డేరాబాబా పెరోల్ వెనుక ఉన్నదెవరు?

గుర్మీత్ అలియాస్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి 40 రోజుల పెరోల్ ఇచ్చి యూపీకి తీసుకొచ్చారు. ఆదం‌పూర్ ఉప ఎన్నికలో బాబా

Update: 2022-10-18 18:45 GMT

బాబాను రెండుసార్లు పెరోల్ మీద విడుదల చేసిన ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బాబాకు 200 వాహనాలకు తగ్గకుండా కాన్వాయ్ కూడా ఉండడం, ఈ దేశంలో అత్యాచారం, హత్య, మోసం, దగా కేసులలో శిక్షలు పడిన దోషికి పాలకులు ఇస్తున్న గౌరవం చూసి బుద్ధిజీవులు తలదించుకునే పరిస్థితి వచ్చింది. నిజం కోసం ప్రాణమిచ్చిన జర్నలిస్ట్ ఛత్రపతి, ఉత్తరప్రదేశ్ లోని హత్రస్‌లో రేప్ చేసి, హత్య చేసి, శవాన్ని కనీసం ఆమె ఇంటి గుమ్మానికి కూడా తాకనీయకుండా పోలీసులే కాల్చేసిన యువతి ప్రశ్నిస్తున్నారు. మూత పడి ఉన్న పౌరుల దిమాక్ తలుపులు ఇంకా ఎప్పుడు తెరుచుకుంటాయని దేశం ప్రశ్నిస్తున్నది. సీఏఏ, ఎన్ఆర్‌సీ ఆందోళనలో జరిగిన ఆస్తుల నష్టానికి పరిహారం నిందితుల నుంచి రికవరీ చేయాలని నోటీసులు ఇచ్చారు. మరి డేరా బాబాకు శిక్షలు పడినప్పుడు జరిగిన నష్టం రికవరీ ఎందుకు చేయలేదు?

గుర్మీత్ అలియాస్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి 40 రోజుల పెరోల్ ఇచ్చి యూపీకి తీసుకొచ్చారు. ఆదం‌పూర్ ఉప ఎన్నికలో బాబా భక్తుల ఓట్లు వేయించుకోడానికి బీజేపీ నేతలు డేరా బాబాను బయటకు తెచ్చారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఆయనకు 21 రోజుల పెరోల్ ఇచ్చి బయటకు తెచ్చిన సంగతి తెలిసిందే. బిల్‌కిస్ బాను కేసులోనూ శిక్ష పూర్తి కాకుండానే పది మందిని విడుదల చేసిన విషయాన్ని దేశం ఇంకా మర్చిపోలేదు. దేశంలో దొంగబాబాలకు, స్వాములకు సలాములు కొడుతూ గులాములుగా మారుతున్న రాజకీయ నాయకులకు కొదవ లేకుండా పోతోంది. బ్యూరోక్రాట్లు సైతం వారి కాళ్లు మొక్కుడే. కొందరు ముఖ్యమంత్రులు, మంత్రులదీ అదే వరుస.

ఆ బాబా గత చరిత్ర ఎలా ఉన్నా, కోట్లు సంపాదించే రేపిస్టు అయినా, మనుషులను చంపే హంతకుడైనా మూఢభక్తుల ఫాలోయింగ్ అతనికి ఉంటే చాలు వీవీఐపీ అయిపోతాడు. ఇప్పుడు అలాంటివాడే 40 మంది ప్రముఖులలో ఒకడయ్యాడు. దేశంలో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ రాజకీయ నేతలు సహా 40 మందికి మాత్రమే ఉంది. అలాంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇప్పుడు రెండు రేప్ కేసులతో పాటు ఒక జర్నలిస్ట్ మరొక హత్య కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్ సింగ్ అలియాస్ డేరా బాబా అలియాస్ రామ్ రహీమ్‌కు ప్రభుత్వం కల్పించింది. ఇటీవల కుమార్ విశ్వాస్ అనే ఆయనకూ వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు.

నిజాయితీ అధికారి చొరవతో

ఎందరో రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్న రామ్ రహీమ్ కొన్ని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసి వాటిలో నటించాడు కూడా. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో 21 రోజులు బయటకు వచ్చినప్పుడు టెర్రరిస్టులు, ఖలిస్తానీయులతో ప్రమాదం ఉందని బాబాకు అత్యున్నత స్థాయి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించిన ఘనత హర్యానా బీజేపీ ప్రభుత్వానికే దక్కింది. ఇద్దరు శిష్యురాళ్ల రేప్, దీనిని వెలికితీసిన పూరా సచ్ పాత్రికేయుడు రామచంద్ర ఛత్రపతి హత్య, బాబా ఆశ్రమంలో శిష్యుడు రంజిత్ హత్య కేసులలో బాబాకు యావజ్జీవ శిక్ష విధించారు. బాబాల పాదాల వద్ద తమ టోపీలను సైతం పెట్టి మోకరిల్లే ఐపీఎస్‌లున్న దేశంలో డీ‌ఎస్‌పీ సతీశ్‌జాగర్ ఎవరి ఒత్తిడికి కూడా లొంగకుండా బాధితులకు, సాక్షులకు పూర్తి రక్షణ కల్పించి బాబాకు శిక్ష పడేలా చేసారు.

సతీశ్‌జాగర్ లాంటి పోలీస్ అధికారులు అరుదుగా కనిపిస్తారు. రామ్ రహీమ్ అని పేరు పెట్టుకున్న ఈ బాబాతో బీజేపీ, అకాళీదళ్‌తో పాటు కొందరు కాంగ్రెస్ నేతలకూ సత్సంబంధాలు ఉన్నాయి. ఇతని భక్తుల సంఖ్య పంజాబ్, హర్యానాతో పాటు ఢిల్లీలోనూ ఉంది. ఇతనికి శిక్షలు పడినప్పుడు పై మూడు రాష్ట్రాలలో హింసాత్మక సంఘటనలు జరిగి 36 మంది మరణించారు. 200 చిన్న వాహనాలు దగ్ధమయ్యాయి. 74 పెద్ద వాహనాలు, 29 భవనాలు ధ్వంసం చేశారు. మొత్తం 118 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 200 మంది గాయపడ్డారు. 350 ట్రైన్లను రద్దు చేశారు. ఏకె 47 తదితర మారణాయుధాలను జప్తు చేశారు. 2,318 మంది మీద 177 పేజీ‌ల ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ చేశారు. 2,167 మందిని అరెస్ట్ చేశారు. ఈ బీభత్సం నేపథ్యంలో బాబాను హెలికాప్టర్‌లో జైలుకు తరలించారు.

Also read: నడుస్తున్న చరిత్ర:తెలంగాణ పాగాకు బీజేపీ ప్లాన్ ఏంటి?

బుద్ధిజీవులు ఆలోచించాలి

శిక్షలు పడిన తర్వాత బాబాను రెండుసార్లు పెరోల్ మీద విడుదల చేసిన ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బాబాకు 200 వాహనాలకు తగ్గకుండా కాన్వాయ్ కూడా ఉండడం, ఈ దేశంలో అత్యాచారం, హత్య, మోసం, దగా కేసులలో శిక్షలు పడిన దోషికి పాలకులు ఇస్తున్న గౌరవం చూసి బుద్ధిజీవులు తలదించుకునే పరిస్థితి వచ్చింది. నిజం కోసం ప్రాణమిచ్చిన జర్నలిస్ట్ ఛత్రపతి, ఉత్తరప్రదేశ్ లోని హత్రస్‌లో రేప్ చేసి, హత్య చేసి, శవాన్ని కనీసం ఆమె ఇంటి గుమ్మానికి కూడా తాకనీయకుండా పోలీసులే కాల్చేసిన యువతి ప్రశ్నిస్తున్నారు. మూత పడి ఉన్న పౌరుల దిమాక్ తలుపులు ఇంకా ఎప్పుడు తెరుచుకుంటాయని దేశం ప్రశ్నిస్తున్నది.

సీఏఏ, ఎన్ఆర్‌సీ ఆందోళనలో జరిగిన ఆస్తుల నష్టానికి పరిహారం నిందితుల నుంచి రికవరీ చేయాలని నోటీసులు ఇచ్చారు. మరి డేరా బాబాకు శిక్షలు పడినప్పుడు జరిగిన నష్టం రికవరీ ఎందుకు చేయలేదు? రెండు వేలకు పైగా ఉన్న నిందితుల కేసు ఏమైంది? స్టాన్ స్వామి లాంటి వృద్ధ ప్రీస్ట్‌ను తీవ్రవాదం, దేశద్రోహంలాంటి కేసులలో పెట్టి అనారోగ్యంతో అతని చావుకు కారణం అయిన ప్రభుత్వం, సిద్దిక్ కప్పన్ లాంటి జర్నలిస్టును దేశద్రోహం కింద జైలులో పెట్టిన ప్రభుత్వం రామ్ రహీమ్ లాంటి బాబాను 40 రోజుల పెరోల్ మీద తీసుకుని రావడం చూస్తుంటే మొత్తం శిక్షను మాఫీ చేయరు కదా! అన్న అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే 2024‌లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. అందుకే అనుమానం. ఇంకా మన దిమాక్ తెరుచుకోకుంటే ఎలా? పెరోల్ మీద వచ్చిన డేరా బాబా ఆడంపూర్ ఉప ఎన్నికలో పెద్దలు చెప్పినట్లు మసలుకోవాలని వీడియో సందేశాలు పంపుతున్నాడు. ఆలోచించండి!!!


ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Tags:    

Similar News