స్పాట్ విధులకు విముఖత ఎందుకు?

Why are government teachers averse to spot evaluation?

Update: 2024-04-07 01:00 GMT

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3 నుండి జిల్లాల్లో పదవ తరగతి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారులు ముందుగానే తమ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు మూల్యాంకన విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులను మినహాయిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు డెబ్బై శాతానికి పైగా విధులకు హాజరు కాలేదు. రాష్ట్రంలోని అన్ని మూల్యాంకన కేంద్రాలలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది ప్రతి ఏటా ఇదే తంతు పునరావృతమవుతూ వస్తున్నది. విశ్లేషిస్తే దీనికి కారణాలు బోలెడు కనబడుతున్నాయి.

మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు పూర్తిరోజు జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది. అలాగే ఈ విధులకు హాజరయ్యే నేపథ్యంలో అదివారాలతో సహా ఎటువంటి సెలవులు ఉండవు. జవాబు పత్రాలు పూర్తయ్యేవరకు నిర్విరామంగా విధులకు హాజరవ్వాలి. వేసవిలో తీవ్రమైన ఎండలు, స్పాట్ కేంద్రాలలో కల్పించే అరకొర సౌకర్యాల దృష్ట్యా మూల్యాంకన ప్రక్రియకు హాజరు కావడానికి ఉపాధ్యాయులు జంకుతున్నారు. ఇక పారితోషికం విషయానికొస్తే గత ఐదేళ్లుగా అదే మొత్తాన్ని చెల్లించడం కూడా గైర్హాజరుకు ఒక కారణం. ఒక జవాబు పత్రాన్ని దిద్దితే కేవలం పది రూపాయలు ఇవ్వడం అది కూడా వెంటనే చెల్లించకుండా నెలల తరబడి సమయం తీసుకోవడం కూడా ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయి. గత సంవత్సరం స్పాట్ విధులకు హాజరైన ఉపాధ్యాయులకు నేటికీ టీఏ, డీఏలు జమ కాకపోవడం కొసమెరుపు.

ఈ సౌలభ్యాలు ఉండటం వల్ల..

ఇంటర్ బోర్డు మూల్యాంకనం విధులకు హాజరైన లెక్చరర్‌లకు ఒక జవాబు పత్రాన్ని దిద్దినందుకు గానూ ఇరవై నాలుగు రూపాయలు చెల్లించడం, యాభై కిలోమీటర్ల పైబడి దూరం నుండి మూల్యాంకన కేంద్రానికి హాజరైతే అవుట్ స్టేషన్ అలవెన్స్ తదితర సౌలభ్యాలు కల్పించడం ద్వారా వారు ఈ గైర్హాజర్ పరిస్థితిని అధికమించగలుగుతున్నారు. ఇక స్పెషల్ అసిస్టెంట్‌లుగా నియమింపబడే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అవేదన అంతా ఇంతా కాదు. రోజంతా పనిచేస్తే కేవలం రెండు వందల యాభై చెల్లించడం వారిని కించపరచడమే. పట్టణ ప్రాంతాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టిఏ,డిఏలు కూడా చెల్లించకుండా కన్సేయన్స్ అలవెన్స్‌తో సరిపెట్టడం విచారకరం. గత సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ మూల్యాంకన విధులకు హాజరైన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు, నగదు జరిమానాలు విధించడంతో టీచర్లను స్పాట్ విధులకు హాజరు కావడానికి విముఖత చూపిస్తున్నారు.

మూల్యాంకన రేట్లు సవరించాలి..

స్పాట్ ఆర్డర్స్ పొందిన ఉపాధ్యాయులు క్యాన్సలేషన్ కోసం స్పాట్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంతమంది టీచర్లు ఈ విధులకు దూరంగా ఉండటానికి ఉపాధ్యాయ సంఘ నేతలను ఆశ్రయిస్తున్నారు. ఉపాధ్యాయులందరూ విధులకు గైర్హాజరు అయితే మూల్యాంకనం ఎలా కొనసాగుతుందని జిల్లా విద్యాశాఖధికారులు వాపోతున్నారు. ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో సహేతుక కారణాలు ఉన్నప్పటికీ విద్యాశాఖాధికారులు మినహాయింపు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నోటీసులు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. మరికొన్ని జిల్లాల్లో గైర్హాజరు అయిన ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు కూడా జారీచేయడం గమనార్హం.

ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రభుత్వం ముందుగా మూల్యాంకన రేట్లను సవరిస్తూ ఉత్తర్వులను జారీచేయాలి. ఇంటర్ బోర్డుతో సమానంగా పారితోషకం చెల్లించాలి. సుదూర ప్రాంతాల నుంచి స్పాట్ విధులకు హాజరయ్యే స్పెషల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు కూడా టిఏ,డిఏ లు చెల్లించాలి. ప్రభుత్వ సెలవు దినాల్లో స్పాట్ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించాలి. సాధ్యం కాని పక్షంలో స్పాట్ విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ప్రత్యేక పరిహార సెలవులను మంజూరు చేయాలి. ఆ దిశగా చర్యలు చేపడితే వచ్చే ఏడాది మూల్యాంకన సమయానికైనా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

- సుధాకర్. ఏ.వి

అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Tags:    

Similar News