సాగునీటి సమస్య తీరేదెన్నడు?
Who will solve the irrigation water problem of Palamur?
తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసింది. ఇప్పటి వరకూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జల వనరుల కల్పనకు జరిగిన పనులను సమగ్ర ప్రణాళికతో చేపట్టలేదు.
గ్రావిటీ తో నీరు అందే పథకాలు ఆర్డీఎస్, జూరాల మాత్రమే. గత ప్రభుత్వాలు ఆర్డీఎస్ ఆనకట్ట ను పట్టించుకోలేదు. జూరాల ప్రాజెక్టును సమర్థ వంతముగా నిర్వహించలేదు. లిఫ్ట్ పథకాలన్ని అరకొర స్థాయిలో మాత్రమే ఉన్నాయి. రైతుల ఆందోళన నివారణకు గానూ ఒక పథకం కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసే పరిస్థితికి భిన్నంగా సరైన ప్రణాళిక సిద్ధం చేసి పనులు చేపట్టాలి. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజక వర్గంలో సాగునీటి సమస్య పరిష్కారం విషయంలో గత ప్రభుత్వం చేసిన తీవ్రమైన తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దు.
సమగ్ర అధ్యయనం చేయాలి..
మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అన్ని శాసనసభా నియోజకవర్గాల్లో సాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే ఇప్పటి వరకూ ప్రతిపాదనలో ఉన్న 2013లో విడుదల అయిన 72 జీఓను, 2014 మే నెలలో విడుదల అయిన 69 జీవోను, ఆ తరువాత ఇంజనీర్లు ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ పథకాన్ని, పాలమూరు అధ్యయన వేదిక సూచనలతో చర్చలో ఉన్న భీమా, కృష్ణానది సంగమం నుండి నీరు తీసుకునే పథకాన్ని పరిశీలించి నిపుణులయిన, అనుభవం ఉన్న ఇంజనీర్లతో ఒక నివేదిక తీసుకోవాలి. ఈ పని తక్కువ వ్యవధిలో పూర్తి చేయవచ్చు.
ఇప్పటికే షాద్ నగర్ నియోజకవర్గం గత ప్రభుత్వ హయాంలో పచ్చి మోసాలకు గురి అయింది. శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఈ మోసాన్ని తీవ్రంగా ఖండించారు. ఇపుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ గురించి పట్టించుకుని పని పూర్తి చేస్తారు అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కనుక రిజర్వాయర్‌పై సమగ్ర అధ్యయనంతో పనులు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
అన్ని నియోజకవర్గాల్లో జలధారలు పారేలా..
రాబోయే పార్లమెంటు ఎన్నికల కోణంలో కాకుండా 75 సంవత్సరాల కాలంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా నిర్ణయం చేయడం అవసరం. గడిచిన 72 సంవత్సరాల తరువాత మహబూబ్‌నగర్ నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా సరైన విధంగా పనులు చేపట్టకపోతే అది ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్న, కొనసాగుతున్న అన్యాయంగానే మిగులుతుంది అని ప్రభుత్వాన్ని ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేస్తున్నాం. ప్రభుత్వాల తప్పు విధానాలకు ప్రజలు బలి కావటం అభిలషణీయం కాదు. నీటి విషయంలో ఆదిలోనే ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు అనే చెడ్డ పేరు రావడం మంచిది కాదు. దశాబ్దాలుగా కరువు కోరల్లో చిక్కుకునిపోయిన మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని శాసన సభా నియోజక వర్గాల్లో జలధారలు ప్రవహించే దృశ్యం కోసం ప్రజలు కలగంటున్నారు. ప్రభుత్వం గట్టిగా అనుకుని సంకల్పిస్తే ఇది నెరవేరేందుకు పెద్దగా సమయం పట్టదు.
- ఎం. రాఘవాచారి
కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక
94907 03857