జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ అవసరం!
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలలో ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రజాస్వామ్యవాదులు చర్చకు ఉపక్రమించగా, మేథావులలో మేథోమధనం మొదలైంది. కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వం శరవేగంగా జమిలి ఎన్నికల బిల్లుకు సిద్ధపడుతుండగా ప్రతిపక్షాలు మాత్రం ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నారని గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు దేశానికి వరమా? శాపమా? పరిశీలిద్దాం.
ఏకకాల ఎన్నికల ఆలోచన భారతదేశానికి కొత్తేమి కాదు. స్వాతంత్య్రానంతరం మొదటి ఇరవై సంవత్సరాల పాటు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు సాధారణ ఎన్నికలు కలిపి జరిగాయి. అయితే, 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, 1970లో పార్లమెంట్ రద్దు కావడంతో 1971లో జరిగిన సాధారణ ఎన్నికల వల్ల ఈ ప్రక్రియకు విఘాతం కలిగింది. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదేళ్ల పదవీకాలం పూర్తి కావడం, లేదా శాసన వ్యవస్థలు ముందస్తుగా రద్దు కావడం అనేది అన్ని శాసన వ్యవస్థలకు ఏకరీతిగా లేకపోవడం వల్ల కాలానుగుణంగా వేటికవే వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
దేశంలో సగటున ఏడాదికి 5 నుంచి 7 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనివల్ల తలెత్తే సమస్యల కారణంగా రాష్ట్ర అసెంబ్లీకి, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేలా వ్యవస్థను రూపొందించాలని ఎన్నికల సంఘం సూచిం చింది. 1999లో జస్టిస్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదిక సైతం ఏకకాల ఎన్నికల నిర్వహణకు తన మద్దతును పునరుద్ఘాటించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను 2016 లో ప్రధాని మోడీ మళ్లీ తెరపైకి తెచ్చారు. 2017లో ఏకకాల ఎన్నికలపై వర్కింగ్ పేపర్‌ను నీతి ఆయోగ్ తయారు చేసింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం కోసం కనీసం ఐదు రాజ్యాంగ మార్పులు అవసరమని పేర్కొంటూ లా కమిషన్ కూడా 2018 ఆగస్టు 30న వర్కింగ్ పేపర్‌ను రూపొందించింది.
వేరువేరుగా నిర్వహించడంతో..
దేశంలోని రాష్ట్రాలు అసెంబ్లీ గల కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 4120 ఎమ్మెల్యేలు ఉన్నా రు. విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కోసారి దాదాపు వందల కోట్లు ఖర్చు అవుతోంది. ఏర్పాట్లు, జీతాలు, సెక్యూరిటీల కోసం గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేయబడుతుంది. ఈగ్రాఫ్‌లో ఎన్నికల ఖర్చులు కొన్నేళ్లుగా పెరుగుతున్నట్లు చూపుతోంది. 2014 నుండి 2022 వరకు జరిగిన 50 అసెంబ్లీ ఎన్నికలకు ఏడు వేల కోట్లు ఖర్చయిందని కేంద్రం వెల్లడించింది. కాగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నివేదిక ప్రకారం, 2019 పార్లమెంట్ ఎన్నికల ఖర్చు రూ.60,000 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో ఖర్చును పరిగణలోనికి తీసుకోరాదని, అధిక ఖర్చు వస్తుందని భావిస్తే ఐదు సంవత్సరాలకు బదులు పది, ఇరవై సంవత్సరాలకొకసారి ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అని ప్రజాస్వామిక వాదులు వాదిస్తున్నారు.
వరుస ఎన్నికలతో ప్రాజెక్టులకు అడ్డంకి!
ఎన్నికల సమయంలో చాలాకాలం పాటు పోలింగ్, భద్రతా సిబ్బంది నిమగ్నమవ్వడం వల్ల సమయం వృధా కావడమే కాకుండా ప్రభుత్వోద్యోగుల విధుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దానికి తోడు నిరంతరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూ ఉండటం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండడంవల్ల ప్రజాసంక్షేమం కోసం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించబడకపోగా జరగుతున్న అభివృద్ధి పనులు నత్త నడకన నడుస్తున్నాయని వాదిస్తున్నారు. ఏకకాల ఎన్నికలు నిర్వహించడం వల్ల పాలనా దక్షత పెరగడమే కాకుండా ద్వేష పూరిత ప్రసంగాలు, హింస, ఇతర శాంతి భద్రతల సమస్యలలో గణనీయమైన తగ్గింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. తరచూ ఎన్నికలు జరుగుతూ ఉన్నందున ఉచిత పథకాలకు రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నదని, కొన్నిసార్లు ఆర్థిక సంక్షో భంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఒకే పార్టీకి విజయావకాశాలు..
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83(2),172 వరు సగా లోక్‌సభ రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని ఐదేళ్లుగా నిర్దేశిస్తున్నాయి. గడువు ముగియక ముందే అధికార పార్టీ విశ్వాసం కోల్పోతే మళ్లీ ఎన్నికలు వస్తాయా లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అనేది తేల్చాలి. ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలు, సిబ్బంది, ఇతర వనరుల లభ్యతతో పాటు, భద్రతాపరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌కు ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆర్టికల్ 1 'యూనియన్ ఆఫ్ స్టేట్స్'గా పరిగణించబడుతునందున 'ఒకే' అనే ఊహ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. జస్టిస్ బి.ఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ తన నివేదికలో రాజ్యాంగం యొక్క ప్రస్తుత నిర్మాణం ప్రకారం ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది. అయితే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల గెలిచిన రాజకీయ పార్టీ లేదా కూటమి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో విజయం సాధించే అవకాశం 77% ఏర్పడుతుందని 2015లో ఐడీఎఫ్‌సీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఒక అధ్యయనం కనుగొంది.
ఏకాభిప్రాయం ఉండాలి!
మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే సమతు ల ఆహారం ఎలా అవసరం పడుతుందో ప్రజా స్వామ్య వ్యవస్థ పటిష్టంగా పరిపుష్టిగా ఆరో గ్యంగా ఉండాలంటే విభిన్న ఆలోచనలు ఉన్న బహుపాక్షిక రాజకీయ పార్టీలు ఆవశ్యకం. తద్వారా ప్రశ్నించే తత్వం బలపడి ప్రజాస్వా మ్యం బలోపేతం అవుతుంది. అందువల్ల 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అమలు చేయాల్సిన అవసరం ఉందా లేదా? అని నిర్ణయించుకునే అవకాశం దేశం మొత్తానికి ఇవ్వాలి. ఏకకాల ఎన్నికల ఆవశ్యకత, దాని సాధ్యాసాధ్యాలపై అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉండాలి. ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు, సవాళ్ల గురించి విస్తృత చర్చ జరగాలి.
భాస్కర్ యలకంటి
సోషల్ ఎనలిస్ట్
891949 464488