వరల్డ్ టుడే:జీవనశైలి మారితేనే ఆరోగ్యం
సృష్టిలో ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదు. కరోనా ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగించి లక్షలాది ప్రాణాలను హరించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి సమాన ఆరోగ్య అవకాశాలు లేవనే సత్యాన్ని కరోనా బహిర్గతం చేసింది. మన ప్రస్తుత విధానాలు, ఆర్థిక అసమానతలు, సమాజంలోని కొద్ది మంది చేతిలో అధికారం కేంద్రీకృతం కావడంతో అధిక శాతం ప్రజలు ఇంకా స్థిర ఆదాయం లేక దారిద్యంలో మగ్గిపోతున్నారు. సమాన ఆర్థిక అవకాశాలు కల్పించే వ్యవస్థ ఏర్పాటుకు దీర్ఘకాల పెట్టుబడులు, దేశ ప్రజలందరికి లబ్ధి చేకూరేలా బడ్జెట్ కూర్పు, సామాజిక భద్రత లాంటి అంశాల ప్రాతిపదికగా ప్రణాళికలు రూపొందించాలి. ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షించడానికి చట్టపరమైన ప్రణాళికలు రూపొందించడం, పారిశ్రామిక రంగంలో సంస్కరణలు చేపట్టడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరించడానికి ప్రజలకు ప్రోత్సాహకాలు కల్పించాలి.
సృష్టిలో ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదు. కరోనా ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగించి లక్షలాది ప్రాణాలను హరించిన విషయం తెలిసిందే. ఆ మహమ్మారి నేటికీ రూపాన్ని మార్చుకుంటూ తన ఉనికిని చాటుకుంటున్నది. ఈ తరుణంలో ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయ్యింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారానే వ్యాధులను నివారించవచ్చని వైద్యులు ఉద్ఘాటిస్తున్నారు. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వివిధ వ్యాధుల గురించి ముందస్తుగా హెచ్చరికలు చేస్తున్నది. చేపట్టవలసిన చర్యల గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నది.
ఐక్య రాజ్య సమితికి అనుబంధంగా 7 ఏప్రిల్ 1948న స్విట్జర్లాండ్‌లోని జెనీవా ప్రధాన కార్యాలయంగా 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' ఆవిర్భవించింది. ఈ ఒప్పందం మీద ఐక్య రాజ్య సమితి 51 సభ్య దేశాలతోపాటు మరో పది దేశాలూ సంతకాలు చేసాయి. భారత తొలి మహిళ, ఆరోగ్య శాఖ మంత్రిగా దశాబ్ద కాలం సేవలందించిన రాజకుమారి అమృత్ కౌర్ 1950లో 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' కార్యకలాపాలను నియంత్రించే 'వరల్డ్ హెల్త్ అసెంబ్లీ' అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అధిష్టించిన తొలి మహిళగానే కాక, ఆసియా ఖండం నుంచి ఎంపికైన తొలి నేతగా చరిత్రపుటలకెక్కారు.
స్వయంకృతాపరాధమే కారణం
'ప్రపంచ ఆరోగ్య సంస్థ' 2022 సంవత్సరానికి 'మన గ్రహం–మన ఆరోగ్యం' అనే అంశాన్ని ఎంచుకుంది. కరోనా, కాలుష్యం కారణంగా క్యాన్సర్, ఆస్తమా, గుండె జబ్బులు సర్వసాధారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' భూగోళంపై ఆరోగ్యవంతమైన వాతావరణం నెలకొని ఉండేలా కృషి చేయాలని సంకల్పించింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి 30 లక్షల మంది నివారించదగిన వాతావరణ కారణాలతోనే మరణిస్తున్నారు. యథేచ్చగా అడవుల నరికివేత, మోతాదును మించి పెరిగిపోతున్న వాయు, శబ్ద కాలుష్యం, విచ్చలవిడిగా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింది. మానసిక ఒత్తిడులు, మారిన జీవనశైలి కూడా అనారోగ్యానికి కారణమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 శాతం జనాభా శిలాజ ఇంధనాలను (fossil fluids) కాల్చడం ద్వారా వెలువడే అనారోగ్యకర గాలిని పీల్చుకుంటున్నారు. దోమలు ముందు కంటే త్వరితగతంగా ఎక్కువ దూరాల వరకు వ్యాధులను విస్తరింపచేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలు కలుగజేస్తున్నాయి. చిన్న చెరువులు మొదలుకొని మహాసముద్రాల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలతో తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. సాధారణ మత్స్య సంపదపైనే కాక, వివిధ రకాల జలచరాల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆహార పదార్థాలు పానీయాలను ఎక్కువ కాలం పాటు నిలువ ఉంచడంతో అవి సహజ లక్షణాలను కోల్పోయి ఊబకాయం, క్యాన్సర్, గుండె జబ్బులు, థైరాయిడ్, డయాబెటీస్ లాంటి సమస్యలకు దారితీస్తున్నాయి.
పాఠాలు నేర్పిన కరోనా
ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి సమాన ఆరోగ్య అవకాశాలు లేవనే సత్యాన్ని కరోనా బహిర్గతం చేసింది. మన ప్రస్తుత విధానాలు, ఆర్థిక అసమానతలు, సమాజంలోని కొద్ది మంది చేతిలో అధికారం కేంద్రీకృతం కావడంతో అధిక శాతం ప్రజలు ఇంకా స్థిరాదాయం లేక దారిద్యంలో మగ్గిపోతున్నారు. సమాన ఆర్థిక అవకాశాలు కల్పించే వ్యవస్థ ఏర్పాటుకు దీర్ఘకాల పెట్టుబడులు, దేశ ప్రజలందరికి లబ్ధి చేకూరేలా బడ్జెట్ కూర్పు, సామాజిక భద్రత లాంటి అంశాల ప్రాతిపదికగా ప్రణాళికలు రూపొందించాలి. ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షించడానికి చట్టపర ప్రణాళికలు రూపొందించడం, పారిశ్రామిక రంగంలో సంస్కరణలు చేపట్టడం, ఆరోగ్యకర జీవనశైలిని ఆచరించడానికి ప్రజలకు ప్రోత్సాహకాలు కల్పించాలి.
ప్రపంచవ్యాప్తంగా ఇస్కీమిక్ గుండె జబ్బు లేదా కరోనరీ వ్యాధి కారణంగా 2000 సంవత్సరంలో 20 లక్షల మంది మరణించగా, ఆ సంఖ్య 2019 నాటికి 89 లక్షలకు చేరుకుంది. స్ట్రోక్ (మెదడులోని రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం) 11 శాతం ప్రాణాలను హరిస్తుండగా, ఊపిరితిత్తుల వ్యాధి 6 శాతం ప్రాణాలను మింగేస్తోంది. శ్వాసకోశ వ్యాధులు నాలుగవ స్థానంలో ఉన్నాయి. ప్రసూతి మరణాలు ఐదవ స్థానంలో ఉన్నాయి. 2019లో దాదాపు 20 లక్షల నవజాత శిశువులు మరణించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు 12 లక్షల నుండి 18 లక్షలకు చేరుకున్నారు. అల్జీమర్స్ అత్యధికంగా మహిళల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. మధుమేహం 2000 సంవత్సరం కంటే 70 శాతం పెరిగింది. ఎయిడ్స్ తీవ్రత 51 శాతానికి తగ్గింది. 2019 లో కిడ్నీ బాధితుల మరణాలు 13 లక్షలకు చేరాయి..
నివారణోపాయాలు
సరైన మోతాదులో వ్యాయామం, వేళ ప్రకారం పౌష్టికాహారం తీసుకోవడం, ఎనిమిది గంటల నిద్ర పోవడం, మానసిక ఒత్తిడి లేని జీవనశైలిని ఆచరించడం, మద్య, ధూమపాన వ్యసనాలకు దూరంగా ఉండడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు. యోగాసానాలు, ధ్యానం మన దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మనకు సంపూర్ణారోగ్యం సంతరిస్తుంది.
(నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)
యేచన్ చంద్ర శేఖర్
హైదరాబాద్
88850 50822