శిక్షలు లేని చట్టాలెందుకు..!
why law.. without punishment in manipur violence
మణిపూర్ లోని ఇద్దరు కుకి మహిళలపై జరిగిన దారుణ సంఘటన దేశంలోని స్త్రీలకు గల రక్షణ ఏపాటిదో స్పష్టం చేసింది. సంఘటనపై సుమోటాగా స్పందించిన సుప్రీంకోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటుగా వ్యాఖ్యానించడం అభినందనీయం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పా, మిగతా సమయంలో కోర్టులు కానీ, మీడియా కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. వాస్తవంగా ఆలోచిస్తే మహిళలపై దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం ఇలాంటి హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు సంఘటన అనంతరం కూడా ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జరిగిన సంఘటనకు మత రాజకీయం పూసి, లబ్ది పొందాలనుకోవడం దురదృష్టకరం. చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది నిజమే కావచ్చు కానీ ఇలాంటి సంఘటనల్లో బాధితుల కన్నా ఎక్కువగా రాజకీయ పార్టీలు లాభపడుతున్నాయి అని చెప్పొచ్చు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నంతకాలం మహిళలు, బాధితులు బలవుతూనే ఉన్నారు.
నిందితుల పైన ఎన్ని బలమైన చట్టాలు ప్రయోగించినా భారత చట్టాలలోని బలహీనతలు ఆధారంగా నిందితులు జైలు నుండే కాదు, కేసుల నుండి కూడా బయటపడుతూనే ఉన్నారు. ఇలాంటి కేసుల్లో అయితే విదేశాల్లో ఖచ్చితంగా మరణ శిక్షలు విధిస్తారు కానీ మనదేశంలో మాత్రం నిందితుల పక్షాన నీతి సూత్రాలు వల్లిస్తాం, వారిని దర్జాగా వదిలేస్తాం. అత్యాచారాల విషయాల్లో నిందితులను ఉరి తీయాలి అని వాదించే రాజకీయ నాయకులు ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్న ఉదంతాలు దేశంలో ఎన్నో వున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడే నాయకులు ఒక్క మన దేశంలో మాత్రమే కనిపిస్తారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు, దీర్ఘకాలిక విచారణ కారణంగా బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదు. నేరాన్ని నిరూపించి, నిందితులకు శిక్షలు వేయించడంలో పోలీసులు సైతం విఫలమవుతూనే వున్నారు. పోలీసు, న్యాయవ్యవస్థల్లోని అవినీతి, లంచగొండితనం కూడా నేరస్తులకు శిక్షలు పడకుండా కాపాడుతోంది. ఈ దేశాన్ని దేవుడు కూడా రక్షించలేడని గతంలో సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. న్యాయవాదులు సైతం ఇలాంటి హత్యాచార ఘటనల్లో నిందితుల పక్షాన వకాల్తా పుచ్చుకోవడం మానేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మహిళలపై నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడితేనే ఇలాంటి హత్యాచారాలు పునరావృతం కావు. నేరస్థులపై శిక్షలు పడని ఎన్ని చట్టాలు ప్రయోగించినా ప్రయోజనం లేదు.
-పసునూరి శ్రీనివాస్
అడ్వకేట్
88018 00222