ప్యాసింజర్ల భద్రతపై ఇంత నిర్లక్ష్యమా..!
Will Indian Railways take measures for passenger safety?
దేశంలో రైల్వే వ్యవస్థ నిర్లక్ష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరువకముందే మరో ఘోరం జరిగింది. బార్‌గఢ్ జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది, గూడ్స్ రైల్లోని ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డుల ప్రకారం గడిచిన పదేళ్లలో రైలు ప్రమాదాల్లో 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 70 శాతం మంది 2017- 21 మధ్య కాలంలో మరణించారు. గత నెలలో ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ దక్షిణ రైల్వేలో 392 లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయాలని, సెలవు, విశ్రాంతి నిరాకరించారని, దీని వలన ఒత్తిడి స్థాయి పెరిగిందని, ఇది రైలు కార్యకలాపాల భద్రతకు హానికరమని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ వ్యవస్థాగత వైఫల్యాలను రైల్వే బోర్డు సరిదిద్దుకోలేదు.
మానవ తప్పిదాలంటూ..
రైల్వేలలో కనీస అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ ఆదాయాన్ని గడిస్తున్న రైల్వే శాఖలో 3.11 లక్షల గ్రూప్-సి పోస్టులు, 3,018 గెజిటెడ్ క్యాడర్ సాంక్షన్ అయిన పోస్టులు ఖాళీగా వున్నా భర్తీకి నోచుకోకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటోంది. ఈ కారణంగా మిగిలిన ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పడుతోంది. దీంతో చాలామంది రైల్వే సిబ్బంది సెలవు, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఇటీవల ప్రమాదం జరిగిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 2023 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 12 గంటలకు పైగా డ్యూటీలో మోహరించిన లోకో పైలట్ల డ్యూటీ అవర్స్ వరుసగా 35.99%, 34.53% మరియు 33.26% గా ఉన్నాయి. పైగా ఎప్పుడో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' ని నేటికీ నెలకొల్పలేదు. అత్యధికంగా ట్రాఫిక్ ఉన్న రైల్వే మార్గమైనా సౌత్ ఈస్ట్ రైల్వే సిగ్నలింగ్ టెలి కమ్యూనికేషన్ కింద బడ్జెట్ కేటాయించిన దానికి ఒక్కపైసా ఖర్చుచేయలేదు. ట్రాకుల ఆధునీకరణ చేయలేదు. రైలు భద్రతపై కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదని పేర్కొన్నది. 2017-2021లో 2017 ప్రమాదాలు జరిగాయని, అందులో పట్టాలు తప్పినవి 1392 (62%) అని పేర్కొంది. అయితే ఎన్నో ఎళ్ళుగా ఈ ప్రమాదాలకు కారణం ‘మానవ తప్పిదం’ అని నిందించటం ఏండ్లుగా ఒక సాధారణ ధోరణిగా మారింది. అయితే కాగ్ నివేదిక ప్రభుత్వ వాదనలు తప్పని నిరూపిస్తున్నది. ట్రాక్‌ల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యమని కాగ్ 2022 సెప్టెంబర్ నివేదికలో అక్షింతలు వేసింది. రైలు భద్రతపై కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా, లోపాలు ప్రస్తావించినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. అలాగే పట్టాలు తప్పిన సందర్భాల్లోనూ పునరుద్ధరణ పనులు 26శాతం మాత్రమే నోచుకున్నాయని వివరించింది. రైళ్ళు పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాక్ నిర్వహణ సరిగ్గా లేకపోవడమే అని వివరించింది.
వందేభారత్‌లు ఎవరికోసం?
రైల్వేలు ప్రజల ఆస్తి. మన ప్రజల సొమ్ముతో భారత కార్మికుల కష్టాలతో భారతీయ రైల్వే వ్యవస్థను నిర్మించారు. రైళ్ళు, రోడ్లు సామాన్య ప్రజలకు సరసమైన రవాణాను అందించడానికి ఉద్దేశించబడినవి. ఇవి ఏ ప్రభుత్వమైనా తన పౌరులకు సరసమైన ధరలకు భద్రతతో అందించాల్సిన సేవలు. ప్రైవేటు కార్పొరేట్లకు లాభాలను ఆర్జించే మార్గాన్ని సృష్టించేందుకు భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించకూడదు. ప్రారంభించిన రైలునే అట్టహాసంగా మళ్ళీ ప్రారంభించే బదులు సామాన్యులు ప్రయాణించే రైళ్ల బాగోగులు పట్టించుకోవాలి. ప్రయివేటీకరణే అన్నింటికీ పరిష్కారం అనే మానసిక స్థితి నుండి బయటపడి వాస్తవాలను ఆలోచించి ప్రజల భద్రతకు ఏం చేయాలో తెలుసుకుని ఇప్పటికైనా పూనుకుని, దుఃఖితులకు ఓదార్పునివ్వాలి. ప్రతి వందేభారత్ కోసం రైల్వే రూ.115 కోట్లు పైగా వెచ్చిస్తున్నది. కానీ అసాధారణ రేట్లుండే రైళ్ళతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగేదేముంటుంది? తమ వైఫల్యం, అసమర్థతలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే మంత్రిత్వ శాఖకు ఇది అలవాటుగా మారిపోయింది. దీనికి ఐటీ సెల్‌లోని పెయిడ్ ఆర్టిస్టులు దానికి అన్ని రకాల అబద్ధాలూ గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేసరికి ప్రజలు ఈ ఘటననే మర్చిపోతారు.
నివేదికలను విస్మరిస్తే జరిగేదిదే!
అలాగే 2023 మార్చిలో రైల్వే భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్, రైల్వే మంత్రిత్వ శాఖ అలసత్వాన్ని ఎత్తి చూపింది. భద్రతకు సంబంధించిన నివేదికలు విస్మరించబడుతున్నాయని వివరించింది. కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్) చేసిన సిఫారసులు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అత్యంత ప్రాముఖ్యతను పొందవల్సి ఉంటే, వాటిపై తక్కువ శ్రద్ధ రైల్వేశాఖ పెడుతుందని ఈ ప్యానెల్ తెలిపింది. అలాగే ఈ ప్రమాదాలు పునరావృతం కాకుండా, ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని ప్యానెల్ ఆ నివేదికలో సిఫారసు చేసింది. రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలి. కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలి, రైల్వేలో ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఒడిశా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సక్రమమైన వైద్యం అందేలా చూడాలని గౌరవ ప్రధానికి మా సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
వి. కృష్ణ మోహన్,
వైస్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్
94406 68281