ప్రైవేటు వర్సిటీలు ఎందుకు?
'నైపుణ్యం పెంచుకోవడానికి రాజ్యమే ప్రతి పౌరుడికి విద్యను అందించాలి. అప్పుడే సమాజంలో అంతరాలు తొలగిపోతాయి. సమ సమాజం ఆవిర్భవిస్తుంది' అన్నారు గ్రీకు తత్వవేత్త ప్లేటో.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. పరిశోధనలు కొనసాగడం లేదు. ప్రభుత్వం కేటాయించే నిధులు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోతున్నాయి. మౌలిక వసతులు కల్పించలేక వర్సిటీ అధికారులు ప్రతి నెలా సెక్రెటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలి. విశ్వవిద్యాలయాలలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. మౌలిక సౌకర్యాలు కల్పించి, పరిశోధనలకు పెద్దపీట వేయాలి. వర్సిటీల అభివృద్ధికి కావలసిన నిధులు కేటాయించాలి. రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో రిజర్వేషన్లను అమలు చేయాలి.
'నైపుణ్యం పెంచుకోవడానికి రాజ్యమే ప్రతి పౌరుడికి విద్యను అందించాలి. అప్పుడే సమాజంలో అంతరాలు తొలగిపోతాయి. సమ సమాజం ఆవిర్భవిస్తుంది' అన్నారు గ్రీకు తత్వవేత్త ప్లేటో. నేడు విద్యా వ్యవస్థ ఎంతో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఆదరణ లభించలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే వర్సిటీలకు సకల సౌకర్యాలు సమకూరుతాయని, అవి తెలంగాణను అభివృద్ధి పథంలో నడపడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని ఆశించారు.
అందుకోసమే తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఆచార్యులు ఉద్యమంలో భాగస్వాములై ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ఘనమైన కృషి చేశారు. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో విశ్వవిద్యాలయాలు సమస్యల నిలయాలుగా మారాయి. రాష్ట్రంలో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వ విద్య మీదనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడంతో వీరంతా ఉన్నత విద్యకు దూరమవుతారు. వారి భవిష్యత్తు అంధకారమవుతుంది.
రాజ్యాంగ నియమాలను కాదని
రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో, అన్ని విద్యాసంస్థలు బంద్ ఉన్నప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. మొదటి దఫాలో నాలుగు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది. తాజాగా ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలకు దారులు తెరిచింది. అందులో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, మరొక ఫార్మా వర్సిటీ ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ఆమోదించిన సమయంలో విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ అందులో రిజర్వేషన్లు వర్తించవని చెప్పారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 15 ద్వారా బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మహిళలకు విద్యా సంస్థలలో రిజర్వేషన్లను కల్పించారు. ప్రైవేటులో రిజర్వేషన్లు ఉండవని చెప్పడం రాజ్యాంగ నియమాలకు విరుద్ధం.
2021-2022 అకడమిక్ సంవత్సరంలో విశ్వవిద్యాలయాలలో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెంచేశారు. ఎంఏ రూ. 2,400 నుంచి రూ.14,000, ఎంఎస్‌సీ రూ.3,800 నుంచి రూ. 20,490, ఎంఎస్‌సీ సెల్ఫ్ ఫైనాన్స్ రూ. 35,000, ఎంబీఏ రూ. 35,000, ఎంసీజే రూ.20,000 ఎంకామ్ రూ.20,000, ఇంజనీరింగ్ రూ.18,000, 35,000 వేల వరకు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు 75,000 వరకు ఫీజులు నిర్ణయించారు. దీంతో చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు.
వివక్ష చూపిస్తూ
ఉస్మానియా యూనివర్సిటీ ఈ అకాడమిక్ సంవత్సరంలో 60 శాతం అమ్మాయిలు, 40 శాతం అబ్బాయిలు అడ్మిషన్ పొందారు. రెండు నెలలుగా లేడీస్ హాస్టల్‌లో అమ్మాయిలకు సౌకర్యాలు కల్పించకుండా జెండర్ వివక్ష చూపుతున్నారు. లిమిటెడ్ ఫుడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తాగునీరు అందుబాటులో లేదు. బాత్రూంలలో పరిశుభ్రత పాటించడం లేదు. ఇవే అంశాల మీద ధర్నా చేసినపుడు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య విద్యార్థుల దగ్గరికి వచ్చి మాట్లాడారు. విద్యార్థినుల విషయంలో పక్షపాత ధోరణి ఉండకూడదని సూచించారు.
తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలలో 2,020 ఆచార్య పోస్టులు, 2,774 బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. పరిశోధనలు కొనసాగడం లేదు. ప్రభుత్వం కేటాయించే నిధులు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోతున్నాయి. మౌలిక వసతులు కల్పించలేక వర్సిటీ అధికారులు ప్రతి నెలా సెక్రెటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలి. విశ్వవిద్యాలయాలలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. మౌలిక సౌకర్యాలు కల్పించి, పరిశోధనలకు పెద్దపీట వేయాలి. వర్సిటీల అభివృద్ధికి కావలసిన నిధులు కేటాయించాలి. రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో రిజర్వేషన్లను అమలు చేయాలి.
సత్యనెల్లి
ఓయూ, హైదరాబాద్
95503 95232