ముస్లింలవి మాత్రమే మత పరమైన రిజర్వేషన్లా?
మన దేశంలో రిజర్వేషన్ ఒక రాజ్యాంగ వెసులుబాటు మాత్రమే. ఇది సమాజంలో అణగారిన వర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు, వారు
మన దేశంలో రిజర్వేషన్ ఒక రాజ్యాంగ వెసులుబాటు మాత్రమే. ఇది సమాజంలో అణగారిన వర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు, వారు అభివృద్ధి చెందేందుకు, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం పొందేందుకు రాజ్యాంగపరంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం. రిజర్వేషన్ అనేది సామాజిక ఉన్నతి కోసం తప్ప ఆర్థిక అభివృద్ధికి కాదు. ఇది కేవలం 'ఊతకర్ర' మాత్రమే. అయితే కుల, మత, ఆర్థిక వెనకబాటుతనంతో రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగానికి విరుద్ధం.
చేతలలో అడుగు పడటం లేదు
2011 సెన్సెస్ ప్రకారం తెలంగాణ జనాభా 3.51 కోట్లు. ఇందులో ముస్లిం జనాభా 12.68 శాతంతో 44.64 లక్షలు. కానీ, వీరికి 2007లో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషనే ఇప్పటికి అమలవుతోంది. రిజర్వేషన్ శాతం పెంచుతామని ఎన్నిసార్లు హామీ ఇచ్చారు. మతపర రిజర్వేషన్‌లు రాజ్యాంగ విరుద్ధం అని మోకాలడ్డుతున్నారు. నిజానికి దేశంలో రిజర్వేషన్ 50 శాతానికి మించకూడదనే అపోహా అందరిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జనాభాను దృష్టిలో పెట్టుకొని 9వ షెడ్యూల్‌లో చేర్చి రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు. దీంతోనే తమిళనాడులో 69, జార్ఖండ్‌లో 60, మహారాష్ట్రలో 52 శాతానికి పెంచుకున్నాయి. రిజర్వేషన్ 50 శాతానికి మించితే సుప్రీంకోర్టు ఒప్పుకోదనే అపోహ ఉంది.
నిజానికి సుప్రీంకోర్టు రాష్ట్రాలు రిజర్వేషన్‌లు పెంచుకోవడానికి ఉన్న' అసాధారణ పరిస్థితులను' గణాంకాలతో సమగ్ర నివేదికతో నిరూపిస్తే అవి చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. అందుకే తమిళనాడు కమిషన్ వేసి సమగ్ర నివేదిక వేసి తయారుచేసి, రాష్ట్రపతి 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చి రిజర్వేషన్ అమలు పరుచుకుంది. దళితులు, గిరిజనులు, బీసీల కంటే ముస్లింలలో అత్యంత వెనుకబాటుతనం ఉందని గోపాల్‌సింగ్ కమిటీ, రాజేందర్ సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ వంటివి నివేదించాయి. రాజేందర్ సచార్ కమిటీ సూచనలను తెలంగాణ రాష్ట్రంలో వందశాతం అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రం సాధించాక మరిచిపోయారు. మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, చేతలలో అడుగు ముందుకు పడటం లేదు.
Also read: KCR:కేసీఆర్ సారు మీకు ఇన్ని అవమానాలా!
అభివృద్ధి అక్కడే చూపుతూ
సుధీర్ కమిషన్, బీసీ కమిషన్ తెలంగాణ ముస్లింల పరిస్థితిని గణాంకాలతో నిరూపించాయి. దీంతో 2017లో కేసీఆర్ ముస్లిం, గిరిజన రిజర్వేషన్ పెంపుపై బిల్లు రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపారు. వారు ఆమోదించకపోతే తమిళనాడు తరహాలో అయినా సాధిస్తామని చెప్పారు. 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటే పార్లమెంటు ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. మరి కేసీఆర్ ఆ బిల్లును రెండు సభలలో ఆమోదింపచేయగలరా? రెండు సభలలో ఆమోదం పొందినా మరో సమస్య ఉంది. 1973 నుంచి 9వ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాల మీద న్యాయ సమీక్ష చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అక్కడ నిరూపించగలరా? దీనికంతటికి కావాల్సింది గణాంకాల ఆధారంగా సమగ్ర నివేదిక. ముస్లింల రిజర్వేషన్ ఎప్పుడు ముందుకు వచ్చినా అవి మతపరం, రాజ్యాంగ విరుద్ధం అంటారు. మరి మతం జాతి లేని వారు ఎక్కడైనా ఉంటారా? నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే హక్కు ఉంది. కానీ ఇవ్వరు.
2023 ఎన్నికల సమయంలో ప్రకటించి ఓట్లు కొల్లగొట్టడానికి వాడుతారు. తెలంగాణలో గంగ జమున తెహజీబ్ ఒక మిథ్య మాత్రమే. గిరిజనులకు పెంచినట్టు ముస్లింలకు పెంచి జీఓ విడుదల చేయవచ్చు కదా? కానీ, చేయరు. కేసీఆర్‌తో చనువుగా ఉండే అసదుద్దీన్ చెప్పొచ్చుగా? చెప్పరు. రాజకీయాల కోసం ముస్లింలను వాడుకుని వదిలేస్తున్నారు. ఇవేవీ బయటకు పొక్కకుండా ముస్లింల అభ్యున్నతి, షాదీ ముబారక్, ముస్లిం గురుకులాలు అంటున్నారు. నిజానికి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే రుణాలు ఇచ్చి వ్యాపారులుగా ఎదిగేలా చూడాలి. రాజకీయంగా చేయూతనివ్వాలి. ముస్లింలకు కేటాయించిన బడ్జెట్ సరిగా ఖర్చు పెట్టడం లేదు. దీంతో వారు అభివృద్ధికి దూరం అవుతున్నారు. అందుకే ముస్లింలు తమ హక్కుల కోసం ఉద్యమించాలి. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం, దళిత ,గిరిజన, బీసీ వర్గాల అభివృద్ధి జరిగితేనే కేసీఆర్ కలలు కన్నా బంగారు తెలంగాణ సిద్ధిస్తుంది .
జియావుద్దీన్ ముహమ్మద్
ముస్లిం హఖ్ అధ్యక్షులు
99892 36393