రాష్ట్రంలో కరువు భత్యంకు.... కరువు
why Andhra Pradesh govt not releasing DA for employees, pensioners
ప్రభుత్వాల ముందుచూపు లేమి వల్ల, ఆర్థిక వ్యవహార నిర్వహణలో బలాదూర్ విధానాల వల్ల సకాలంలో జీతభత్యాల చెల్లింపు ఒక సమస్యగా మారింది. ఇదే ఉద్యోగవర్గాలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాప్రయోజనాల దృష్ట్యా అయితే ఉద్యోగులు కొంత సంయమనం పాటించడంలో ఇబ్బంది లేదు. కానీ ఉద్దేశ్య పూర్వకంగా పదేపదే వారిని అణిచివేస్తుంటే అది వారి మూలాలను చిదిమేస్తూ మనుగడకు సవాలు విసురుతోంది. ఆయా కుటుంబాలకు చేదు అనుభవాలను మిగులుస్తోంది. వారి జీవితాలను దుర్భరంగా మారుస్తుంటే, ఏలినవారు కనికరం లేకుండా వ్యవహరిస్తుంటే వారిలో అసహనం కట్టలు తెంచుకుంటుంది. బలీయమైన రాజ్యవ్యస్థలో ఉద్యోగులు సంఖ్యాపరంగా స్వల్పమే అయినా వారి జీవితాలను మానవజీవితాలుగా చూడలేకపోవడం దురదృష్టకరం. చట్టాల చట్రంలో వారిని మూగజీవులుగా మార్చేసి కాలం నెట్టుకుంటూ పోవడం పాలకులకు రివాజు అయింది. తారాజువ్వల్లా దూసుకుపోతున్న నిత్యావసర సరుకుల ధరలు సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులను కన్నీటి పర్యంతం చేస్తున్నాయి.
కరువు భత్యం ఎప్పుడివ్వాలి?
అనేక వేదికలపై ఏకరువు పెట్టాక, ఆందోళనలు ప్రారంభమయ్యాక కరువు భత్యం విడుదలపై జారీ అయిన గెజిట్ నోటిఫికేషన్ (జీవో 66, 67) విడుదలైన సంగతి తెలిసిందే! అందరితో పాటు నేనూ బాకా ఊదాను. పోటీ ప్రపంచంలో ఇతర సంఘాలతో పాటు ఫెడరేషన్ (ఏపిటిఎఫ్) కు మీడియా గ్లేర్ అవసరత దృష్ట్యా పోస్టింగ్ పెట్టాను తప్ప అందులో కొత్తదనం, ఎగిరిగంతేసే ఆసక్తికరమైన సమాచారం ఏమీ లేదు. కనీసం ఐదేళ్ళ నుండి డి.ఏ ఊసు లేకుండానే జీతాలు అందుకున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇదొక ఊరట. అసలు కరువు భత్యం ఎప్పుడివ్వాలి పాలకుల ఉదాసీనత, ఉద్యోగుల పట్ల అనుచిత వైఖరితో కరువు భత్యం స్వరూపమే మారిపోయింది. జాతీయస్థాయిలో ధరల పెరుగుదల నేపథ్యంలో ఆరు నెలల కాలానికి సరాసరి ప్రామాణికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు డి.ఏ మంజూరుచేయడం రాజ్యాంగ బద్ధ విధానం.
డీఏ అంటే అర్థాన్నే మార్చేశారు
18 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కాలానుగుణ హెచ్చింపు DA కీలకమైనది. DA పెరుగుదల ప్రభుత్వరంగ ఉద్యోగి నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు దారి తీస్తుంది. వస్తువుల ధరలను మార్చే డైనమిక్ శక్తులను ప్రభుత్వం నియంత్రించనందున, ద్రవ్యోల్బణం నుండి ముందు జాగ్రత్తగా ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ చెల్లించడం జరుగుతుంది. అయితే కాలానుగుణంగా పాలకుల విధానాల్లో చోటుచేసుకున్న మార్పులు వారికి ఇష్టమొచ్చినట్లు, ఇష్టమున్నపుడు ఇచ్చే భత్యంగా అర్థం మారింది. ఉద్యోగుల నిస్సహాయత, అసంఘటిత ఐక్యతా పాలకులకు కొత్త బలాన్నిచ్చాయి. 2018 నుండి రావాల్సిన అనేక కిస్తీల డిఎలు భూస్థాపితమయ్యాయి. 2019 నుండి రావాల్సిన డి.ఏ చెల్లింపు జరక్కుండానే కాగితాల మీద లెక్కలతో ఆదాయపన్ను కూడా నిర్బంధంగా కట్టేశారు. 2020 సంవత్సరపు 2 కిస్తీలు ఆత్మహత్యకు గురయ్యాయి. 2022 జూలై, 2023 జనవరి డీఏ ల సంగతేంటి? ఉద్యోగులు తమ మొత్తం సేవాకాలంలో అర్ధికంగా గరిష్టస్థాయిలో నష్టపోయిన కాలం 2017-2023 గత ప్రభుత్వం రెండు డీఏలు బకాయిపెట్టి దిగిపోగా ఈ ప్రభుత్వం ఓకే ఒక డీఏ ఇచ్చినట్లు ఇచ్చి ఏమార్చింది. ఈ పరంపరలో ఇపుడు జారీ అయిన డీఏ ఉత్తర్వుల అమలుపై కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక వర్గాల్లో సవాలక్ష సందేహాలున్నాయి. కారణం ఉత్తర్వులు జారీ అయిన తర్వాత అమలుకు నోచుకోకపోతే వాటిని జారీచేసిన ప్రభుత్వంపై విశ్వసనీయత సన్నగిల్లిపోతుంది.
తాజాగా వచ్చిన డి.ఏ జీ ఓ సారాంశం ప్రకారం 2022 నుండి 18 నెలల కాలానికి రావలసిన అరియర్స్ మొత్తాన్ని 2023 సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో చెల్లించబోతారు. నగదుగా మాత్రం జూలై నెల జీతంతో కలిపి ఆగస్టులో చెల్లించే ఏర్పాటు చేశారు. ఉద్యోగులపై ఎంత అవ్యాజ్య ప్రేమ!
డీఏల చిట్టా ఇదిగో!
07/2018 జీతంలో కలిసింది. 30 నెలల ఎరియర్స్ గ్రీన్ ఛానెల్ లో రెండేళ్ల నుండి వెయిట్ చేస్తున్నాయి. 01/2019 జీతంలో కలిసింది. 30 నెలల ఏరియర్ గ్రీన్ ఛానెల్ లో రెండేళ్ల నుండి వెయిట్ చేస్తున్నాయి. 07/2019 PRCలో కలసి జీతంలో కలసి పోయింది. 30 నెలల ఎరియర్స్ PRC ఎరియార్స్ లో కలసి రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. 01/2020 PRCలో కలిసి జీతంలో కలసి పోయింది. 18 నెలల ఏరియర్స్ కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. ఆరు నెలల ఎరియర్స్ PRC ఎరియర్స్‌తో కలసి రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. 07/2020 PRCలో కలిసి జీతంలో కలసిపోయింది. 12 నెలల ఏరియర్స్ కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. ఆరు నెలల ఎరియర్స్ PRC ఎరియర్స్‌తో కలసి రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. 01/2021 PRCలో కలిసి జీతంలో కలసి పోయింది. 6 నెలల ఏరియర్స్ కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. ఆరు నెలల ఎరియర్స్ PRC ఎరియర్స్‌తో కలసి రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. 07/2021 PRCలో కలిసి జీతంలో కలసి పోయింది. ఆరు నెలల ఎరియర్స్ పీఆర్సీ ఎరియర్స్‌తో కలసి రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. 01/2022 డీఏ ఇప్పుడు విడుదల చేశారు. 07/2022 డీఏ విడుదల కావాల్సి ఉంది. 01/2023 డీఏ విడుదల కావాల్సి ఉంది.
60 నెలల డీఏ ఎరియర్స్ గ్రీన్ ఛానెల్‌లో రెండేళ్ల నుండి ఎదురు చూస్తున్నాయి. 54 నెలల ఎరియర్స్ PRCలో కలసి రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. 36 నెలల ఎరియర్స్ కోవిడ్ -19 ఖాతాలో చేరిపోయాయి. మరో 36 నెలల ఎరియర్‌లలో 18 నెలలవి ఇప్పుడు DA జీఓ ద్వారా గ్రీన్ ఛానెల్‌లో చేరతాయి. ఇంకో 18 నెలలవి ప్రభుత్వం జీఓ విడుదల చేయాల్సి ఉంది.
-మోహన్ దాస్
ఏపీటీఎఫ్ 1938.