ఈ పొత్తు ఎవరికి బలం..
Who will benefit from BJP, TDP and Jana Sena alliance?
ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంగా బీజేపీ పాత మిత్రులను మళ్లీ కలుపుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలను ఎన్డీఏలోకి చేర్చుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనలతో బీజేపీ, పొత్తు కుదుర్చుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం ఖాయమైంది. ఇప్పటికే జనసేన ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీయేలో చేరాలని నిర్ణయించింది. మరోవైపు ఏపీ కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లనున్నాయి.
ఈ క్రమంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది... ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతుంది అనే దానిపై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉండటం మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులో భాగంగా కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో ఆ కూటమి సైతం బలంగా ఉంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకోబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న తరుణంలో ఈ సీట్లపై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి.
దీని కోసమే బీజేపీ పొత్తు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది అందుకే తమకు అసెంబ్లీ సీట్లు పెద్ద ప్రాధాన్యం కాదని ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని అమిత్‌షా, నడ్డా ప్రతిపాదించారు. 175 అసెంబ్లీ సీట్లున్న ఏపీలో జనసేన, బీజేపీ కలిసి 30 స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. 25 పార్లమెంట్ సీట్లలో 8 సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే… మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. జనసేనకు ఇప్పటికే మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు. 5 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ పడనుంది. అదే సమయంలో 24 ఎమ్మెల్యే సీట్లలో జనసేన పోటీ చేయనుంది. 6 సీట్లు బీజేపీకి కేటాయించనున్నట్టు తెలిసింది. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ, జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఈ పొత్తు ఖరారైంది. మార్చి 14 న జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి చంద్రబాబు హాజరౌతారు. అ సమావేశం తర్వాత పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలపై, మేనిఫెస్టో పై స్పష్టత వచ్చే అవకాశం వున్నది.
సిద్ధంపై యుద్ధమే!
త్రిముఖ పోటీలో కాంగ్రెస్, వామపక్షాల కూటమి ప్రభావం నామ మాత్రమే సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే విధంగా సిద్ధం సభలు నిర్వహిస్తున్న వైసీపీ చివరిదైన నాలుగో సిద్ధం సభను బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్‌లో నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. నాలుగో సిద్ధం సభ తేదీని మార్చింది వైసీపీ. అద్దంకి సిద్ధం సభ ఈ నెల 10న జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా వేశారు. దీంతో ఈ నెల 19న నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ జనసేన, బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో మరింత పదునైన వ్యూహరచనతో వైసీపీ ఈ సభకు సన్నద్దం కావాలని నిర్ణయించుకుంది. వైసీపీ గత మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేసింది. సులభంగా చేరేలా ఉండే వైసీపీ మేనిఫెస్టో కూడా గత ఎన్నికల్లో విజయానికి ఒక కారణం ఇదే తరహాలో ఈసారి కూడా వైసీపీ మేనిఫెస్టో ఉండనుందని సమాచారం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మార్గాలకు ఈసారి మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ఊతం అందించే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత సంక్షేమ పథకాలు కొనసాగింపుతో పాటు కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉంది ఈ దిశగా చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి రాకపోవడం కూడా సభ వాయిదాకి కారణం.
ఎన్నికల మేనిఫెస్టో కీలకం
త్రిముఖ పోటీలో కాంగ్రెస్, వామపక్షాల కూటమి ప్రభావం నామమాత్రమే. టీడీపీ జనసేన, బీజేపీ కూటమి నేపథ్యంలో ప్రకటించబోయే మేనిఫెస్టో ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించనున్నది. రాజధానిపై స్పష్టత, పోలవరానికి నిధులు, ప్రత్యేక రైల్వే జోన్, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై వైఖరిని ప్రకటించాలి. ఈ పొత్తు రాజకీయ, వ్యక్తిగత స్వార్థం కోసం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్న నమ్మకాన్ని కలిగించాలి. అసమ్మతిని చలార్చి, సీట్ల పీటముడిని విడిపించి మూడు పార్టీలు సంయమనం పాటించి సమన్వయంతో పనిచేయాలి. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలానికీ, ప్రభుత్వ అనుకూల ఓటు బలానికీ జరిగే బలపరీక్ష. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రెండు వైపుల పదునైన కత్తి లాంటింది. అది ఎవరికి బలం, ఎవరికి బలహీనతో తేల్చేది ఓటరే.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445