విదేశీ చదువులు దూరపు కొండలేనా..!
why Foreign studies are a distant hill..!
జనాభా విస్ఫోటన జరుగుతున్న భారతంలో ఉన్నత విద్య అందని ద్రాక్ష అవుతున్నది. నాణ్యమైన విద్య కొన్ని విద్యా సంస్థలకే పరిమితమైంది. ఉద్యోగ సాధన గగనమై పోతున్నది. విశ్వవిద్యాలయ సర్టిఫికేట్లకు గౌరవం అడుగంటుతున్నది. నైపుణ్య విద్య అరుదైన సరుకైంది. ఏ దిక్కులేక డిగ్రీలు చదివిన భారతీయ యువత ఆకర్షణీయ వేతనాలు, ఆధునిక జీవనశైలి, జీవన ఆరోగ్య భద్రత, సానుకూల వాతావరణ పాలసీలు, సులభ ఉద్యోగ సాధన, పార్ట్‌టైమ్ ఉద్యోగాల సౌకర్యం లాంటి అనుకూల అంశాలతో విదేశాలకు ఎగిరి పోవాలని ప్రయాస పడుతున్నారు. ఏటేటా విదేశీ విద్య పేరున విమానాలు ఎక్కే యువత సంఖ్య పెరిగి పోతున్నది. విదేశీ విద్య కోసం లక్షల్లో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి యువత బ్యాంకు అప్పుల భారాన్ని మోస్తూ విమానయానం చేస్తున్నారు. మన యువతకు ఆదర్శంగా భారత సంతతికి చెందిన గూగుల్ సిఈఓ సుందర్ పిచ్ఛయ్, మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ళ, ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ రఘురామ్ రాజన్ లాంటి మరెందరో నిలుస్తూ నిత్య ప్రేరణను ఇస్తున్నారు.
వీసా ఉన్నా..చదువు కష్టం
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, లక్షల ఖర్చులు చేసి, తాము ఆశించిన యూనివర్సిటీలో కోరుకున్న కోర్సులో ప్రవేశాలు పొంది, వీసాలు పొంది విమానయానం చేసి అమెరికా ఎయిర్‌పోర్టులో కాలుమోపిన పిదప మన యువతీయువకులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు పలు అనుమానాలతో దాదాపు 500 మందిని వెనక్కి పంపించిన తాజా ఘటనలు మనల్ని కలిచివేస్తున్నాయి. ఈ సంఘటనలతో మన యువతీ యువకులు, వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళనలు చెందడం సహజం. వీసా అనేది ఏ క్షణంలోనైనా రద్దు చేయవచ్చని, విద్యార్థులు సమర్పించే ధ్రువపత్రాలు సరైనవి కావని తేలినా, కొద్ది అనుమానాలకు తావిచ్చినా ఎప్పుడేనా చర్య తీసుకోవచ్చని అమెరికన్ కన్సులేట్ అధికారులు తెలపడం విచిత్రంగా, ఇబ్బందికరంగా ఉన్నది.
ఆధునిక కోర్సుల కోసం విదేశీ వలసలు
2017 నుంచి గత ఏడాది వరకు 30.13 లక్షల భారత యువత విదేశాల్లో ఉన్నత విద్య కోసం వలసలు వెళ్లారని, 2020లో కరోనా విపత్తు కాలంలోనూ 2.6 లక్షల యువత, 2021లో 4.45 లక్షలు, 2022లో 68 శాతం అధికంగా 7.5 లక్షల యువతీయువకులు విదేశీ చదువులకు పయనమయ్యారని తెలుస్తున్నది. విదేశీ విద్య నిమిత్తం మన యువత అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల వైపు ఎక్కువగా చూస్తున్నారు. విదేశీ విద్య కోసం వెళ్లిన మన యువత 2024 నాటికి ట్యూషన్ ప్రవేశ రుసుం నెలసరి వ్యయం రూపంలో 75 బిలియన్ డాలర్లు (6 లక్షల కోట్ల రూపాయలు) వెచ్చించనున్నారని అంచనా వేశారు. ఆర్‌బీఐ వివరాల ప్రకారం ప్రతి ఏట అమెరికాలో చదువుతున్న మన యువతకు ఒక్కొక్కరికి సగటున అన్ని ఖర్చులు కలుపుకొని 30,000 డాలర్ల ఖర్చు అవుతున్నట్లు తేలింది. మన యువతకు విదేశీ చదువుల నిమిత్తం మన జాతీయ బ్యాంకులు కూడా సులభంగా అధిక మొత్తం రుణాలు మంజూరు చేయడంతో సామాన్య కుటుంబాల యువత కూడా సరిహద్దులు దాటడానికి ధైర్యంగా ప్రయత్నిస్తున్నారు. గత దశాబ్దంలో 4.61 లక్షల యువత జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని విదేశాలకు ఎగిరి పోవడం జరిగింది. మన దేశీయ ఉన్నత విద్యా సంస్థలు ఎస్‌టిఈఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) సబ్జెక్టుల్లో నాణ్యమైన విద్య అందించని కారణంగా ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఐటి లాంటి అత్యున్నత సంస్థల్లో కూడా కొన్ని కోర్సుల్లో సీట్లు (7,000 పిజీ సీట్లు, 3,000 పిహెచ్‌డి సీట్లు) ఖాళీగా ఉండి పోతున్నాయి. ఇండియాలో పిహెచ్‌డి పూర్తి చేయడానికి సగటున కనీసం 5 ఏండ్లు పడుతుండగా యూరోప్‌లో, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో 3-4 ఏండ్లు మాత్రమే తీసుకొంటున్నారు. విదేశాలకు వెళుతున్న 70 శాతం పైగా యువత ప్రత్యేకమైన, అధిక డిమాండ్ కలిగిన కోర్సుల్లో సులభంగా సీట్లు పొందుతున్నారు.
యూకేలో చేదు అనుభవాలు
విదేశీ విద్య వేటలో యూకేకు వెళ్లిన యువతకు విద్య అనంతరం ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంటున్నది. 2022 లో ఉన్నత విద్య నిమిత్తం 22 శాతం యువత యూకే బాట పట్టారని, యూకే స్థానిక యువత కన్న భారతీయ యువత వద్ద ఫీజులు అధికంగా వసూలు చేస్తూ, అక్కడి యూనివర్సిటీలు ఆర్థికంగా బలపడుతున్నాయని తెలుస్తున్నది. యూకేలో చదివిన యువతలో 17 శాతం వర్క్ వీసాలు, 5 శాతం ఉన్నత చదువుల నిమిత్తం యూకేలో కొనసాగగా, 76 శాతం భారత యువతకు వీసాల గడువు తీరిపోతూ దిక్కులేని దుస్థితుల్లో వెనుదిరగవలసి వస్తున్నది. యూకేలో నాణ్యత కొరవడిన, డిమాండ్ లేని కోర్సుల్లో చేరిన మన యువతకు భవిష్యత్తు నిరాశాజనకంగా ఉంటున్నది. యూకేలోని అత్యున్నతమైన 24 యూనివర్సిటీల్లో మాత్రమే 13 శాతం ప్రవాస భారత యువత ప్రవేశాలు పొంది మంచి భవితకు అర్హులు అవుతున్నారు.
పేద దేశాలనూ.. వదలని యువత
2022 వివరాల ప్రకారం 2019-22 మధ్య కాలంలో విదేశీ విద్య వేటలో భారతీయ యువత 228 దేశాలకు, స్వతంత్ర ద్వీపాల(డిపెండెంట్ ఐలాండ్స్)కు వలసలు వెళ్లడం జరిగింది. అభివృద్ధి చెందని పేద దేశాలైన అఫ్ఘానిస్థాన్, మొజాంబిక్, సోమాలియా, ఆఫ్రికా లాంటి దేశాల్లో ఉన్నత విద్య నిమిత్తం కూడా మన యువత వెళుతున్నారు. ఇలాంటి దేశాల్లో ఉన్నత విద్యకు పోటీ తక్కువగా ఉండడం, విద్య అనంతరం వ్యాపారాల్లో డబ్బు సంపాదించడం సులభంగా ఉన్నట్లు తెలుస్తున్నది. విదేశీ యూనివర్సిటీ ర్యాకింగ్, గుర్తింపు(ఎక్రెడిటేషన్), బోధనల పద్దతులు, జీవన వ్యయం, ఉద్యోగ సాధన లాంటి అంశాలను విశ్లేషించి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుంటున్నారు.
దూరపు కొండలు నున్నగా కనిపిస్తాయన్నది ఎప్పటికీ వాస్తవమే. విదేశీ చదువులన్నింటికీ ఆకర్షణీయ ఉద్యోగాలు దొరకవని, లండన్ అంటే విలాసవంతమైన జీవితమని కలలు కనడం మానేసి, విదేశీ యూనివర్సిటీల ర్యాంకులను, నాణ్యతలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆదరణ కలిగిన కోర్సుల్లో సీట్లు పొంది, ఏకాగ్రతతో ఉన్నత విద్యను పూర్తి చేసి, నైపుణ్యాలను స్వంతం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకొని రానున్న రోజుల్లో అభినవ సుందర్ పిచ్ఛై, సత్య నాదెళ్ళ లాంటి ఉత్తములు కావాలని సగటు భారతీయ పౌరులు కోరుకొంటున్నారు. మేధో వలస దేశానికి శాపమని, స్వదేశీ ప్రగతి కోసం కూడా సదాలోచనలు చేయాలని సగటు భారతీయుడు ప్రవాసీ భారతీయుల నుంచి ఆశిస్తూ ఉన్నాడు.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037