ఈఎల్స్ మంజూరులో వివక్ష ఎందుకు..?

వేసవి సెలవుల్లో టీచర్లు వారి కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు. కానీ ఈ వేసవి సెలవుల్లో

Update: 2024-05-30 01:00 GMT

వేసవి సెలవుల్లో టీచర్లు వారి కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు. కానీ ఈ వేసవి సెలవుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల నిమిత్తం టీచర్లను బడులకు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే నెలలో సగం రోజులు ఎన్నికల శిక్షణ, విధులకు హాజరవ్వమంది. ఇక ప్రతీ ఏటా జూన్ 1వ తేదీ నుండి బడిబాట పేరుతో టీచర్లు బడికి వెళుతున్నారు. ఇటువంటి తరుణంలో.. ప్రస్తుతం ఆర్జిత సెలవులు (ఈఎల్స్) టీచర్ల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఈఎల్స్ ఎటువంటి విధులకు హాజరైతే మంజూరు చేస్తారు, ఎన్ని మంజూరు చేస్తారు, ఎవరు మంజూరు చేస్తారనే విషయంపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

వెకేషన్ పీరియడ్‌లో వాడుకుని..

ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల మాదిరిగా తమను కూడా నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్‌గా పరిగణించాలని తదనుగుణంగా ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఏళ్లుగా ప్రాతినిధ్యం చేసినా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తున్నది. వేసవి సెలవుల్లో మేం పని చేయడానికి సిద్ధమని ఉపాధ్యాయ లోకం సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వం వారిని నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్‌గా ప్రకటించకపోవడం విడ్డూరం. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల విధులకు హాజరైనందుకు ఈఎల్స్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. అమ్మ ఆదర్శ పాఠశాల విధులకు హాజరైన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరు చేయడం లేదు. టీచర్లకి ఈఎల్స్ మంజూరు చేయకుండా.. వారికున్న వెకేషన్ పీరియడ్‌లో వారిని సర్వీసు వాడుకోవడం సమంజసం, సమర్ధనీయం కాదు. వీరికి నిబంధనలను అనుసరించి ఆర్జిత సెలవులు మంజూరు చేసి టీచర్ల హక్కులను కాపాడాలి. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల నుండి క్షేత్రస్థాయి అధికారుల వరకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్తించాలి. 15 రోజులకు మించి ప్రభుత్వం బడులకు సెలవులు ప్రకటిస్తే ఆ కాలాన్ని వెకేషన్‌గా పరిగణించాలని తెలంగాణ సెలవు నిబంధనల్లోని ఫండమెంటల్ రూల్ 82 స్పష్టంగా సూచిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు బడులకు వేసవి సెలవులు అంటే మొత్తం 49 రోజులు.. కానీ ఈఎల్స్ మంజూరు చేయడం లేదు. మేమేం పాపం చేశాం.. మాకెందుకు సెలవులు మంజూరు చేయరని సదరు టీచర్లు వాపోతున్నప్పటికీ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు.

ప్రత్యేక రెమ్యునరేషన్ పొందితేనే..

పదో తరగతి సప్లమెంటరీకి సంబంధించిన విధులు నిర్వర్తించటానికి ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులకు, జూనియర్ రికార్డు అసిస్టెంట్‌కు, ఒకవేళ సీనియర్ అసిస్టెంట్ రికార్డు అసిస్టెంట్‌లు లేకపోతే పాఠశాలలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడికి ఇలా మొత్తంగా ముగ్గురికి మించకుండా ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని పాఠశాల విద్యాశాఖ 2020లో విడుదల చేసిన ఉత్తర్వుల సంఖ్య 03 ద్వారా స్పష్టం చేసింది. అలాగే ఫండమెంటల్ రూల్ 82 ప్రకారం వెకేషన్ కాలంలో విధులు నిర్వహించాలని అధికారులు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లయితే తప్పకుండా ఆర్జిత సెలవులు మంజూరు చేయాలి. కానీ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులను బడులకు హాజరు కమ్మని ఆదేశాలు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు అట్టి ఉత్తర్వుల్లో ఈఎల్స్ అంశం ప్రస్తావించకపోవడం కొసమెరుపు. విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీచేసిన అధికారులే ఈఎల్స్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసే అధికారం కలిగి ఉంటారు.

ఫండమెంటల్ రూల్ 82 లోని సబ్ రూల్ 6 ప్రకారం 15 రోజుల కన్నా తక్కువగా వేసవి సెలవులు వాడుకునే విధంగా అధికారులు ఉత్తర్వులు జారీ చేసే ఆర్జిత సెలవులను దామాషా పద్ధతిలో కాకుండా మొత్తం 30 రోజులు (24+6) ఈఎల్స్ మంజూరు చేయాలని సూచిస్తున్నది. అలాగే ఎన్నికల విధులు, ఓపెన్ స్కూల్ పరీక్షల విధులకు హాజరైన ఉపాధ్యాయులకు కూడా ఆర్జిత సెలవులు జీవో.114 ద్వారా దామాషా పద్ధతిలో మంజూరు చేయాలని ఉత్తర్వులు తెలుపుతున్నాయి. కేవలం సబ్ రూల్ 15ను అనుసరించి హాజరైన విధులకు ప్రత్యేకంగా రెమ్యునరేషన్ పొందితే తప్ప ఈఎల్స్ మంజూరు చేయరన్న విషయాన్ని అధికారులు, ఉపాధ్యాయులు గుర్తించాలి.

అందరికీ ఆర్జిత సెలవులు

2016 లో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు నేటికీ ఆర్జిత సెలవులు మంజూరు చేయకపోవడం శోచనీయం. వెకేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏటా మంజూరు చేసే 6 ఈఎల్స్‌కు అదనంగా ఇటువంటి విధులకు సెలవులు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించి నిబంధనలకు అనుగుణంగా ఆర్జిత సెలవులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తారని ఆశిస్తున్నాం.

- సుధాకర్. ఏవీ

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి STUTS

90006 74747

Tags:    

Similar News