హిందూ టీచర్లకు నిలువనీడేది..?
ప్రపంచంలో ఎక్కడైనా గురువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. భారతదేశంలో కూడా ఇదే స్థితి ఉంది. కానీ మతోన్మాదంతో చెలరేగిపోతున్న బాంగ్లాదేశ్‌లో
ప్రపంచంలో ఎక్కడైనా గురువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. భారతదేశంలో కూడా ఇదే స్థితి ఉంది. కానీ మతోన్మాదంతో చెలరేగిపోతున్న బాంగ్లాదేశ్‌లో హిందూ ఉపాధ్యాయులు అనేక అవమానాలు, ఛీత్కారాలు, దూషణలు ఎదుర్కోవలసిన దుస్థితి దాపురించింది. జిహాద్ ఉగ్రవాద భావజాలాన్ని తలకెక్కించుకున్న ముస్లిం విద్యార్థులు కాఫిర్లు అయిన హిందూ ఉపాధ్యాయులు ముస్లిం సమాజంలో విద్యను బోధించడానికి అనర్హులని, వెంటనే పదవులకు రాజీనామా చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హుకుం జారీ చేసి, అనేకమంది ఉపాధ్యాయుల చేత బలవంతంగా రాజీనామా ఇప్పిం చారు. కొంతమందిపై భౌతిక దాడులకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు దాదాపు 70 మంది చేత బలవంతంగా రాజీనామా చేయించారు. అయితే ఈ అంశంపై బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఈ విషయంపై నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
తమ దేశాన్ని తామే తగలబెట్టుకుంటూ..
ఇక బంగ్లాదేశ్‌లో సామాన్య హిందువులు, హిందూ ఉద్యోగులు, హిందూ వ్యాపారులు ఆ దేశంలోని ముస్లింల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. రిజర్వేషన్ల సాకుతో షేక్ హసీనా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి, బలవంతంగా రాజీనామా ఇప్పించి, దేశం నుండి పారిపోయేటట్లు చేసిన బంగ్లాదేశ్ ముస్లిం సమాజం భవిష్యత్తులో అనేక విపత్కర పరిణామాలను చవిచూడక తప్పదు! మత ఉన్మాదంతో తమ దేశాన్ని తామే తగలబెట్టుకుంటున్నారు. 1971లో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌లోని ముస్లింలను ఊచకోత కోసింది. మన దేశ సైనిక సహకారంతో పాకిస్తాన్ కబంధహస్తాల నుండి బంగ్లాదేశీయులు విముక్తిని పొందారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా, హిందువులపై అమానుష దాడులకు ఒడిగట్టడం క్షమార్హం కాదు.
హిందువుల బలహీనత అదే!
వాస్తవంగా పాకిస్తాన్‌లో దేశ విభజన నాడు 9% హిందువులు ఉండేవారు. నేడు అక్కడ హిందువులు 1.6 శాతం మాత్రమే. ఇక బంగ్లాదేశ్ 1947లో 29 శాతం హిందువులు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 9.1 శాతం మాత్రమే. దేశం మతం ఆధారంగా విభజింపబడడానికి, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో హిందువులు ఊచకోతలకు గురి కావడానికి ప్రధాన కారణం హిందువులే అని చెప్పాలి. సుసంఘటిత ముస్లిం సమాజం ముందు కులకంపుతో కునారిల్లే అసంఘటిత హిందూ సమాజం సరైన స్థితిలో నిలబడకపోవడం! ఇక లౌకిక వాద ముసుగు వేసుకొని రాజకీయాలు నడిపే హిందూ రాజకీయ నాయకులకు మతం ఆధారంగా దేశ విభజన అధికార ఫలాలు అందుకోవడానికి ఈ పరిస్థితి ఒక సోపానమైంది. ముస్లిం సమాజ మానసిక స్థితిని అంచనా వేయకుండా పాక్, బంగ్లాదేశ్‌లలో సామాన్య హిందువులను మనుగడ, రక్షణ గురించి ఆలోచించకుండా, అక్కడ వదిలి వేసి, తమ పలుకుబడిని ఉపయోగించుకుని, సైన్య సహకారంతో భారతదేశానికి వచ్చి స్థిరపడిపోయారు కుహనా లౌకికవాద హిందూ రాజకీయ నాయకులు. వీరిని హిందువులు తమ నాయకులుగా ఊహించుకోవడమే హిందువులు చేసిన పెద్ద తప్పు!
మన నాయకుల స్పందన ఏది?
బంగ్లాదేశ్‌లో హిందువులపై అమానుష దాడులు జరుగుతున్నా-లౌకిక వాద హిందూ రాజకీయ నాయకుల్లో కనీస స్పందన లేకపోవడానికి కారణాలను హిందువులే వెతుక్కోవాలి. లౌకికవాదం, సమాన హక్కులు, ప్రజాస్వామ్యం అంటూ సొల్లు కబుర్లు చెప్పే స్వయం ప్రకటిత మేధావుల గొంతులు ఎందుకు మూగబోయాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఇక చివరగా బంగ్లాదేశ్లో హిందూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దుస్థితిపై భారతదేశంలో ఉపాధ్యాయులు స్పందించకపోవడానికి కారణాలు తెలిసి రావడం లేదు. ఈ విషయంపై స్పందిస్తే-ఆర్థిక ప్రయోజనాలు ఒనగూరే అవకాశం లేదనేమో!
ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు,
94417 37877