నియామకాలను అడ్డుకుంటున్నది ఎవరు..?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణకి నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తూ వీటి ప్రాతిపదికనే జరిగిన తెలంగాణ

Update: 2024-07-10 00:45 GMT

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణకి నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తూ వీటి ప్రాతిపదికనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడింది తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువత.. తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు దాటింది.. గత ప్రభుత్వం నిరుద్యోగ సమస్య మీద దృష్టి పెట్టి ఉంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావు.. భవిష్యత్తులో ఖాళీకానున్న ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా రేవంత్ సర్కార్ యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే నిరుద్యోగ యువత లాభపడే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు హడావిడిగా 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.. నిజంగానే ఎన్నికల లోపు ఉద్యోగాలు భర్తీ చేస్తారనే నమ్మకం కూడా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువతలో కలిగింది.. కానీ దానికి భిన్నంగా దాదాపు 15 ప్రశ్న పత్రాలు లీక్ అయ్యి నోటిఫికేషన్లు రద్దు అయ్యాయి.. దీనికి తోడు హారిజంటల్ రిజర్వేషన్, GO 55, పరీక్షలు సజావుగా జరగలేదని తదితర సమస్యలతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.. హైకోర్టు రెండోసారి జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేయాలని తీర్పును ఇచ్చింది..

జాబ్ క్యాలెండర్‌కి సుముఖం

కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కొంతమంది మంత్రుల, అధికారుల బృందం నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా ప్రతి ఏడాది యూపీఎస్సీ లాగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తూ యూపీఎస్సీ అధికారుల నుండి సూచనలను తీసుకోవడానికి ఢిల్లీకి సైతం వెళ్లింది. ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఒకటి. అందువల్ల గ్రూప్ 1,2,3,4 పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చెసే ఆలోచనలో భాగంగా ముందుగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను సవరించి కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించే దిశగా హారిజంటల్ రిజర్వేషన్ తదితర అంశాలతో పాటు GO- 55 స్థానంలో GO- 29 తీసుకువచ్చింది.. దీనితో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ లో ఉన్న 5 వేల టీచర్ పోస్టులను 11 వేలకు పెంచి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది, కొత్త వాళ్లకు టెట్ రాసే అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తే వాళ్లకు అవకాశం కల్పించడం జరిగింది.

బీఆర్ఎస్‌కి శృంగభంగం

గత ప్రభుత్వంలో జరిగిన నియామకాల ప్రక్రియ హైకోర్టులో పలు కేసుల ద్వారా ముందుకు వెళ్లని పరిస్థితిని అధిగమించి కానిస్టేబుల్ పోస్టులతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పలు పోస్టులకు ఎంపిక అయిన యువతకు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లను ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రూప్ 1,2,3 ఉద్యోగాలను భర్తీ చేసే షెడ్యూల్‌లో భాగంగా ఫిబ్రవరి 2024లోనే టీజీపీఎస్సీ నుండి ఏ తేదిన ఏ పరీక్ష జరపనున్నారో ఒక వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ లోపే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గత పదేళ్లుగా తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసినం అని చెప్పుకున్న గులాబీ పార్టీకి పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు ఎన్నడూ ఊహించని ఘోర ఓటమిని ప్రజలు చూపించారు..

నిరుద్యోగ యువత డిమాండ్లు

తర్వాత డీఎస్సీ పరీక్షా షెడ్యూల్‌ను ప్రకటించింది. కొంతమంది అభ్యర్థులు డీఎస్సీలో పోస్టులు పెంచాలని, డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు ఒకసారి ఉండడం వల్ల తాము నష్టపోతామని పోస్టులు పెంచి వాయిదా వేయాలని ఆందోళనలు చేపట్టడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు వీళ్ల ఆందోళనలకు మద్దతు ఇవ్వడం సహజం. కానీ ఇక్కడ తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువత ఆలోచన చేయాలే.. ఎవరు నియామకాలను అడ్డుకుంటున్నరు.. ప్రభుత్వంలో ఉన్న పార్టీనా..? ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీనా..? లేక నిరుద్యోగ యువత ముసుగులో కొంతమంది అభ్యర్థులా..? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేయడంలో తప్పులేదు.. కానీ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

ఏటా 8 వేలమంది రిటైర్

ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఒక వైపు పరీక్షలను వాయిదా వేయమని డిమాండ్ చేస్తూనే మరో వైపు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది కాబట్టి భర్తీ చేస్తామని చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలెక్కడ అని ప్రశ్నిస్తోంది.. ఏండ్లకు ఏండ్లుగా తెలంగాణ వస్తే ప్రభుత్వ ఉద్యోగాల వస్తాయని ఓయూ లైబ్రరీ, చిక్కడపల్లి, అశోక్ నగర్ లైబ్రరీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షల కోసం చదువుతున్న విద్యార్థుల జీవితాలు మాత్రం రాజకీయ పార్టీలు ఆడుతున్న వికృత క్రీడలో ఆగం అవుతున్నయి.. గత మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కాలేదు. దీనికి కారణం గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 యేండ్ల నుంచి 61 కి పెంచడం..ఏ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినయి కేసిఆర్‌ను వయోపరిమితి పెంచమని?.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ ఇవ్వడానికి భయపడి చేసిన పనివల్ల ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఏటా దాదాపు 8 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యే అవకాశాలున్నాయి..

ఇలా చేస్తే నిరుద్యోగులకు మేలు

భవిష్యత్తులో ఖాళీకానున్న ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా రేవంత్ సర్కార్ యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే నిరుద్యోగ యువత లాభ పడే అవకాశం ఉంది.. దీనికి తోడు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా స్థానికతను నిర్ధారించే బోనఫైడ్ సర్టిఫికేట్ల స్థానంలో స్థానికేతరులు అక్రమ నివాస ధృవీకరణ పత్రాన్ని (బోగస్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్) సమర్పిస్తున్నారనే వార్తలు కూడా తెలంగాణ నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళనలకు కారణం అవుతున్నాయి..దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతిమంగా లక్షలాది నిరుద్యోగ యువత జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది.

డా. అక్కెనపల్లి వెంకట్రాం రెడ్డి

అసిస్టెంట్ ప్రొఫెసర్,

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం

97002 06444

Tags:    

Similar News