24 ఫ్రేమ్స్:తెలుగు సినిమాకు ప్రభుత్వం ఆ ప్రోత్సాహం అందించడం లేదా?

మానవ పరిణామ క్రమంలో కొత్త ఆలోచనలూ, నూతన ఆవిష్కరణలూ ఎన్నో జరిగాయి. అట్లా జరిగినప్పుడల్లా అప్పటిదాకా ఉన్న వ్యవస్థలు ఉలిక్కిపడడం,

Update: 2022-07-29 19:00 GMT

మంచి సినిమాలకు ప్రభుత్వాలూ, కొన్ని ప్రైవేటు సంస్థలూ యేటా అవార్డులు ఇస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత మాత్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ తెలుగు సినిమాలకు అవార్డులు ఇచ్చే సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చేసాయి. 'నంది' అవార్డుల ఊసే మర్చిపోయాయి. ఫిలిం డెవలప్‌మెంట్ గురించే విస్మరించినవారికి అవార్డులు మర్చిపోవడం పెద్ద విషయం కాదు. విచిత్రమేమిటంటే టికెట్ రేట్ల గురించి, స్పెషల్ షోల గురించి ప్రభుత్వాల దగ్గర చేతులు కట్టుకుని నిలబడే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తమ వర్క్‌కు ఇచ్చే పురస్కారాల గురించి మాటా పలుకూ లేదు. బహుశా 'మనం తీసే సినిమాలకు అవార్డులు ఎందుకు? అవేమైనా గొప్ప సినిమాలా?' అని అనుకుంటున్నారేమో తెలీదు.

మానవ పరిణామ క్రమంలో కొత్త ఆలోచనలూ, నూతన ఆవిష్కరణలూ ఎన్నో జరిగాయి. అట్లా జరిగినప్పుడల్లా అప్పటిదాకా ఉన్న వ్యవస్థలు ఉలిక్కిపడడం, కుదుపునకు లోనవడం చూస్తూనే వున్నాం. నిప్పును కనిపెట్టినప్పటి నుంచీ ఇది సాధారణం. ఇవ్వాల దృశ్య మాధ్యమం విషయానికి వస్తే ఓటీటీల ఆవిష్కరణ సినిమారంగాన్ని పెద్ద కుదుపే కుదిపింది. నిర్మాతలలో కలవరమే మొదలైంది. సినిమాహాళ్లకు ప్రేక్షకులు రావడం లేదని, అసలు సినిమాలను ఓటీటీలకు ఇచ్చే ఆలోచన మీదే పెద్ద చర్చ జరుగుతున్నది. సినిమాలు ఇవ్వాలా వద్దా, ఇవ్వడం అంటూ ఉంటే ఎప్పుడు? వెంటనేనా? లేక 20 వారాల తర్వాతనా? పెద్ద సినిమాలూ, చిన్న సినిమాలూ అంటూ మరో ఆలోచన. హాళ్లలో విడుదలకే నోచుకోని అనేక సినిమాలు ఓటీటీలలో విజయవంతమవుతున్నాయి. అవార్డులు గెలుచుకుంటున్నాయి. థియేటర్లలో విడుదలైన అనేక సినిమాలు అడ్రస్ లేకుండా పోతున్నాయి.

చిన్న సినిమాలూ, పెద్ద సినిమాలూ అన్న విభజనను పక్కన బెట్టి మంచి సినిమాలూ, చెడ్డ సినిమాలూ అని వివేచన చేస్తే చాలా విషయాలు స్పష్టమవుతాయి. మంచి సినిమాలకు ప్రభుత్వాలూ, కొన్ని ప్రైవేటు సంస్థలూ యేటా అవార్డులు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మాత్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ తెలుగు సినిమాలకు అవార్డులు ఇచ్చే సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చేసాయి. 'నంది' అవార్డుల ఊసే మర్చిపోయాయి. ఫిలిం డెవలప్‌మెంట్ గురించే విస్మరించినవారికి అవార్డులు మర్చిపోవడం పెద్ద విషయం కాదు. విచిత్రమేమిటంటే టికెట్ రేట్ల గురించి, స్పెషల్ షోల గురించి ప్రభుత్వాల దగ్గర చేతులు కట్టుకుని నిలబడే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తమ వర్క్‌కు ఇచ్చే పురస్కారాల గురించి మాటా పలుకూ లేదు. బహుశా 'మనం తీసే సినిమాలకు అవార్డులు ఎందుకు? అవేమైనా గొప్ప సినిమాలా?' అని అనుకుంటున్నారేమో తెలీదు.

ఎంపికలో అంతరాలు

దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యేటా ఇచ్చే జాతీయ అవార్డులను కొనసాగిస్తున్నది. అభినందించాల్సిన విషయమే. కరోనా కొంత బ్రేక్ ఇచ్చినా ఈ యేడాది అవార్డులను ఇటీవలే ప్రకటించారు. నిజానికి అవార్డు ఒక గుర్తింపు. సాహితీ సాంస్కృతిక సామాజిక రంగాలలో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ చేసిన విశిష్ట కృషికి లభించే ప్రశంస. అది హార్దికంగానూ లేదా ఆర్థిక ప్రోత్సాహకంగానూ ఉండొచ్చు. లేదా బిరుదు లాంటిది కూడా కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా పలు సంస్థలూ, వ్యక్తులూ, ప్రభుత్వాలూ అనేక అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. స్వీకర్తల కృషికి గుర్తింపునూ, మునుముందు మరింత కృషి చేసేందుకూ అవార్డులు దోహదం చేస్తాయి.

మొదట జాతీయ అవార్డుల కోసం ఒక పద్ధతిని అవలంబించారు.ప్రాంతీయస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి, అవి ఎంపిక చేసిన ఉత్తమ సినిమాలను జాతీయస్థాయిలో పరిగణనలోకి తీసుకుని అక్కడి కమిటీ ద్వారా జాతీయ ఉత్తమ అవార్డులను ఎంపిక చేసేవారు. రెండు స్థాయిలలో ఎంపిక సరైది కాదనే వాదన రావడంతో తిరిగి జాతీయస్థాయి ఎంపికను ప్రారంభించారు. సినిమాలలో ఉన్న సున్నితత్వమూ, కళాత్మకత, మానవీయ లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక జరగాలని నిర్ణయించారు. డ్రామాకు కాకుండా, వాస్తవిక దృక్పథంతో నటించిన నటులను అవార్డులకు ఎంపిక చేసేవారు. పాత్రలలో నటులు కాకుండా, ఆ పాత్రలే కనిపించడాన్ని ప్రాతిపదికగా తీసుకునేవారు. ఫలితంగా సమాంతర సినిమాలకు ఈ అవార్డులలో పెద్దపీట లభించింది.

రాజకీయ జోక్యంతో

కాలక్రమేణా మారిన రాజకీయ దృక్పథం, పెరిగిన వ్యాపారాత్మకత ఈ అవార్డులలోనూ చేయి చేసుకోవడం మొదలైంది. పర్యవసానంగా జాతీయస్థాయిలో వినోదాత్మక, కుటుంబ కథా చిత్రాలకూ ప్రత్యేక అవార్డులను ప్రవేశ పెట్టారు. అలాంటి ప్రత్యేక విభాగాలతో సంతృప్తి చెందని వర్గాలు అవార్డుల ఎంపికను ప్రభావితం చేయడం ఆరంభించారు. అవార్డుల మూల లక్ష్యాలను తుంగలో తొక్కుతూ, వినోదమూ, వ్యాపారమూ ప్రధానంగా వున్న చిత్రాలకూ, నటులకూ అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు. వాస్తవికతను పక్కన పెట్టారు.

జాతీయ ఉత్తమ చిత్రంగా' బాహుబలి' ని ఎంపిక చేసినప్పుడు విమర్శలు వచ్చాయి. సాంకేతికపరంగా గొప్పగా తీసినప్పటికీ బాహుబలిలో ఏ మానవీయ విలువల ఆవిష్కరణ జరిగిందని అదూర్ గోపాల కృష్ణన్, గిరీష్ కసరవెల్లి లాంటి దర్శకులు ప్రశ్నించారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన రాజకీయ మార్పే దీనికి కారణమని కూడా పలువురు మాట్లాడారు. ఇలాంటి కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇవ్వడానికి ఫిల్మ్ ఫేర్, ఐఫా, జీ సినీమా, స్క్రీన్ అవార్డులలాంటివి వుండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులను వ్యాపారమయం, ఆశ్రిత పక్షపాతమయం చేయడం అభిలషణీయం కాదన్నది నా అభిప్రాయం. ఏది ఏమైనా అవార్డులు ఇచ్చి ప్రోత్సహించే బాధ్యతను కేంద్రం మరవకపోవడం మాత్రం గొప్ప విషయమే. అలా ఎంపిక చేసిన పలు సినిమాలను ఓటీటీల పుణ్యమా అని ఇంటిలోనే కూర్చుండి చూసే అవకాశం కలిగింది. అందుకు వాటికి ధన్యవాదాలు చెప్పాలి.

దక్షిణాది సినిమాల ఘనత

ఈ యేటి పురస్కారాలు అత్యధిక భాగం దక్షిణాది సినిమాలకు దక్కాయి. తమిళ సినిమాకు పది, మలయాళానికి తొమ్మిది, తెలుగుకు నాలుగు, కన్నడకు రెండు అవార్డులు లభించాయి. సమాంతర సినిమాలు ఉద్యమంగా రూపొందుతున్న కాలంలో బెంగాల్ తర్వాత దక్షిణాది సినిమాలు ఉత్తమ సినిమాలుగా ఎలా నిలిచాయో, అదే రీతిలో ఈ యేడూ కూడా ప్రయోగాలకు, ప్రయత్నాలకు గుర్తింపు లభించింది. సంపన్నులకే పరిమితమైన విమాన ప్రయాణాన్ని సామాన్యులకూ సాధ్యం చేసిన శ్రీ గోపీనాథ్‌ నిజజీవిత కథను ఆధారం చేసుకుని రూపొందించిన సినిమా 'సూరారై పోట్రు' సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'ఆకాశమే హద్దుగా' వచ్చి ప్రేక్షకాదరణ పొందింది.

కధానాయకుడిగా సూర్య ఎంతో ఉద్వేగంగా నటించి ఈ సినిమాకు ప్రాణం పోశాడు. భార్య పాత్రలో అపర్ణ బాలమురళి అద్భుతంగా నటించి, రాణించింది. ఈ ఇద్దరికీ జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి పురస్కారాలు రావడం విశేషం. ప్రేమా, పెళ్లి వ్యవహారాలలో కుల ఆర్థిక వివక్ష మాత్రమే కాకుండా, రంగు వివక్షా ఉంటుందన్న ఇతివృత్తంతో వచ్చిన తెలుగు సినిమా 'కలర్‌ ఫొటో' ఉత్తమ చిత్రంగా ఎంపికవడం మంచి సినిమాకు దక్కిన గౌరవంగా భావించాలి. సంగీతం, నృత్యం ప్రధాన అంశాలుగా తెరకెక్కిన తెలుగు సినిమా 'నాట్యం' రెండు పురస్కారాలను పొందింది. సత్యం రామలింగరాజు కోడలు సంధ్యారాజు తొలిసారి కెమెరా ముందుకు వచ్చి నటించిన సినిమా ఇది. మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌' కోసం జానపద గీతం పాడిన సంజయమ్మకు ఉత్తమ నేపథ్య గాయని అవార్డు రావడం నాకు గొప్ప ఊరట నిచ్చింది. విజేతలకు అభినందనలు. 

 వారాల ఆనంద్

94405 01281

Tags:    

Similar News