పట్టభద్రుల గొంతుక అయ్యేదెవరు..?
Who will be the Going to win in MLC graduate Elections?
చట్టసభలలో కొన్ని వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తమ గళాన్ని తామే వినిపించే అవకాశాన్ని భారత రాజ్యాంగం శాసన వ్యవస్థ ద్వారా కల్పించింది. ఇందులో ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రతినిధులు, శాసనసభ్యులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు తమ ప్రతినిధులను పెద్దల సభకు పంపించేందుకు ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ ద్వారా కూడా వివిధ రంగాల్లో కృషిచేసిన నిష్ణాతులైన వారిని శాసన మండలికి నామినేట్ చేయడం జరుగుతుంది. వీరంతా తమ వర్గాల సమస్యలను నేరుగా చట్టసభల్లో ప్రస్తావించడం తో పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు పలు సహేతుకమైన సూచనలు చేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ గెలిచేవారికి 2027 వరకు అంటే ఇంకా మూడు సంవత్సరాల పదవి కాలం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో మే 27న జరిగే పట్టభద్రుల ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బలమైన నాయకులను బరిలో నిలిపాయి. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేయడంతో.. చివరగా ఈ పోరులో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
బరిలో 52 మంది అభ్యర్థులు..
ఈ నేపథ్యంలో నియోజకవర్గ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఈ ఉమ్మడి జిల్లాలలో మొత్తం 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉంటుంది. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఆయా నియోజకవర్గంలోని పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తారు. అనగా పోలైన మొత్తం ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత వచ్చిన అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ రాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న బరిలో ఉండగా, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలతో పాటు బక్క జడ్సన్, అశోక్ లాంటి బలమైన స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
వీరి ప్రభావం ఎక్కువ!
ఈ ఎన్నికల కోసం గతం కంటే తక్కువగా కేవలం 4,61,806 మంది మాత్రమే తమ ఓట్లను నమోదు చేసుకోగా.. ఇందులో పురుషులు 2,87,007, స్త్రీలు 1,74,794 ఉన్నారు. వీరిలో సగానికి పైగా నిరుద్యోగులే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు ఆ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులు ఈ ఎన్నికపై ప్రభావం చూపబోతున్నారని స్పష్టమవుతున్నది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారం ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా జీఓ 46, జీఓ 317 బాధితుల సమస్యలు పరిష్కరించే వారికి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తామని బాధిత ఉద్యోగ, నిరుద్యోగులు అంటున్నారు. సుమారు లక్ష ఓట్లపై వీరి ప్రభావం ఉంటుంది.
ప్రచారంలో అభ్యర్థులు..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టినప్పటికీ, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా, ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. జిల్లాల వారీగా టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ గ్రాడ్యుయేట్ల ఓపీనియన్స్ తెలుసుకుంటున్నారు. వారితో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈయనకి గత ఎన్నికల్లో పోటీ చేసిన టిజెఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కమ్యూనిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన యూత్ డిక్లరేషన్ హామీలు సైతం తనకు అనుకూలంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయనకు కొంత పట్టు ఉండగా ఎక్కువ ఓటర్లున్న ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి సైతం తనదైన శైలిలో ప్రచారం మొదలు పెట్టారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నైనా గెలిచి ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్, బీజేపీలు భావిస్తున్నాయి. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో కొంత జోష్ కనిపిస్తుండగా పట్టభద్రులు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలుసుకునేందుకు జూన్ 5 వరకు వేచి చూడాల్సిందే .
బైరి వెంకటేశం
జాతీయ అధ్యక్షులు,
ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి
94919 94090