నీతుల మాటున రోత రాజకీయం

Why is Modi supporting Jagan

Update: 2023-10-06 01:00 GMT

కాషాయ దళం నీతుల మాటున రోత రాజకీయం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కన్నా తాము విలక్షణమైన రాజకీయ పక్షంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కమలనాథులు కాంగ్రెస్ కంటే ఎక్కువగా మురికి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. మోడీ పాలన పదేళ్లుగా ఆసాంతం అసత్యమేవ జయతే అన్న రీతిలో సాగింది. మోదీ మాటల్లో ఉన్న నీతి, నిబద్ధత, నిజాయితీ చేతల్లో లేదని రుజువైంది. అవినీతి అంతం నా పంతం అని ప్రగల్భాలు పలికి ఎల్లలెరుగని అవినీతికి పాల్పడిన అవినీతిపరులతో చేతులు కలిపి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొంటున్నారు. ఆర్ధిక నేరస్తుల అంతు చూస్తానని బూటకపు వాగ్దానంతో దేశ ప్రజల్ని బురిడీ కొట్టించారు. అధికారంలోకి వస్తే చట్టసభలకు ఎన్నికైన నేరచరితుల ప్రమాణ పత్రాలను సుప్రీంకోర్టుకు అందించి ఆయా కేసులపై సత్వర విచారణ జరిపి ఏడాదిలోగా తీర్పు వెల్లడించాలని కోరుతామని 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీ ఏమైంది? మీ రాజకీయ అవసరాల కోసం ఎన్ని వేల కోట్లు ప్రజాధనం లూటీ చేసినా వెనుకేసుకొస్తారా? ఆర్ధిక నేరగాళ్లను నిరపరాధులుగా తీర్మానించే దుష్ట రాజకీయం మోదీ పాలనలో కొత్త కోరలు తొడుక్కుంది. దేశంలో తనకు అనుకూలమైన ఆర్ధిక నేరగాళ్ళు బోర విరుచుకుని తిరిగే సౌలభ్యం కలిగిస్తున్నారు మోదీ. అది మరిన్ని నేరాలకు దారితీసే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీతుల మాటున రోత రాజకీయాలు చేస్తూ తిరిగి అధికారంలోకి రావాలని అడ్డదారులు తొక్కుతు అనైతిక పద్దతులు అవలంభిస్తున్నారు.

చంద్రబాబుపై ఎందుకంత అక్కసు!

మోడీ పాలనలో దేశ ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్నాయి.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని దేశమంతా కోడై కూస్తుంది. చంద్రబాబు చేసిన నేరం ఏమిటి గతంలో రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని నిలదీయడమేనా? బీజేపీ తమ భావజాలం వదిలిపెట్టి జగన్ భావజాలం వంటబట్టించుకొని వికృతంగా వ్యవహరిస్తోందని ప్రజలే అంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వెనుక బీజేపీ, వైసీపీ ఆడుతున్న నాటకం అని ప్రస్పుటం అవుతుంది. అడ్డదారిలో చంద్రబాబును బంధించి అధికారంలోకి రావడం కోసం బీజేపీ, వైసీపీలు సిద్ధపడినట్లు కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అధికారాన్ని అడ్డుకొనేందుకు మహా కుట్రల సిద్ధాంతాన్ని బీజేపీ-వైసీపీ ప్రయోగించాయి.

ఎటువంటి ఆధారాలు లేకుండా 73 ఏళ్ల చంద్రబాబును దారుణంగా వేధిస్తూ అరెస్టు చేసి అర్ధరాత్రి రాజమండ్రి జైలులో బంధించి 25 రోజులు అవుతున్నా కేంద్ర ప్రభుత్వ పెద్దలు నోరు తెరవ లేదంటే వారి వ్యూహం ఏమిటో పక్కాగా అర్థం అవుతుంది. తెలంగాణా ప్రభుత్వం జగన్ చెల్లెలు షర్మిళను అరెస్ట్ చేస్తే తెల్లవారి పాటికి ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోదీ, చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఖండించలేదంటే మోడీ, షా ఎంత విద్వేషంతో వున్నారో అర్ధం అవుతుంది. వారికి సంబంధం లేకపోతే చంద్రబాబు అరెస్టుపై ఎందుకు మాట్లాడరు? 1999 నుండి 2004 వరకు 29 మంది ఎంపీలతో చంద్రబాబు కేంద్రానికి మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగేదా? రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు లేదా తమ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాలు ఉండాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రధాని మోడీకి అందరు అవినీతి పరులు గా కనిపిస్తారు. కానీ బీజేపీకి మద్దతు ఇచ్చే వారు ఎన్ని కోట్ల అవినీతికి పాల్పడినా వారి అవినీతి కనిపించరు. వారి గురించి మాట్లాడరు. ప్రధాని దృష్టిలో వారు అవినీతి పరులు కారు.

జగన్‌కి అంత సాహసమెక్కడిది?

ప్రధాని మోదీ అవినీతిపరుడు కాకపోవచ్చు..కానీ రాజకీయ అవసరాల కోసం అవినీతి పరులను ఆదరించడం అవినీతి పరులను కాపాడటం కూడా అవినీతి కిందికే వస్తుంది. అత్యంత అవినీతి పరుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న ఔదార్యం దేనికి సంకేతం రాజకీయంగా తమకు మద్దతు ఇవ్వని ప్రతిపక్ష నాయకుల పట్ల అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మరి భయంకరమైన అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన వారిపై డజన్ల కొద్ది సీబీఐ కేసులు నమోదై పన్నెండు ఏళ్ళు దాటినా ముందుకు పోకుండా అడ్డుకుంటున్నది. 2019 ఎన్నికల్లో అత్యంత అవినీతి పరుడు జగన్ గద్దె నెక్కడానికి మద్దతుగా నిలిచిన బీజేపీ నేడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా అండగా నిలుస్తుంది. ప్రతిపక్ష తెలుగు దేశాన్ని అణచివేసే భాధ్యతను వైసీపీకి అప్పగించింది బీజేపీ అధిష్టానం. అందుకే అరాచక పాలన చేస్తూ,అక్రమ కేసులు పెడుతూ, ప్రతిపక్ష సభలను, రోడ్ షోలను అడ్డుకుంటూ నిర్భంధించడం అందులో భాగమే. కేంద్రం అండదండలు లేకుండా జగన్ ఇంత నిరంకుశంగా పాలన సాగించరు. జగన్ భుజంపై తుపాకీ పెట్టి తెలుగుదేశాన్ని కాల్చాలని చూస్తోంది బీజేపీ అధిష్టానం. ముందు చంద్రబాబుని దెబ్బతీస్తే, జగన్ రెడ్డిని ఎప్పుడైనా దెబ్బతీయవచ్చని బిజెపి ఆలోచన. జగన్ రెడ్డి వేధింపులు, ప్రతీకారం తట్టుకోలేక చంద్రబాబు తమ వద్దకు వచ్చి లొంగిపోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే రాష్ట్రంలో ఫాసిస్టు పాలనకు అండగా నిలుస్తుంది బిజెపి.

క్విడ్ -ప్రోకో ఒప్పందం అంటే ఇదే…!

బీజేపీ -వైసీపీ మధ్య క్విడ్ -ప్రోకో ఒప్పందం జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూక్తి జగన్ విషయంలో ఎందుకు అమలు కావడం లేదు రాజకీయ అవసరాల కోసమే జగన్‌పై ఈగ వాలనీయడం లేదు. కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తూ ప్రధాన కేసులను సీబీఐ నీరు కారుస్తున్నది. ఈడీ, సీబీఐ కేసులే కాదు బాబాయ్ వివేకా హత్య కేసులలోనూ అండగా నిలుస్తున్నది బీజేపీ. వివేకానంద రెడ్డి హత్యకు కారకులు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని సీబీఐ చార్జి షీట్ లో నిర్ధారించింది. అవినాష్ రెడ్డిని అరెష్టు చేయాలని సీబీఐ అధికారులు అనుకున్నా అది జరగలేదంటే ఇందులో కూడా కేంద్ర పెద్దల సూచనల మేరకే సీబీఐ వ్యవహరించింది. పీకల్లోతు అవినీతి కేసుల నుండి జగన్ బయట పడాలి అంటే కేంద్ర బీజేపీ పెద్దల చల్లని చూపు అవసరం. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వక పోయినా జగన్-కేంద్ర ప్రభుత్వంతో పోరాడే పరిస్థితి లేక రాష్ట్ర ప్రయోజనాలే తాకట్టు పెట్టారు.

ఆర్ధిక నేరస్తులకే అచ్చే దిన్

బీజేపీ మద్దతు ఇస్తున్న అవినీతి పరులందరూ నిర్దోషులని ప్రధాని మోదీ నమ్ముతున్నారు అలా భావిస్తే ఆ మాటే ప్రజలకు చెప్పండి, మీకు మద్దతు ఇస్తున్న జగన్‌పై వున్న కేసులు ఎత్తి వెయ్యండి ఒక పక్క అవినీతి ఆరోపణలు ఉన్నవారి పట్ల ఉదాసీనత చూపిస్తూ, మరో పక్క ప్రతిపక్షాలు అవినీతిపరులని చేస్తున్న ఆరోపణలకు విలువ ఉంటుందా? బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో మంత్రులుగా ఉన్నవారు అవినీతికి పాల్పడినా, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ వారిపై అవినీతి ఆరోపణలు వచ్చినా మంత్రులపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులు జరగనే జరగవు. వారిపై ఈగ కూడా వాలదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బీజేపీ లో జాయిన్ అవగానే పవిత్రులుగా, అవినీతి ఆరోపణలు వచ్చిన వారు బీజేపీలో చేరకుంటే అవినీతి పరులుగా చూపిస్తున్నారు. ఇంతటి వ్యత్యాసం చూపుతున్నప్పుడు ప్రధాని మోదీ చెబుతున్న సుభాషితాలకు విలువ ఏమి ఉంటుంది? అధికారంలోకి రాగానే రాజకీయ నాయకులపై వున్నఅవినీతి కేసుల లెక్క తేలుస్తామని చెప్పి పదేళ్లైనా అవినీతిపరులపై ఈగైనా వాలిందా? అవినీతిపరుల అంతు చూసే బలం, చేవ, ధైర్యం, సమర్ధత ఉండి కూడా చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యం ఏమిటి? మీరు అధికారంలోకి వచ్చాక ఆర్ధిక నేరస్తులకే అచ్చే దిన్ వచ్చింది నిజం కాదా?

- నీరుకొండ ప్రసాద్

98496 25610

Tags:    

Similar News