మౌనం అర్ధాంగీకారమా?

మౌనం అర్ధాంగీకారమా?... why KCR Silence on TSPSC Paper leak Issue

Update: 2023-04-05 00:45 GMT

రాష్ట్రంలో సగటున ప్రతి మూడు కుటుంబాల నుంచి ఓ యువతి, యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారు. కొత్త రాష్ట్రంలో కోటి కలలతో కొత్త జీవితంలో అడుగుపెట్టి పెళ్లి.. పిల్లలతో సంతోషంగా జీవించాలనే తపనతో నిరుద్యోగులు అష్ట కష్టాలు పడ్డారు. కంటికి నిదుర.. కడుపుకు తిండి నోచుకోకుండా రేయింబవళ్ళు కష్టపడి చదివిన నిరుద్యోగులకు పేపర్ లీక్ కావడం అనేది కోటి ఆశలు నింపుకున్న వారి జీవితాన్ని తలకిందులు చేసింది. టీఎస్‌పీఎస్సీలో నిర్లక్ష్యం రాజ్యమేలి నిరుద్యోగులను నిండా ముంచింది. రాజకీయ అండదండలతో పరీక్షా పత్రం అంగడి సరుకుగా మారింది. డబ్బున్న వాడు దండుకున్నాడు పేదోడు అష్టకష్టాలు పడి చదువుకున్నాడు. కానీ పేపర్ లీక్ కావడంతో విద్యార్థుల జీవితాలలో పూడ్చలేని వెలితి మిగిలింది. ఇది వేలాది కుటుంబాలకు సంబంధించిన అంశం. కానీ లీకేజీ బాధ్యులను గుర్తించి దోషులుగా నిలబెట్టేందుకు తెలంగాణ సర్కారు ఆసక్తి కనబరచకపోవడం మరో విచిత్రం. అందుకే నేటికీ ఈ ఘటనపై స్పందించి ముఖ్యమంత్రి కనీసం పత్రిక ప్రకటన కూడా వెల్లడించలేదు. మరీ ఇంతటి నిర్లక్ష్యపు ధోరణి ముఖ్యమంత్రికి తగునా..? అహంకారమా.. నిర్లక్ష్యమా.. నియంతృత్వమా.. లేక లెక్కలేనితనమా..? ఏ విధంగా అర్థం చేసుకోవాలో అంతుపట్టడం లేదు ముఖ్యమంత్రి తీరు! దోషులను శిక్షించేందుకు ప్రభుత్వానికి మనసు రాకపోవడం ఏమనాలి. ఈ కుంభకోణంలో ప్రభుత్వ వాటా ఉందని భావించాలా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

ఇందుకేనా రాష్ట్రం తెచ్చుకుంది?

గ్రూప్-1తో మొదలుకొని పలు ఉద్యోగ నోటిఫికేషన్ల లీకేజీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే.. ముఖ్యమంత్రి హోదాలో కనీసం స్పందించిన దాఖలాలు లేకపోవడం బాధ్యతారాహిత్యం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఈ ఉద్యోగ ప్రక్రియ ఇంత ఘోరంగా వైఫల్యం చెందితే దాని గురించి ముఖ్యమంత్రి మాట మాత్రం మాట్లాడకపోవడం దేనికి సంకేతంగా భావించాలి.? నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో ప్రారంభమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెలంగాణ సాధించి తీరింది. కానీ ఏ ఆశయం కోసం యువత ఉద్యమించిందో ఆ లక్ష్యం నేడు పూర్తిగా నీరుగారుతోంది. అయితే ఈ లీకేజీపై కేసీఆర్ స్పందించకపోగా, తనయుడు కేటీఆర్ అన్ని తానై మాట్లాడుతున్నాడు.

టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగ సంస్థ. రాజకీయ శక్తులకు అతీతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. మరి రాజ్యాంగ సంస్థ తప్పు చేస్తే కేటీఆర్ ఆ సంస్థ తరఫున ఎందుకు మాట్లాడుతున్నారు. ఆ సంస్థలు తప్పు చేయవచ్చా.. చేస్తే బాధ్యత తీసుకోవద్దా.. ? వారిని శిక్షించవద్దా? బాధ్యతగా ఉండాల్సిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జరిగిన పాపానికి ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్.. ఫోర్త్ క్లాస్ ఉద్యోగులను బూచిలుగా చూపెట్టారు. మరి లీకేజీలో నాలుగో తరగతి ఉద్యోగులు బాధ్యులు అయితే.. చైర్మన్, సెక్రటరీలు ఎందుకు ఉన్నట్టు? ఈ లీకేజీ కేసులో వాస్తవాలు వెల్లడించమని రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు కోరితే వారికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఏ విధంగా భావించాలి. ప్రభుత్వం ఎన్ని అక్రమాలు, అవినీతి చేసినా నోరు మూసుకొని కూర్చోవాల్సిందేనా? పరీక్ష లీకేజీ విషయం తెలిసి కడుపు మండి నిరసన వ్యక్తం చేసిన నిరుద్యోగులను, వివిధ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతలను జైల్లో వేయడం ఎటువంటి ప్రజాస్వామ్యం అనుకోవాలి.. ? తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా.. ఉద్యోగాలను అంగట్లో అమ్ముకోవడానికేనా?

అసలు దొంగలను కాపాడుతున్నారా?

రాష్ట్రంలో గిరిజన మెడికో విద్యార్థిని ప్రీతి మరణం, లీకేజీ వ్యవహారంపై స్పందించని ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ సస్పెన్షన్ విషయంలో స్పందించడం తెలుసు. మహారాష్ట్రకు వెళ్లి రాజకీయ సభలు నిర్వహించడం తెలుసు. కానీ రాష్ట్ర సమస్యల పట్ల ముఖ్యమంత్రికి సమయం లేదు. ముఖ్యమంత్రి మౌనం నిరుద్యోగులను వెక్కిరించే వ్యవహారమేనని అనుమానం కలుగుతుంది. రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడి చేయడం మానుకుని దోషులను శిక్షించాలి. అసలు దొంగలను కాపాడి.. అటెండర్లపై చర్యలు తీసుకోవడం అంటే నిరుద్యోగులకు ద్రోహం చేసినట్లే భావించాల్సి వస్తుంది. సిట్‌పై నమ్మకం లేదు, సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు చేస్తున్న డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు? పైగా విచారణ సీబీఐతో చేయించమని కోరితే బీజేపీ వారే ఈ లీక్ చేశారని భుజాలు ఎందుకు తడుముకుంటున్నట్టు? తప్పు చేయకపోతే ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జికి ఎందుకు అప్పగించడం లేదు? అయితే ఏం జరిగినా ఈ కేసుని రాజకీయ ఆరోపణలతో సరిపెట్టకుండా ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడి నిరుద్యోగులకు న్యాయం చేయాలి.

కొసమెరుపు

టీఎస్పీఎస్సీ లీకేజీ మాత్రమే కాదు.. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్లు కూడా లీక్ అవుతున్నాయి.. అంటే రాష్ట్రంలో ఎటువంటి పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అవినీతి, అసమర్థ పాలన కారణంగానే ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల భవితవ్యం అంధకారంలో మగ్గుతోంది. టెన్త్ క్లాస్ పరీక్ష ప్రారంభం రోజునే వికారాబాద్ జిల్లా తాండూరులో ఎగ్జామ్ పేపర్ లీక్ కావడం, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో పరీక్షజవాబు పేపర్ల గట్టలు మిస్ కావడం బాధ్యతారాహిత్యం. హైదరాబాదులో మిస్ అయిన పరీక్ష పత్రాలు అవి నేటికీ లభించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనమే. ఈ ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాలో హిందీ పరీక్ష పేపర్ కూడా లీక్ కావడం బాధ్యతారాహిత్యానికి సాక్ష్యం. ఉజ్వల భవిష్యత్తు ఉన్న పదో తరగతి పిల్లల భవితవ్యాన్ని గాలికి వదిలేసి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. పాలకుల అవినీతికి, చేతకానితనానికి నిరుద్యోగులు, విద్యార్థులు బలి కావడం బాధాకరం.

పగుడాకుల బాలస్వామి

9912975753

Tags:    

Similar News