క్రీమీలేయర్ కావాలని ఎవరడిగారు?

ఎస్సీ వర్గంలోని వివిధ కులాల మధ్యన సైతం అంతరాలు ఉన్నాయని, అభివృద్ధిలో తేడాలు ఉన్నాయని చెబుతూ క్రీమీలేయర్‌ను ముందుకు తీసుకొచ్చారు.

Update: 2024-08-08 21:30 GMT

ఎస్సీ వర్గంలోని వివిధ కులాల మధ్యన సైతం అంతరాలు ఉన్నాయని, అభివృద్ధిలో తేడాలు ఉన్నాయని చెబుతూ క్రీమీలేయర్‌ను ముందుకు తీసుకొచ్చారు. ఎస్సీ కులాల మధ్య అంతరాలు లేవని ఎవరూ వాదించడం లేదు. ఆ చేదు వాస్తవాన్ని అంబేద్కర్ సైతం అంగీకరించారు. వారందరూ అంటరానివారుగా బతికినా.. వారి మధ్యన సైతం ఎన్నో అంతరాలు ఉన్నాయని, వివక్ష సైతం ఉన్నదని ఆయన ఆనాడే గుర్తించాడు. అయితే ఈ అంతరాలను పుట్టించి, అమలు పరిచిన పాపం ఎవరిదనే మౌలిక ప్రశ్నను ఆయన వేశారు.

ఈ నెల ఒకటిన కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు, రాష్ట్రాల వారీగా ఎస్సీ కులాల వర్గీకరణకు అనుమతినిచ్చింది. ఊహించిన విధంగానే, సుప్రీం తీర్పు భిన్న స్పందనలకి దారితీసింది. ముప్పై సంవత్సరాలుగా నానుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభించిందని కొందరు స్వాగతిస్తే, ఈ సమస్యను పరిష్కరించడం తక్కువ, కొత్త సమస్యలకు తెర తీయడం ఎక్కువ జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగంలో పొందుపరచబడిన సామాజిక న్యాయ సూత్రాలను నిర్వీర్యపరచాలని చూస్తున్న స్వార్థపరశక్తులకు ఊతమిచ్చే విధంగా తీర్పులోని అంశాలున్నాయనేది సామాజిక న్యాయ ఉద్యమకారుల ఆవేదన.

వర్గీకరణ సమంజసమంటూనే..

వ్యాజ్యంలో ఇరుపక్షాలు లేవనెత్తిన అంశాలపైననే (framed issues) తీర్పునివ్వాలనేది న్యాయ శాస్త్ర నిబంధన. ఈ నిబంధన ప్రకారమే కోర్టులలో విచారణ సాగాలి, తీర్పులు ఇవ్వాలి అంటూ.. సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని ఆర్డర్14 నిర్దేశిస్తున్నది. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ అనే కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. వివాదిత అంశం ఎస్సీ కులాల వర్గీకరణ కోసం మాత్రమే. వర్గీకరణ చేయడానికి అనుమతించాలంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభు త్వం వాదిస్తే, వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని వైరి పక్షం వారు వాదించారు. ఇరువురి వాదనలో ఏది సమంజసమో మాత్రమే సుప్రీంకోర్టు తేల్చిచెప్తే సరిపోయేది. కానీ వర్గీకరణే సమంజసమని గౌరవ కోర్టు తీర్పునిస్తూనే ఆశ్చర్యకరంగా.. అంతటితో ఆగిపోకుండా, ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో క్రీమీలేయర్ నిబంధనను సైతం అమలుపరచాలంటూ తీర్పునిచ్చారు. దీంతో అవాంఛనీయ వివాదాలకు తెరతీసినట్టు అయింది. వర్గీకరణ కావాలని కోరుతున్న వారు వివిధ కులాల మధ్య అంతరాలు ఉన్నవి కాబట్టి ఏకరూప వర్గాన్ని వివిధ తరగతులుగా విభజించి, సదరు తరగతుల వాటాను నిర్ణయించి, సమన్యాయం అందించాలని కోరారు తప్ప.. మాకు లేదా ఎదుటిపక్షం వారికి క్రీమీలేయర్ విధించండి అంటూ ఎవరూ కోరలేదు. అసలు క్రీమీలేయర్ అంశాన్ని తీర్పులో ప్రస్తావించే వరకు సైతం.. న్యాయ ప్రక్రియలో భాగస్వాములైన వారికి కనీసపు దానిపై ఎరుక లేదు.

క్రీమీలేయర్ నిబంధన రాజ్యాంగ విరుద్ధం!

కనీసం ఈ అంశంలో న్యాయం చేయడం కోసం క్రీమీలేయర్‌ను సైతం మేము పరిశీలిస్తున్నామని జడ్జీలు చెప్పి ఉంటే.. హాజరైన న్యాయవాదులు తమ వాదనలు సమర్పించి ఉంటే అది కొంతమేరకు సమంజసమై ఉండేది. ఎవరూ కోరనిది, ఎవరూ వాదించనిది తీర్పులో చోటు చేసుకోవడమనేది ఏ రకంగానూ సమంజసం కాదు, న్యాయబద్ధమూ కాదు. న్యాయ శాస్త్ర పరిభాషలో ఇలాంటి ఆదేశాలను infructuous అంటారు. దాని అర్థం అమలుచేయ వీలులేనివి. తమ ఒక్క మాటే శాసనంగా చలామణి అవుతుందని గౌరవ న్యాయమూర్తులు గుర్తించి ఉండాల్సింది. ప్రస్తుతం ఓబీసీ వర్గాలకు అమలవుతున్న క్రీమీలేయర్ నిబంధన సైతం రాజ్యాంగ విరుద్ధమే. రాజ్యాంగంలో కానీ, మండల్ కమిషన్ సిఫారసుల్లో కానీ క్రీమీలేయర్ ప్రస్తావనే లేదు. ఇంద్ర సాహ్నీ కేసులో ఇవ్వబడిన తీర్పు కారణంగా ఈ క్రీమీలేయర్ విధానం ముందుకు వచ్చింది. క్రీమీలేయర్ కారణంగా ఇప్పటికే ఓబీసీ వర్గాలు చాలా నష్టపోతున్నాయి. 60 శాతం వరకు జనాభా ఉన్న ఓబీసీ వర్గాలకు 27% రిజర్వేషన్లు నిర్ణయించినా.. నేటి వరకు సగటున ఓబీసీలకు దక్కింది 8 శాతం మాత్రమే. మండల్ కమిషన్ అమలై 30 ఏళ్లు దాటాక, ఇంకా ఇంత తక్కువ ఓబీసీ ప్రాతినిధ్యం ఏమిటని ప్రశ్నిస్తే.. నాట్ ఫౌండ్ సూట బుల్ (NFS) అనే సాకుని అధికార వర్గాలు ముందుకు తీసుకొస్తున్నాయి. క్రీమీ లేయర్, నాట్ ఫౌండ్ సూటబుల్ అనేవి నేటి కాలపు పురుష సూక్తంగా పనిచేసి.. ఆధునిక మనువ్యవస్థను కాపాడుతున్నాయి.

కుల నిర్మూలన పరిష్కారమంటూ..

ఎస్సీ వర్గంలోని వివిధ కులాల మధ్యన సైతం అంత రాలు ఉన్నాయని, అభివృద్ధిలో తేడాలు ఉన్నాయని తెలుపుతూ క్రీమీలేయర్‌ను ముందుకు తీసుకొచ్చారు. ఎస్సీ కులాల మధ్య అంతరాలు లేవని ఎవరూ వాదిం చడం లేదు. ఆ చేదు వాస్తవాన్ని అంబేద్కర్ సైతం అంగీకరించారు. మహారాష్ట్రలోని మహర్, మాంగ్, చంభార్, ధోర్ కులాల వారందరూ అంటరానివారుగా బతికినా.. వారి మధ్యన సైతం ఎన్నో అంతరాలు ఉన్నా యని, వివక్ష సైతం ఉన్నదని ఆయన ఆనాడే గుర్తించారు. అయితే ఈ అంతరాలను పుట్టించి, అమలు పరిచిన పాపం ఎవరిదనే మౌలిక ప్రశ్న ఆయన వేశాడు. అగ్రవర్ణాలు సృష్టించిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఈ అంతరాలకు పునాది అంటూ ఆయనే తన పరిశోధనలో తేల్చి చెప్పాడు. అంబేద్కర్ ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త. ఆయన పరిశోధించి తేల్చిన అంశాలను ఎవరైనా పరిశీలించి నిగ్గు తేల్చవచ్చు. కొందరు తమ స్వార్థం కోసం సృష్టించిన అమానవీయ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థయే ఈ అంతరాలన్నిటికీ కారణమని తేల్చి చెప్పిన ఆయన.. కుల నిర్మూలనే ఈ జబ్బుకు పరిష్కారం అని రోగనిర్ధారణ సైతం చేశారు. ఆయన పరిశోధనా గ్రంథం 'కుల నిర్మూలన' (అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్) నేటి మన సమస్యలకు ప్రిస్క్రిప్షన్ అందిస్తుంది. రాజ్యాంగ నిర్మాత ఆశించిన కుల నిర్మూలన వైపు నిర్మాణాత్మకంగా అడుగులువేయండి అం టూ అధికార వర్గాలను ఆదేశించాల్సిన చోట.. సామాజిక న్యాయ విరుద్ధ క్రీమీలేయర్ ప్రస్తావన తీసుకురావడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమే. గౌరవ న్యాయమూర్తులు సుమోటోగా సమీక్ష నిర్వ హించి, అవాంఛిత అంశాలను తీర్పు నుండి తొలగించి, న్యాయాన్ని నిలబెట్టాలని.. సామాజిక న్యాయ ఉద్యమకారులు కోరుతున్నారు.

- ఆర్. రాజేశమ్

కన్వీనర్, సామాజిక న్యాయవేదిక

94404 43183

Tags:    

Similar News