పార్టీలకు.. ప్రజారోగ్యంతో పనిలేదా?
why Political parties support liquor sales, they don't care about public health
మానవ ఆరోగ్యానికి వచ్చే అన్ని ముప్పులలో మద్యం, మత్తు పదార్థాలు చాలా ప్రమాదకరమైనవి. ఈ రెండూ విస్తృతమైన ఆరోగ్య నష్టాలకు, మరణాలకు కారణమవుతున్నాయి. ఇవి మెదడును కుదిపేస్తాయి, మేధస్సును బలహీనపరుస్తాయి. కాలేయం, గుండె, జీర్ణ వ్యవస్థ, నరాల వైఫల్యానికి కారణమవుతున్నాయి. అంతేకాకుండా నిరాశ, నిస్పృహ, హింస, ప్రమాదాలతో వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి దోహదం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేదరికం, ఆరోగ్యం, ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి, నివారించదగిన మరణాలకు ప్రధాన కారణాలలో ఆల్కహాల్ అత్యంత ముఖ్యమైనది.
లైసెన్సుకే కోట్ల ఆదాయం!
తెలంగాణలో మద్యం కిక్కు అసలు తగ్గడం లేదు. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా లిక్కర్ కిక్కు ఏమాత్రం తగ్గలేదు. విచిత్రంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఒక్క మద్యం బాటిల్ కూడా అమ్మకుండానే రూ.2639 కోట్ల రూపాయలను ఈ ఏడాది వసూలు చేసింది. 2,620 మద్యం షాపుల కేటాయింపు కోసం దాదాపు 1.32 లక్షల దరఖాస్తులు రాగా. వచ్చిన ప్రతి దరఖాస్తు దారు నుంచి రూ. 2 లక్షల నాన్-రిఫండబుల్ అప్లికేషన్ రుసుము వసూలు చేశారు. రెండేళ్ల క్రితం లైసెన్సులు జారీ చేసినప్పుడు సుమారు 69,000 దరఖాస్తుల నుంచి రూ.1,370 కోట్లు వసూలు చేయగా, కేవలం షాపు లైసెన్స్ ఫీజు ద్వారానే ప్రభుత్వానికి రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి ఏటా ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాలు 2014-15లో ₹ 10.833 కోట్లు, 2015-16లో ₹ 12.706 కోట్లు, 2016-17లో ₹ 14.784 కోట్లు, 2017-18లో ₹ 17.597 కోట్లు, 2018-19లో ₹ 20.959 కోట్లు, 2020-21లో ₹ 27.888 కోట్లు, 2021-22లో ₹ 34.352 కోట్లు, 2022-23లో ₹ 42.086 కోట్ల ఆదాయం సంపాదించింది.
నేటి యువతకు ఏమైంది?
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక్క పిలుపుతో ఉద్యోగాలు, చదువులు, పరీక్షలను వదిలి యువత రోడ్ల మీదుకొచ్చేవారు. అంత చైతన్యం గల యువత తెలంగాణ సొంతం. కానీ వారికి ఏమయిందో అర్థం కావడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ స్వరాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిదేళ్లు దాటుతున్న వాళ్ల ఆశలు తీరలేదు. ఉద్యోగం పొందకున్నను ఇవ్వడంలేదని నిలదీయడానికి ముందుకు వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. సామాన్యుల నడ్డి విరిగేట్లు నిత్యావసరాల ధరలు,కరెంట్, బస్ ఛార్జీలు పెరిగినా ఉలుకూ పలుకూ లేదు. దీనికి కారణం వారిని మత్తులో నిస్సుత్తువలను చేయడమే..మరోవైపు ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం తెలంగాణ సర్కారు ఏటేటా పెంచుకుంటోంది. దసరా, సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రభుత్వ ఖజనాకు రికార్డు స్థాయిలో మద్యం ద్వారా ఆదాయం వస్తోంది. ఇక, నయా సాల్ జోష్‌కు ప్రభుత్వం పోటీలు పెట్టి మరీ మద్యం అమ్మిస్తుంది.
ప్రభుత్వాలే ప్రోత్సహిస్తే ఎలా?
ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయవచ్చా లేదా టార్గెట్లు పెట్టి భారీగా ప్రోత్సహించవచ్చా? మద్య నిషేధం బదులు మద్యం తాగాలనే విధంగా అమాయక ప్రజలను బలి చేయవచ్చా? దీనికెవరు సమాధానం చెబుతారు? మన రాష్ట్రంలో తాగి ఊగేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తెలంగాణ పౌరులకు మద్యం లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. కొన్ని రాష్ట్రాలు బయట కాలు పెట్టకుండానే మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాయి. అమీర్ నుంచి గరీబ్ వరకు సంతోషమొచ్చినా. విషాదం వచ్చినా మద్యం తాగడం అలవాటుగా మారింది. ఇప్పుడా అలవాటును ప్రభుత్వం మరింత పెంచి పోషిస్తోంది. పైగా ప్రభుత్వానికి రోజువారీ ఖర్చులకు, ఉద్యోగుల జీతాలకు, సంక్షేమ పథకాలకు ఆదాయం కావాలి. ఆ ఆదాయాన్ని సమకూర్చడానికి ప్రజలు తాగాల్సిందేనా, వారి ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటే తప్ప ప్రభుత్వ ఖజానా నిండదా, ఊరూరా, వాడవాడలా బెల్ట్ షాపులు పెడుతున్నది ఇందుకేనా? నేడు తాగడం అనేది స్టేటస్ సింబల్‌గా మారింది. ప్రజలు మత్తులో జోగుతుండటమే సాదారణమయింది. ఈ విధంగా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ రాబడి పెద్ద కామధేనువుగా మారింది. ప్రభుత్వం బండి సాఫీగా సాగాలంటే. జనం తాగాలన్న అభిప్రాయం బాగా స్థిరపడిపోయింది.
మరో పోరాటం తప్పదా?
ఆల్కహాల్ హానికరమైన వినియోగం 200 కంటే ఎక్కువ వ్యాధులు. అనారోగ్య పరిస్థితులకు ముఖ్యమైన శత్రువు. ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం వలన ప్రతి ఏటా 30 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు, ప్రతి సంవత్సరం ప్రతి 10 సెకన్లకు ఒక వ్యక్తి మద్యం మూలాన మరణిస్తున్నాడు. ఇది మొత్తం మరణాలలో 5.3 శాతం... ఇంత అన్యాయం జరుగుతున్నా అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్యపాన నివారణపై కనీసం మేనిఫెస్టోలో చేర్చకపోవడం అవమానకరం.
రాష్ట్రంలో మద్యం వినియోగం పెరగడం ఆర్థిక రంగానికి శుభసూచకమని, పట్టణీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు, బయటి నుంచి వలసలు, పరిశ్రమల పెరుగుదల వల్ల ఇది సాధ్యం అవుతున్నదని కొందరు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ మద్యం వల్ల చితికిపోయిన కుటుంబాల మీద ఏనాడు అధ్యయనాలు లేవు. మద్యం వల్ల హింసకు గురవుతున్న మహిళల మీద సర్వేలు లేవు. మద్యానికి బానిసై మద్యలోనే చనిపోతున్న భర్తలు, విధవులవుతున్న వారి భార్యల గణాంకాలు లేవు. మద్యానికి ప్రజానీకం బానిసలుగా మారితే, దేశీయ ఉత్పత్తి జీడీపీ మీద దుష్ప్రభావం ఉంటుంది. మద్యం పరిశ్రమ, దాని వినియోగం వల్ల పర్యావరణం, కుటుంబాలు, సమాజం, అభివృద్ధి, ఆర్ధిక పాలన, భవిష్యత్ తరాల మీద పడే దుష్ప్రభావాల పైనా అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను తమ ఆదాయ వనరుగా చూడకుండా, మానవతా దృష్టితో మద్యం అలవాటు వల్ల జరుగుతున్న అమాయకుల మరణాలను నియంత్రించే దిశగా మద్యపాన నిషేధం దేవుడెరుగు కానీ , కనీసం కఠినమైన మద్యపాన నియంత్రణ వైపుగా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టి నిజాయితీగా అమలు చేసే దిశగా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులందరూ ఏకతాటిపైకి వచ్చి మరో ప్రజా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైనది.
డా. బి.వి. కేశవులు. ఎండీ
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
85010 61659