గత ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తి, గత అధికార పార్టీ నాయకుల పల్లకీలు మోసిన పాత రాజకీయ జేఏసీలో భాగమై ఉండిన కొన్ని ప్రజా సంఘాల నాయకులు గత ఆదివారం భేటీ అయ్యారు. అధికార పీఠాలకు దూరమైన వీరు ఇప్పుడు ఎవరి మేలు కోరి, ఎవరి మంచి కోరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అని జనం నవ్వుకుంటున్నారు.
గత ఆదివారం సాయంత్రం పాత రాజకీయ జేఏసీలో భాగమై ఉండిన ఆయా ప్రజా సంఘాల అప్పటి కొందరు నాయకమ్మన్యులు ఎందుకో ఏమో ఒకసారి కలిసినారు. తెలంగాణ సామాన్య ప్రజలకు వీరి కలయిక అర్ధం పరమార్ధం గురించి వీరే వివరించి చెప్తే బాగుంటుంది. ఒకానొక సందిగ్ధ సంధి కాలంలో వీరి కలయిక, కదలిక ఏ వైపు ప్రవహిస్తుందో, పయనిస్తుందో ఎవరి మేలుకోరి, ఎవరి మంచి కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారో కానీ, కలిసి దిగిన వారి ఫోటోలను చూసి ప్రజలు ఇచ్చంత్రంగా ఇకఇక పకపక నవ్వుకుంటున్నారు . వీరి మీద ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తారో, ఏ నాయకుని పల్లకి ఓహో ఓహో అంటూ మోసారో నిర్మొహమాటంగా ప్రజలకు ముందుగా తప్పు ఒప్పులను చెప్పి ఆ తర్వాత ప్రజల ముందుకు వస్తే కొద్దిగా సమంజసంగా బాగుండేది అని నేను అనుకుంటున్నాను.
ఏమి ఆశించి కలిసారు?
తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ భజన మండలి సభ్యులుగా మారినవారు తెలంగాణ ప్రజలకు ఈ సంగమం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో తక్షణం తెలియ చెప్పాల్సిన ఆవశ్యకత, తెలంగాణ అధికార పక్షాన్ని మోసి మోసి కాయలు కాసిన వీరి భుజస్కంధాల మీద ఉంది. ఈ అపస్వర స్వపర మేధావులు అనుకునే వారి భుజాల మించి గురి చూస్తున్నది ఎవరో, ఎవరిని కాల్చాలని వీరి వెనుక ఉండి ఎవరు వీళ్లను కుప్పగా కూడేసారో చెప్పాలి. అది మా ప్రైవేటు విషయం అనుకుంటే, ఎందుకు వీళ్లు తగుదునమ్మా అని సోషల్ మీడియాకు ప్రత్యక్షంగానూ ఏమి ఆశించి పరోక్షంగానూ ఎక్కిండ్రో చెప్పాలి.
కోదండరాం కూడా కొంతసేపు వచ్చే వెళ్లారు అంటేనే ఈ కలయిక పట్ల ఆయనకు ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. అప్పుడు రాజకీయ జేఏసీ నిర్వహించిన కొన్ని ఉద్యమాలను నిలువరించే ప్రయత్నం ఎవరు చేశారో అందరికీ తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో వారి ప్రాతినిధ్యం కోసం పంపారు అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు చెర్ల నీళ్లు చెరువు వెనుక పడ్డంక మళ్లీ ఏదో ఒక నెపం మీద కలిశారు.
మళ్లీ ఎందుకు కలుస్తున్నారని..
సంవత్సరాలుగా వీరు ఎవరి కొమ్ము కాసారో, ఎవరి పల్లకి మోసింఢ్రో తెలియనంత అమాయకులు ప్రజలనుకుంటే మరొక పెద్ద తప్పిదంలో అడుగు వేస్తున్నారని సుస్పష్టం. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్లు, టెంట్లు, తరలించిన మందికి భోజనాలు, ఆయా నాయకులకు హైదరాబాదులో వసతి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తన ప్రాముఖ్యత ఉద్యమంలో తగ్గుతుందని భావించిన అధినాయకునికి కోవర్టులుగా వ్యవహరించి రాజకీయ జేఏసీ రూపొందించిన ఉద్యమ కార్యక్రమాలను అడ్డుకున్నవారు, తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వంలో వివిధ పదవులను పొందిన వారు మళ్లీ ఎందుకు కలుస్తున్నారనీ, మళ్లీ ఏ ప్రజలను తప్పుదారి పట్టించబోతున్నారనే చర్చ తీవ్రంగా జరుగుతుంది. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, ఔట్‌సోర్సింగ్ సంఘాల సభ్యుల నాయకుల మనసులలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వెన్నెముక లేని అమీబాలాగా నేలపై జరజరా పాకుతూ ఒక బొంగురు పోయిన పీల స్వరంతో వృధా ప్రయాస చేస్తున్నారు. అంతకన్నా ముందు ఇన్నాళ్లు అధికారంలో ఉన్న నాయకులను ప్రశ్నించక పల్లెత్తు మాట్లాడక వారికి మద్దతు తెలిపినందుకు వీరంతా ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.
జూకంటి జగన్నాథం,
కవి, రచయిత
94410 78095