిలిన ఆ ఉద్యమాన్ని విపక్షాలు స్ఫూర్తిగా తీసుకోలేకపోతున్నాయి. ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు, దాడులకు విపక్ష నేతలు కొందరు భయపడుతున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచులు ఎక్కువయ్యాయి. నిజం చెప్పేవారి, ప్రశ్నించేవారి గొంతులను అణిచివేసి జైలులో పెడుతున్నారు. పార్లమెంటులో కూడా సభ్యులు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోతున్నది. నిజం రాసే, చూపించే, చెప్పే పాత్రికేయులు, పత్రికలు, ఛానల్స్‌ను సైతం సహించకలేకపోతున్నారు. సత్యాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.
దేశంలో 140 కోట్ల జనాభాకు కనీసం మంచి నీళ్లు కూడా సరఫరా చేయలేని పాలన ఉంది చాలా రాష్ట్రాలలో తాగునీరు, విద్య, వైద్యంలాంటి అన్ని రంగాలలో కార్పొరేట్‌లదే రాజ్యం అయింది. నీళ్ల బాటిల్స్ అమ్మి యేటా ఆరు లక్షల కోట్లు గడిస్తున్నారంటే నమ్మగలరా? కానీ, ఇది నిజం. దేశం అప్పులు రూ.135 లక్షల కోట్లు దాటాయి. రూ. ఆరు వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీ ఫండ్స్ వచ్చాయి. ఎవరిచ్చారు? ఎంతెంత ఇచ్చారు? చెప్పరు. ఈ నేపథ్యంలో 2021లో అదానీ అప్పులు రూ.1 లక్షా 55 వేల 463 కోట్లు కాగా, 2022 లో 2 లక్షల 20 వేల 584 కోట్లు ఉందట. ఎవరిచ్చారో? ఎవరికి సున్నం పెట్టారో? గ్లోబల్ ఇంటర్నేషనల్‌లో అప్పు ఎవరైనా ఇస్తారట! అయినా వృద్ధుల రైలు ప్రయాణ రాయితీ మాత్రం తలకు మించిన భారంగా పాలకులకు కనబడుతున్నది. హతవిధీ!?
ఎండీ మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 65223