సిరియాను ఆట బొమ్మను చేసిందెవరు?
అరబ్ స్ప్రింగ్ పేరుతో 2011లో సిరియాలో ప్రారంభమైన సివిల్ వార్ అనేక మలుపులు తిరిగి, దేశ అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోవడంతో
అరబ్ స్ప్రింగ్ పేరుతో 2011లో సిరియాలో ప్రారంభమైన సివిల్ వార్ అనేక మలుపులు తిరిగి, దేశ అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోవడంతో దేశ పాలన ఇస్లామిక్ గ్రూపుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆ దేశ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు ఉంది.
సిరియా దేశం ఒట్టోవాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ, మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఫ్రెంచ్ పరిపాలనలోకి వెళ్లింది. 1946లో స్వాతంత్ర్యం పొందిన ఆ దేశం ఐక్యరాజ్యసమితి నిర్మాణంలో ఒక ఫౌండర్ మెంబర్ కీలక పాత్ర పోషించింది. కాలచక్రం తిరిగి అమెరికా ప్రాపకంతో, పశ్చిమ దేశాల మద్దతుతో కొన్ని ఇస్లామిక్ గ్రూపులు, టర్కీ మద్దతుతో కొన్ని మత చాందస గ్రూపులు అసద్ ప్రభుత్వంతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో పోరాటం చేసి విజయం సాధించాయి. మధ్యలో ఆసియాలో ప్రాంతీయ సమతుల్యత పేరుతో రష్యా అసద్ ప్రభుత్వంతో మమేకం కావడంతో ప్రభుత్వ వ్యతిరేకులపై అసద్ ప్రభుత్వం దమనకాండను ఉపయోగించి, ఐదు లక్షలమంది ప్రాణాలను హరించింది. 6.6 మిలియన్ల ప్రజలు చుట్టుపక్కల దేశాలైన టర్కీ, లెబనాన్, ఇరాక్‌లకు శరణార్థులుగా వెళ్లిపోయారు. వేల మంది జైళ్లలో మగ్గుతున్నారు.
ఇరాన్, అసద్ బంధం
ఇరాన్ ప్రభుత్వం అసద్ ప్రభుత్వంతో అంటకాగడానికి కారణం లేకపోలేదు. సిరియాను అర్థ శతాబ్దికి పైగా పరిపాలిస్తున్న అసద్ వంశం షియా తెగకు చెందింది. ఇరాన్ పాలకులందరూ షియా తెగకు చెందిన విషయం తెలిసిందే. హిజబుల్ ఇస్లామిక్ గ్రూపు షియా తెగకు చెందినదే. అసద్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన ప్రతిపక్ష ఇస్లామిక్ గ్రూపులన్నీ అరబ్ సున్నీ తెగకు చెందినవే. ఇస్లాం చట్టాలతో పరిపాలన సాగించే అన్ని దేశాలలో షియా, సున్నీ తెగల పొరపొచ్చాలు నరమేధాలు సృష్టిస్తూ, మానవజాతి వినాశనానికి దారులను పరుస్తున్నాయి. ఈ ఇస్లామిక్ గ్రూపుల దుర్మార్గపు చర్యలకు పాశ్చాత్య దేశాల సహాయంతో అమెరికా ఆయుధ, ఆయిల్ లాబీయింగ్ చేస్తూ, వత్తాసు పలుకుతుంది. అసద్ ప్రభుత్వానికి అండగా ఉన్న రష్యా, ఇరాన్ రెండూ చేతులెత్తేయడంతో , అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, సిరియా దేశాలలో ఎటువంటి ప్రతిఘటన లేకుండా పాలకులు పారిపోవడం సామాన్య ప్రజలకు ఒక విధంగా మేలు జరిగిందని భావించాలి.
భారత వ్యతిరేక వ్యూహం!
సిరియా విషయంలో అమెరికా, పాశ్చాత్య దేశాల ప్రయోజనాలు ఎలా ఉన్నా, బంగ్లాదేశ్ విషయంలో మాత్రం అమెరికా డీప్ స్టేట్ వ్యూహకర్తలు చక్కటి ప్రణాళికలను రచించినట్లు తెలుస్తుంది. భారతదేశం అంతర్జాతీయంగా శక్తివంతమైన దేశంగా ఎదగడం పాశ్చాత్య దేశాలకు ముఖ్యంగా అమెరికాకు నచ్చడం లేదు. భారతదేశంలో జాతీయవాద ప్రభుత్వం కొనసాగడం అమెరికాకు ససేమిరా ఇష్టముండదు. పాకిస్తాన్ తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రమైనప్పటికీ ఆ దేశానికి అమెరికా సహాయం చేసింది. ఒకవైపు పాకిస్తాన్ మరొకవైపు బంగ్లాదేశ్‌లను రెచ్చగొట్టి, భారత్‌కు భద్రతాపరంగా సవాలు సృష్టించడం అమెరికా వ్యూహం.
ప్రజల ఆలోచనల్లో మార్పు
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, సిరియా వంటి ఇస్లామిక్ దేశాలు రావణకాష్టంగా మండడానికి ఆ దేశాలలోని పాలకులే కారణం కాదు. ఆ దేశాలలోని ప్రజల ఆలోచన విధానాలు ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అనేది మరువలేని విషయం. ప్రజలు ఇస్లామిక్ మత భావాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే ఆయా దేశాలలో అనేక సమస్యలు పుట్టుకొచ్చాయి. పాశ్చాత్య దేశాలు ముస్లిం దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి ప్రధాన కారణం ఇదేనని ఒప్పుకొని తీరాలి.
- ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
94417 37877