వై ఓన్లీ 23...ఆత్మవిమర్శకు టీడీపీ జడుపు
వై ఓన్లీ 23...ఆత్మవిమర్శకు టీడీపీ జడుపు... why tdp not self thinking about party future In Telugu States
తప్పు జరిగినపుడు తిట్టాలా కేవలం తిట్టడం కోసం, జరుగుతున్న ప్రతి పనినీ తప్పు పట్టాలా ఈ సూక్ష్మ వ్యత్యాసం గ్రహించనంత కాలం ప్రతిపక్ష రాజకీయాలు నిష్ఫలం. ఇది ఎక్కడైనా వర్తించే మౌలిక సూత్రం. నలబై యేళ్ల ఇండస్ట్రీ, రాజకీయ ఫ్యాక్టరీ తెలుగుదేశం ఇక్కడే పప్పులో కాలేస్తోంది. పడిపోయిన చోటి నుంచి పైకి లేవలేకపోతోంది. ఇతరేతర కారణాల వల్ల, మీడియాలో కొంత బలపడుతున్నట్టే కనబడుతోంది! కానీ, జనక్షేత్రంలో మాత్రం బలహీనపడుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏపీలో ఇదే పరిస్థితి. ఏళ్లపాటు సెలవు తీసుకొని, పునరుత్తేజానికి ప్రయాస పడుతున్న తెలంగాణలోనూ టీడీపీ దుస్థితి ఇదే! రెండు తెలుగు రాష్ట్రాల్లోని సర్కార్ల పాలనతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వాల పట్ల జనాభిప్రాయంతో మమేకం కాకుండా, ఏం చేస్తే తిరిగి అధికారంలోకి వస్తామో ఏ వ్యూహం రచించకుండా..... తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న మొక్కుబడి వైఖరి వల్ల అది జనానికి చేరువ కాలేకపోతోంది. ప్రజా సమస్యలపై పోరాడే నిర్దిష్ట రాజకీయ కార్యాచరణ లేదు. ప్రజలకు భరోసా కల్పించే ప్రత్యామ్నాయ సామాజికార్థిక ఎజెండా అంతకన్నా లేదు. నాలుగేళ్లుగా అధికారంలో ఉండి, నిర్దిష్ట విమర్శలను ఎదుర్కొంటూ కూడా ‘మొత్తం 175 స్థానాలు మనమే ఎందుకు గెలవొద్దు (వైనాట్ 175) అని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశ్వాసంతో దూసుకుపోతుంటే, ‘ఎందుకు మనం 23 కే పరిమితమయ్యాం’ (వై ఓన్లీ 23) అన్న ఆత్మవిమర్శ లేకుండా తెలుగుదేశం ‘గుడ్డెద్దు చేలో పడ్డట్టు’ ముందుకు సాగుతోంది. ఈ ఒరవడి మారితేనే వారికి రాజకీయ మోక్షం, ఆశించే ఫలితం లభించేది. లేకుంటే మరో భంగపాటు తప్పదు.
విపక్షంలో ఉన్నపుడు ఏం మాట్లాడినా చెల్లుతుందనుకోవడం పొరపాటు. జనాభిప్రాయంతో గొంతు కలిపితేనే విపక్షం మాటకు విలువ. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఇన్వెస్టర్స్ సమ్మిట్’, ఏ ప్రమాణాలతో చూసినా విజయవంతమైనట్టే లెక్క! వచ్చిన కంపెనీలు, వాటి విశ్వసనీయత, చూపిన ఆసక్తి, వారికి ప్రభుత్వం కల్పించిన నమ్మకం, మొత్తం పెట్టుబడి అంచనా, కల్పించబోయే ఉద్యోగావకాశాల పరంగా లెక్కించినపుడు.... సదస్సు ఫలించినట్టే భావించాలి. కానీ, దాన్ని విమర్శించడం ద్వారా ప్రజాక్షేత్రంలో మార్కులు కొట్టేయొచ్చన్న టీడీపీ ఆలోచనే వక్రబుద్ది. తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు నిర్వహించిన ఇటువంటి పలు సదస్సులు, వాటిల్లో చేసిన ప్రకటనలు, తర్వాత... నిజంగా వచ్చిన పెట్టుబడులు, కల్పించిన ఉద్యోగాలు పొంతన లేకుండా ఉండటం విమర్శలకు తావిచ్చింది. అంతటి గంతల గతాన్ని చరిత్రగా పక్కన పెట్టుకొని నోటిదురుసు విమర్శలు సరికాదు. నిజంగా ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని ఎత్తిచూపాలి. అసాధారణంగా పెరిగిన ధరలు, నిరుద్యోగిత, ఉపాధి అవకాశాలు లేకపోవడం, పాలకపక్షీయులైన స్థానిక నాయకుల దాష్టీకాలు, దౌర్జన్యాలు... వంటి అంశాల్లో జనంతో మమేకమై వారేమి కోరుతున్నారో అది మాట్లాడాలి. దానిపై ప్రజాందోళనలు, ఉద్యమాలు నిర్మించాలి. చంద్రబాబు సహితం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర కార్యకర్తలతో భేటీ అయినపుడు వారిని ఎక్కువ విని, తాను తక్కువ మాట్లాడాలి తప్ప, పూర్తి సమయం తన భావాలనే వారిపై రుద్దే యత్నం చేయకూడదు. కానీ, విపక్షంలో ఉన్నా అదే జరుగుతోంది. సుదీర్ఘంగా సాగే వీడియో, టెలీ కాన్ఫరెన్సుల గతీ అదే!
చేయకూడనిదేంటో గ్రహించక...
సుదీర్ఘ చరిత్ర కలిగిన క్రియాశీల పార్టీకి ఎందుకీ దుర్గతి? ప్రజలెందుకు తమను 23 స్థానాలకు పరిమితం చేశారన్న ఆత్మవిమర్శ నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ జరుగలేదు. పైగా, ప్రజలెందుకు దూరమయ్యారు ప్రజానిర్ణయాన్ని తగు రీతి సమీక్షించకుండా... తమను మళ్లీ ఎన్నుకోని ప్రజలదే తప్పన్నట్టు మాట్లాడటం ప్రజాస్వామ్యంలో కూడని పని. వైఎస్సార్సీపీ ప్రలోభాలకు ఓటర్లు లొంగిపోయారనో, అమ్ముడుపోయారనో అనటం ద్వారా వారిని మరింత దూరం చేసుకుంటున్నారు. ఆవిర్భావం నుంచీ వెనుకబడిన వర్గాలు టీడీపీకి వెన్నెముక! కానీ, 2019 ఎన్నికల్లో దాదాపు అన్ని బీసీ వర్గాలు పార్టీకి దూరమైనట్టు సీఎస్‌డీఎస్-లోక్‌నీతి వంటి విశ్వసనీయత కలిగిన సర్వే సంస్థలు వెల్లడించినా... అందుకు గల కారణాలు తెలుసుకునే ఏ ప్రయత్నమూ చిత్తశుద్దితో జరుగలేదు. ప్రజాదరణ, పలుకుబడి కలిగిన బీసీ నాయకుల్ని ముందుంచి వ్యవహారాలు నడిపిందీ లేదు. మాజీ మంత్రులో, ఎమ్మెల్యేలో, అచ్చెన్నాయుడు వంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినో ముందు నిలిపి... జిల్లా, మండల, ఇంకా కింది స్థాయి ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలకు పార్టీ పూనుకోవటం లేదు. జనాదరణ ఉన్న చాలా మందిని డమ్మీలుగా పక్కన పడేస్తారు. ఎంతసేపూ నోరున్న పట్టాభి వంటి ఒకరిద్దరు నాయకులతోనే వ్యవహారాలు నడిపే నాయకత్వ తీరును పార్టీ శ్రేణులూ జీర్ణించుకోవడం లేదు. అధికారంలో ఉన్నపుడూ కుటుంబరావులు, పరకాల ప్రభాకర్‌లు, ఓ అరడజన్ మంది సివిల్ సర్విసెస్ అధికారులు... వీళ్లే అంతా అయి నడిపారు, విపక్షంలోనూ అదే వైఖరా అనే ప్రశ్న తరచూ తలెత్తుతోంది. ‘సోషల్ మీడియా’ వేదికల్ని అస్త్రాలుగా వాడుకోవడం సరే... పార్టీ పదవులు, హోదాల్లో ‘సోషల్ ఇంజనీరింగ్’కూడా అంతకన్నా ముఖ్యం! ఏపీ జనక్షేత్రంలో ‘పీపుల్స్‌పల్స్’ ప్రతినిధులు తిరిగినపుడు, కొట్టచ్చినట్టు కనిపించే అంశం నిజమైన ప్రజా సమస్యలు విపక్ష పార్టీల ఎజెండాలకు ఎక్కకపోవడం! చంద్రబాబు నుంచి గల్లీ కార్యకర్త వరకు ఎవరు నోరిప్పినా... సీఎం జగన్‌పై దుమ్మెత్తిపోయడమే!
ఎందుకీ దుస్థితి తెలియాలి
ప్రాంతం, కులం, వర్గం అన్న తేడాలు లేకుండా 2019 ఎన్నికల్లో ప్రజలెందుకు టీడీపీని తిరస్కరించారు దీనిపై వాస్తవిక పరిశీలన, సమీక్ష, పార్టీ పరంగా ఆత్మశోధన జరగాలి. ఓడిన తొలినాళ్లలో... ‘ప్రజల్ని మనం ఇంత కష్టపెట్టామా’ అని ఎక్కడో ఆంతరంగిక సమావేశాల్లో బాబు అన్నట్టు ఓ వార్త బయటకొచ్చింది. అదే నిజమైతే, ఆ దిశలో ఆత్మశోధన జరిగి ఉండాల్సింది. ఇన్ని ‘మహానాడు’లు జరిగినా... ఎన్నడూ ఈ విషయంలో లోతుకు వెళ్లలే! ఏపీలోని 7 ఎస్టీ స్థానాలకు గాను, 2009, 2014 ఎన్నికల్లో ఒక్కో స్థానం గెలిస్తే, 2019 లో ఆ ఒకటి కూడా దక్కలేదు. ఎస్సీ 29 స్థానాలకు గాను 2009, 2014, 2019 వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఓడిన నియోజకవర్గాల సంఖ్య 11. అలా రాష్ట్రం మొత్తంలో వరుసగా టీడీపీ గెలుపు ఎరుగని నియోజకవర్గాలు 50 ఉన్నాయి. చంద్రబాబు ప్రాతినిద్యపు రాయలసీమలో 52 స్థానాలకు గాను కిందటి ఎన్నికల్లో గెలిచింది 3 చోట్లనే! ఇప్పుడెన్ని చోట్ల మెరుగయింది వారికి లెక్కే లేదు! నాలుగేళ్లలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన, ఇబ్బంది పాల్జేసిన ఒక్క ప్రజాందోళన, జన ఉద్యమం లేదు. ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకు....’ అన్నట్టు ఎవరో మొదలెట్టిన రాజధాని భూముల పోరాటంలోనూ చేతులు పెట్టి, టీడీపీ అదనంగా సాధించింది కూడా ఏమీ లేదు. ప్రజలకు భరోసా కల్పించే ఒక్క సామాజికార్థిక ప్రత్యామ్నాయ ప్రకటన కూడా ఇంత వరకు వెలువడలేదు. ‘ఈ సారి 175 సీట్లు మావే, పేదలకు మేమిచ్చే సంక్షేమ ఫలాలు దక్కనీకుండా టీడీపీ, ఇతర విపక్షం అడ్డుపడుతోంది, ఇది వర్గపోరాటం’ అనే ముఖ్యమంత్రి మాటల్ని విపక్షం ధీటుగా ఖండించిందే లేదు!
చేయాల్సింది మరచిన వైనం
ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోవడం టీడీపీ చేసిన పెద్ద తప్పు! పార్టీ వివిధ స్థాయి నాయకత్వం, కార్యకర్తల శ్రేణులు క్రియాశీలం అయ్యే, రాజకీయ పదవులు, అవకాశాలు పొందే ఆస్కారం అలా పోగొట్టుకుంది. ఆవిర్భావం నుంచీ రాజకీయ శిక్షణా శిబిరాలకు, సదస్సులకు, చర్చా వేదికలకు పేరు పడ్డ పార్టీ టీడీపీ. ఇప్పుడవన్నీ గతకాలపు ముచ్చట్లయ్యాయి. నాయకులు, కార్యకర్తలు విసుక్కునే గంటల తరబడి వీడియోటెలి కాన్ఫరెన్స్‌ల సోది తప్ప మరోటి లేదు. పాత ఆకులు రాలి కొత్త చిగుళ్ళు మొలిచే సంకేతమే పార్టీ వ్యవస్థలో కనిపించడం లేదు. పౌరసమాజం, ప్రజా సంఘాలను 2014-19 మధ్య దూరం పెట్టడం వల్లే కొంప మునిగిందనే తెలివిడి ఉంటే, వాటని మచ్చిక చేసుకోవడం ఇప్పుడు కర్తవ్యం కావాలి! కానీ, ఆ ధ్యాసే కనిపించదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం పూర్తి వంటి కీలక అంశాలపై ఉద్యమాలే లేవు. మీడియాలో వచ్చే అంశాలపై విలేకరుల సమావేశాలు, పత్రికా ప్రకటనలు తప్ప ప్రజాక్షేత్రంలో జనంతో మాట్లాడటం, వారిని ముందుంచి ఉద్యమించడం వంటివి విపక్షం దాదాపు మరచిపోయినట్టుంది. ‘వారి అధికారం కోసం పోరాడుతున్నారు’ అనుకున్నంత కాలం ఏ ప్రతిపక్షానికీ ప్రజలు పట్టం కట్టరు. ‘మా కోసం వారు పోరాడుతున్నారు’ అనే భావన కలిగించిన ఏ ప్రతిపక్షానికీ పట్టంగట్టకుండా ప్రజలు వదులుకోరు. ఇది చరిత్ర చెప్పే సత్యం! రెండు తెలుగు రాష్ట్రాల విషయంలోనూ ఇది మాత్రమే సత్యం.
-దిలీప్‌రెడ్డి
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ
dileepreddy.ic@gmail.com
9949099802
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672