అసలు జర్నలిస్టులు ఎవరు..?

ఈ రోజుల్లో యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల ద్వారా అనే క మంది వ్యక్తులు వార్తల ను విశ్లేషిస్తూ, తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ,

Update: 2025-03-16 01:15 GMT

ఈ రోజుల్లో యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల ద్వారా అనే క మంది వ్యక్తులు వార్తల ను విశ్లేషిస్తూ, తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ, తమను తాము "జర్నలిస్టులు" అని చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలా? ఎవరు కావాలంటే వారు జర్నలిస్టులు అయి పోతా రా? సాంప్రదాయ మీడియా వ్యవస్థలో జర్నలిస్టులుగా అంగీకరించబడటానికి వీరికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? సంచలనాత్మక వార్తలు ప్రసారం చేసి తప్పుదోవ పట్టించడం, అసత్య సమాచారం పంచడం జర్నలిజమా? ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే దాన్ని మీడియాపై దాడిగా పరిగణించాలా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి.

జర్నలిజం అనేది ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పరిగణించబడే అత్యంత బాధ్యతాయుతమైన వృత్తి. ఇది యథార్థమైన, సమగ్రమైన, సమచారపూర్వకమైన వార్తలను సమర్పించడమే కాకుండా, సమాజానికి ఉపయోగకరమైన విశ్లేషణ, విమర్శలను అందించాలి. అసలైన జర్నలిస్ట్‌ కోడ్ ఆఫ్ ఎథిక్స్ పాటిస్తారు. ఇవి పాటించకుండా యూట్యూబ్‌లో అబద్ధపు వార్తలు ప్రచారం చేయకూడదు.

వ్యూస్, ఆదాయం కోసమే పనిచేస్తే...

మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు నిర్దిష్టమైన అర్హతలు ఉంటాయి. వారికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అకాడమీ, ఇతర జర్నలిస్ట్ సంఘాలతో సంబంధాలు ఉంటాయి. ప్రెస్ అక్రిడిటేషన్ కార్డ్ లేదా గుర్తింపు పొందిన మీడియా సంస్థ నుంచి అధికారిక గుర్తింపు ఉంటుంది. అయితే, నైతిక విలువలను పాటిస్తూ స్వతంత్రంగా పరిశోధన చేసి, నిజమైన సమాచారం అందించే వ్యక్తులను సిటిజెన్ జర్నలిస్టులుగా పరిగణించవచ్చు. కానీ, ఎవరైనా యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసుకొని కేవలం వ్యూస్, ఆదాయం కోసం అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తే, వారిని అసలు జర్నలిస్టులుగా పరిగణించలేరు. ఏదైనా విషయాన్ని సంచలనంగా మార్చి వ్యూస్ పెంచుకోవడం జర్నలిజం అనిపించుకోదు. నిజమైన జర్నలిస్టు అనిపించుకోవాలంటే కేవలం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడమే సరిపోదు. జర్నలిస్టుగా గుర్తింపు పొందేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా ప్రెస్ అకాడమీ నిబంధనలు పాటించాలి. ప్రొఫెషనల్ మీడియా సంస్థ లేదా గుర్తింపు పొందిన న్యూస్ నెట్వర్క్‌లో అనుభవం ఉండాలి. నిజమైన పరిశోధన, ఫీల్డ్ రిపోర్టింగ్‌ చేసి, వాస్తవాలను నిర్ధారించుకోవాలి. న్యూస్ కంటెంట్ పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉండాలి.

ప్రభుత్వానికి ఆ అధికారముంది!

ప్రస్తుత డిజిటల్ మీడియా చట్టాలు, ఐటీ చట్టం కింద అసత్య ప్రచారం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారాలున్నాయి. 2023లో భారత ప్రభుత్వం క్రిమినల్ న్యాయ వ్యవస్థలో కీలకమైన మార్పులు చేసింది. భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం, అసత్య ప్రచారం, అవాస్తవాలను వ్యాప్తి చేయడం వంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. అదీ సోషల్ మీడియాలో అయినా సరే సంబంధిత సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం తప్పుదోవ పట్టించే వార్తలను నియంత్రించే బాధ్యత వహిస్తే, దాన్ని మీడియాపై దాడిగా పరిగణించడం తప్పు.

ప్రమాణాలను దిగజార్చవద్దు!

ఇప్పుడు జర్నలిజం, మీడియా వ్యవస్థ మొత్తం మౌలిక మార్పులకు లోనవుతోంది. యూట్యూబ్, డిజిటల్ మీడియా రావడంతో జర్నలిజం అందరికీ అందుబాటులోకి వచ్చినా, ఇది వృత్తిపరమైన ప్రమాణాలను దిగజారుస్తోంది. జర్నలిజం పేరు చెప్పుకొని ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని కట్టడి చేయడం జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ అకాడెమీల బాధ్యత. ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే, వారిని జర్నలిస్టులుగా గుర్తించరాదని స్పష్టంగా ప్రకటించాలి. సమాజానికి హాని కలిగించే తప్పుడు జర్నలిజాన్ని ఎదుర్కోవాలి. డిజిటల్ మీడియా నిబంధనలు, ప్రెస్ నిబంధనలు బలంగా అమలు చేయించేందుకు ప్రభుత్వంతో చర్చించాలి. డిజిటల్ మీడియా పెట్టుకొని అసత్య ప్రచారం చేసే యూట్యూబర్లను జర్నలిస్టులుగా కాకుండా, కేవలం కంటెంట్ క్రియేటర్లుగానే గుర్తించాలి. నిజమైన జర్నలిజం ప్రజలకు సత్యాన్ని తెలియజేయడం, ఆధారాలతో సమర్థమైన విశ్లేషణ అందించడం. అంతేకానీ, అసత్య ప్రచారం ద్వారా భ్రమలు కలిగించడం కాదు.

- శ్రీనివాస్ గౌడ్ ముద్దం,

ఫ్రీలాన్స్ జర్నలిస్టు

80088 88834 

Tags:    

Similar News