ప్రజల తీర్పు ఎటువైపు?

Where is the verdict of the people in this election?

Update: 2024-06-04 01:15 GMT

దేశంలో ఏడు విడతలుగా జరిగిన ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రధాన మీడియాతో పాటు వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వివరాలు బయటపెట్టాయి. అన్నీ స్థూలంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి అధికార పీఠం దక్కడం ఖాయం అని ప్రకటించాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అనేవి పోలింగ్ సరళిని బట్టి వేసిన అంచనాలే కనుక అవి శాస్త్రీయంగా పరిశోధించి ప్రకటించినవి కావు. ఏ ఓటరూ తాను ఫలానా పార్టీకే ఓటు వేశాను అని ఒట్టేసి చెప్పడు. ఒకవేళ చెప్పినా అందులో నిజం ఉందని చెప్పలేం. కాబట్టి ఎన్నికలలో ఓటర్ల ప్రవర్తనను అంత తేలికగా శాస్త్రీయంగా అంచనా వేయలేము. చూద్దాం.. ప్రజల మనోభావం ఏమిటో, ఎవరి మాటలు ప్రజలు విశ్వసించారో ఈ రోజు ఫలితాల తీర్పు తేటతెల్లం చేస్తుంది.

ఎన్నికల సంఘం సభ్యుల కూర్పులో కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు చేపట్టింది. అందులో పారదర్శకతకు తూట్లు పొడుస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేయడం ప్రశ్నార్ధకం అయింది. ఆ స్థానంలో ప్రధాని క్యాబినెట్ సహచరుడిని ఎన్నికల సంఘంలో చేర్చటం, విపక్ష నాయకుడికి స్థానం కల్పించినా ఆయన నిర్ణయం నామమాత్రం కావడం గమనించిన విపక్షాలు, ఇక నుంచి ఎన్నికల సంఘం పనితీరు ఎలా ఉంటుందోనని పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయినా అధికార పక్షానికి తిరుగులేని అధికారం ప్రజలు ఇచ్చారు కనుక, ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఈసీపై అనుమానపు చూపులు

ఈ ఎన్నికల్లో, అధికార పక్షానికి ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ, సుదీర్ఘ కాలం ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఎన్నికల సంఘంపై విపక్షాల నుండి అనుమానపు విమర్శలు వినిపించాయి. అయితే గత 6 విడతల్లో కూడా ఓటింగ్ శాతం పోలింగ్ ముగిసిన తర్వాత చేసిన ప్రకటనకూ, సుమారు ఆరు రోజుల గ్యాప్ తర్వాత వెల్లడించిన ఓటింగ్ శాతానికి మధ్య భారీగా తేడాలు ఉండటంతో విపక్షాల అనుమానాలకు బలం చేకూరింది. గతంలో ఈవీఎంలు లేకున్నా, బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరిగినా, పోలింగ్ శాతాన్ని ఒకటి రెండు రోజుల్లో కొద్దిపాటి తేడాతో వెల్లడించేవారు. ఇప్పుడు సాంకేతికంగా అధునాతన ఈవీఎంలు, సమాచార వ్యవస్థ ఉన్నా ఈ సుదీర్ఘ జాప్యం, పోలింగ్ శాతంలో భారీ వ్యత్యాసం అనుమానాలు పెరగడానికి ఎన్నికల కమిషన్ ఆస్కారం ఇచ్చింది. గతంలోనే ఒక గుర్తుపై ఓటు వేస్తే మరో గుర్తుకు ఓట్లు నమోదు అవుతున్నాయనీ ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రజలు, న్యాయవాదుల వాదనలను ఎన్నికల సంఘం, అలాగే సుప్రీంకోర్టు కూడా పట్టించుకోలేదు. ఒకరకంగా సుప్రీంకోర్టు ఎన్నికల మధ్యలో తాము జోక్యం చేసుకోలేమంటూ చేతులెత్తేసింది.

గెలుపు నీదా, నాదా?

ఆప్ కీ బార్ 400 అన్న మోదీ నినాదం ఫలించాలని అధికార పక్షం కార్యకర్తలు కోరుతున్నారు. విపక్షాలకు చెందిన ఇండియా కూటమే గెలవాలని కూటమి అభిమానులు కోరుకుంటున్నారు. ఇందులో తప్పు లేదు. అయితే అందుకోసం నాయకులు, పార్టీ అభిమానులు బీపీలు పెంచుకోవటం, కార్యకర్తలు ఛాలెంజ్‌లు విసురు కోవటం, పరస్పరం నిందించుకోవటం ఆపాలి. గతంలో ప్రతిష్టాత్మకమైన దేశ, విదేశీ ఎన్నికల నిపుణులు, సంస్థలు చేసిన ఎన్నికల సర్వేల అంచనాలు (ఎగ్జిట్ రిజల్ట్స్) కూడా గతి తప్పాయి. వాటి జోస్యాలు ఫలించలేదు. సామాన్య ఓటర్లు ఈ ఎన్నికల నిపుణుల అంచనాలను బురిడీ కొట్టించిన దాఖలాలు ఉన్నాయి. వారి నాడి దొరకబుచ్చుకోవటం అంత తేలిక కాదని రుజువైన సంఘటనలు ఉన్నాయి.

పొంతన లేని అంచనాలు...!

పైగా ఈ ఎన్నికల విశ్లేషకుల ఎగ్జిట్ పోల్స్ అంచనాల లెక్కల మధ్య పొంతన కుదరడం లేదు. మొన్నటి వరకు మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన ఉపన్యాసాలు ప్రధాని హోదాను మరచి గాడి తప్పి ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడారనీ దేశ విదేశాల్లో

విమర్శలు వచ్చాయి. మంగళ సూత్రాలు, ఎక్కువ మంది పిల్లలు కనే వారు, చొరబాటుదారులు వంటి భావోద్వేగ ప్రకటనలను చేశారు. మైనార్టీలలో ఒక వర్గ మతస్తులను టార్గెట్ చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. గత పదేళ్లలో తమ బీజేపీ ప్రభుత్వం, ఎన్‌డీఏ ప్రభుత్వం సాధించిన పాలనా ఘనతలు ఏమీ ప్రచారం చేసుకోలేదు. మత విద్వేషమే ప్రధాన ఎజెండా అయింది.

కూటమి ప్రచారం ఫలితమిచ్చేనా?

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికార బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రంగా ప్రచారం చేసింది. అధిక ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, దేశ సరిహద్దుల్లో చైనా చొరబాటు, భారత సరిహద్దులను దాటి మన భూభాగంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టడం, రహదారులు, నిర్మించటం, మన భూములు ఆక్రమించిన శాటిలైట్ చిత్రాలు వెలువడటం, అలాగే, బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే... డా.బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉనికిలో ఉండదని, పౌరహక్కులు హరించి వేయబడతాయనీ, నియంతృత్వ పాలన వస్తుందనీ, రిజర్వేషన్లు దక్కవనీ మొదలైన అనేక విషయాలను ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. చూద్దాం. నేడు ప్రజల మనోభావం ఏమిటో ఎవరి మాటలు ప్రజలు విశ్వసించారో ఈ రోజు తెలుస్తుంది.

డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Tags:    

Similar News