పద్మ' అవార్డులు వీరికెందుకు?

Why Padma awards for them?

Update: 2024-01-31 01:15 GMT

పద్మ పురస్కారం కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత గౌరవాల్లో ఒకటి. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితం మొదలగు వాటిలో విశిష్ట సేవలు చేసిన వారికి ఇచ్చే ఈ పౌర పురస్కారం. 1954 లో మొదలైంది. ఇలా ప్రతి యేడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 'పద్మ' పురస్కారాల జాబితాలో కళాకారులు, సామాజిక కార్యకర్తలతో పాటు సినిమా నటుల పేర్లు కూడా ఉంటాయి. మీడియా కూడా ఈ గౌరవం పొందిన సినిమావాళ్ళ ప్రచారానికే ప్రాధాన్యతనిస్తోంది. ఆయా సినిమా నటీనటులు కూడా అభినందనల వర్షంలో తడిసిపోతారు.

64 కళల్లో నటన ఒకటి. నటన అంటే రంగస్థలంపై ప్రదర్శించే కళ మాత్రమే. ఎంతో శ్రద్దగా నెలల తరబడి రిహార్సల్స్ చేసి, అన్ని విధాలా సిద్దమై తొట్రుపాటు లేకుండా వేదికపై తమను తాము పరీక్షించుకునే గొప్ప సాధన అది. ఏకధాటిగా ఒక్కో అంకం స్టేజిపై కొనసాగుతుంది. పాత్రధారులు ప్రేక్షకుల ముందుకొచ్చి సమన్వయంతో నాటకాన్ని పండిస్తారు. రంగస్థల కళాకారులకు నటన అనేది ప్రతిభ, అభిరుచి తప్ప ఆదాయ మార్గం కాదు. సినిమా నిర్మాణంలో మనుషులను కెమెరా ముందు యాక్షన్ చేయిస్తారు. అలా ఒకటికి పదిసార్లు యాక్షన్, కట్ అంటూ తెచ్చిన ముక్కలను అతికించి ఒక సినిమా తయారు చేస్తారు. కెమెరా ఫ్రేమ్‌లో లేని నటుడు నటించే అవసరం లేదు. నాటకం మాదిరి సన్నివేశంలో ఉన్న నటులంతా కలిసి నటించే లాంగ్ షాట్‌లు తక్కువే. సినిమా నటీనటులది వృత్తి. అది వారి ఉపాధి. సినిమా విజయాన్ని బట్టి ఆదాయాన్ని పెంచుకుంటూ పోతారు. కోట్లు ఇస్తే తప్ప నటించమనే స్థాయికి చేరిపోతారు.

ఈ పురస్కారాలు గౌరవాలే..!

సినిమాల వల్ల వినోదం తప్ప సామాజిక ప్రయోజనం తక్కువ. సెన్సార్ అనుమతించిన మేరకు బూతును కూడా తెరపైకి తెస్తారు. అయితే వాటిలో ఉన్న ప్రతిభను, సామాజిక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు సినిమాలకు విడిగా జాతీయ అవార్డులు ప్రకటిస్తున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటీనటులు, సహాయ నటులు అంటూ రకరకాల సినీ అవార్డులు ఉండనే ఉన్నాయి. ఒక కళ నిలవడానికి, దాని అభివృద్ధికి జీవితాన్ని వెచ్చించేవారే నిజమైన కళా పద్మశ్రీలు, భూషణ్‌లు. చిన్న ఇంట్లో ఉంటూ ఎందరో యువ శిల్పులకు శిక్షణ ఇస్తూ శిల్పకళను బతికిస్తున్న ఆనందాచారి వేలు ముందు ఏ నటుడు తూగగలడు. తన ఆర్జననంతా కూడబెట్టి పుట్టిన ఊరు వెల్లంకిలో ఇంటినే గ్రంథాలయంగా తీర్చిదిద్దిన వృద్ధజీవి కూరెళ్ల విఠలాచార్య పద్మ పురస్కారానికి వాస్తవ యోగ్యులు. ఎన్నో పురాణగాథలు బుర్ర వీణపై వాయిస్తూ చెప్పే దాసరి కొండప్పను పద్మశ్రీ వెతుక్కొని వెళ్లాల్సిందే.

తొలిసారిగా హిందీ నటి నర్గీస్‌కు 1958‌లో పద్మశ్రీ అందించి ఫిలిం స్టార్లకు కళాకారుల హోదాను ప్రభుత్వం కట్టబెట్టింది. అలా మొదలైన ఈ పరంపర పాపులర్ సినిమా యాక్టర్లను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొనేలా మారిపోయింది. నిజానికి ఈ పురస్కారాలు గౌరవాలే తప్ప బిరుదులు కాదు. ఈ అవార్డులను పేరు ముందు పెట్టుకొని కొందరు తమ అవసరాలకు, వ్యాపారాల వృద్ధికి వాడుకుంటున్నారని సుప్రీం కోర్టులో ఒకరు కేసు వేయడంతో పద్మశ్రీ, పద్మభూషణ్ అని పేర్ల ముందు వాడడాన్ని 1968లో కోర్టు నిషేధించింది.

సంతృప్తికే పరిమితమవుతున్న వారెందరో..

అయితే ఈ విషయం తెలియని కొందరు తెలుగు సినిమా నటులు సినిమా టైటిల్స్‌లో తమ పేరు ముందు పద్మశ్రీ అని వేసుకొని రచ్చకెక్కారు. చివరకు తమకు విషయం తెలియదని చెంపలేసుకున్నారు. 2012లో 'దేనికైనా రెడీ' అనే తెలుగు సినిమా టైటిల్స్‌లో హీరో, కమెడియన్ పేర్ల ముందు పద్మశ్రీ అని వాడారు. దీనికి అభ్యంతరం చెబుతూ బీజేపీ నేత ఒకరు కోర్టుకెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు వాటిని తొలగించారు. మరోసారి వాడితే వాటిని రద్దు చేయమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని న్యాయమూర్తి వారిని హెచ్చరించారు. పొందిన అవార్డుల విధివిధానాలు తెలుసుకోవడం కనీస ధర్మం.

ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించినా వాటిని తీసుకోవడం అనేది ఆయా వ్యక్తుల ఇష్టాలకే వదిలేస్తుంది. హృదయనాథ్ కుంజ్రు 1968లో ఏకంగా భారతరత్నను వద్దన్నారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడే కాదు, ఉత్తమ పార్లమెంటేరియన్ కూడా. దేశ పౌరుడిగా నా ధర్మం నిర్వర్తించాను, దానికి ఎలాంటి గుర్తింపు అవసరం వద్దన్నారాయన. పద్మవిభూషణ్ అవార్డును తిరస్కరించిన మొదటి వ్యక్తి ఇందిరా గాంధీ ప్రధాన కార్యదర్శి, పీ‌ఎన్ హక్సర్. తన ఉద్యోగ ధర్మంగా పని చేసుకుపోతున్నానని, ఈ అవార్డును స్వీకరించడం చాలా అసౌకర్యంగా ఉంటుందన్నారు. 1972లో వీధి నాటకాల సృష్టికర్త బాదల్ సర్కార్ పద్మశ్రీని వద్దన్నారు. నేను నాటకకర్తను, నాకు 1968లో సంగీత నాటక అకాడమీ అవార్డు ఇచ్చారు. నా కృషికి అదే యోగ్యమైనది అన్నారు. ఇలా తమ దోహదాన్ని సంతృప్తికే పరిమితం చేసుకున్న వారెందరో ఉన్నారు. ఇదంతా వృత్తి నైపుణ్యంతో పాటు విజ్ఞతతో కూడుకున్న విషయం.

-బి.నర్సన్

94401 28169

Tags:    

Similar News