రాముణ్ని అందరివాడిని చేసి.. అంబేడ్కర్‌ని ఎస్సీలకే పరిమితం చేస్తారా?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సక్తి జిల్లా దేవగావ్ అనే గ్రామానికి చెందిన వ్యక్తి రాహుల్ ఆంచల్. అతని వయసు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సక్తి జిల్లా దేవగావ్ అనే గ్రామానికి చెందిన వ్యక్తి రాహుల్ ఆంచల్. అతని వయసు 21. దళితుడు. ఐదు రోజుల క్రితం అతణ్ని గ్రామంలోని కొందరు దారుణంగా హింసించారు. అతను చేసిన తప్పేంటో తెలుసా? ఆ గ్రామంలో చంద్రాస్ అనే ఓబీసీ వర్గానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయితో మాట్లాడటమే.. దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అతణ్ని పట్టుకొని, చెప్పులతో కొట్టి, ఆపై చేతికి దొరికిన అన్ని రకాల వస్తువులతోనూ దాడి చేశారు. ఆపై ఊరి మధ్య నిలబెట్టి బట్టలు విప్పించి మరీ కొట్టారు. అక్కడితో వారి కోపం తీరలేదు. గ్రామంలోని బీసీలకు మరికొందరు అగ్రకులాలవారు తోడై, రాత్రంతా అతణ్ని బంధించారు. కనీసం మంచినీరు కూడా ఇవ్వకుండా దెబ్బలు కొడు తూనే ఉన్నారు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఉదయం స్థానికులు అతణ్ని చూసి, రాయ్‌గఢ్ ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న పోలీసులు అతనిపై దాడి చేసినవారి మీద కేసు నమోదు చేశారు. ఇంకా మొదలుపెట్టండి కామెంట్లు.. ‘అతని స్థాయి అతనికి తెలియాలి’, ‘వేరే కులం అమ్మాయిలతో అతనికి మాటలేంటి?’, ‘ఆ అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు’, ‘పల్లెల్లో ఉన్నవాడికి ఈ కులాల సంగతి తెలియదా?’, ‘వాడి కులంలో వాడికి అమ్మాయిలే దొరకలేదా?’, ‘వీళ్లకు ఇలాగే కావాలి’, ‘అలాంటి పనులు చేస్తే ఇలాగే కొడతారు’...సో ఆన్. సోదరులారా.. మనది భరత ఖండం. మనకు అలాంటి మాటలే వస్తాయి.. మొన్న శ్రీరామనవమికి రాముడి పోస్టర్ పెట్టి, శుభాకాంక్షలు రాసిన చాలామందికి నిన్న అంబేడ్కర్ జయంతి విషయం అని కూడా గుర్తులేదు. రాముణ్ని అందరివాడిని చేసే మహానుభావులు, చాలా హాయిగా అంబేడ్కర్‌ని ఎస్సీలకు మాత్రమే నాయకుణ్ని చేసేసి ద్వేషం పెంచేసుకున్నారు. ఇదే వైచిత్రి.
- విశీ(వి.సాయివంశీ)