ఇంచార్జిల పాలనకు చరమగీతమెప్పుడు?

When is the end of the regime of incharge Mandal Education Officers

Update: 2024-03-27 00:30 GMT

పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లోని అన్ని పోస్టులను ఇంచార్జి‌లతోనే కొనసాగించడం శోచనీయం. ముఖ్యంగా విద్యావ్యవస్థలో జిల్లా విద్యాధికారులు, మండల విద్యాధికారులు ఇతరత్రా కీలక పోస్టులన్నీ ఇంచార్జీల పాలనతోనే కొనసాగాయి. విద్యాహక్కు చట్టం పది శాతంకు మించి ఖాళీలు ఉండకూడదని సూచిస్తున్నా అవేవీ పట్టించుకోకుండా ఇంచార్జీలతో పాఠశాలల్లో బోధనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

మన రాష్ట్రంలోనే రూల్స్ అడ్డునా?

రాష్ట్రంలోని 615 మండలాలకు‌ గానూ 580 మండలాలకు పైగా రెగ్యులర్ ఎంఈఓ‌లు లేరు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇంచార్జ్ ఏంఈఓలుగా కొనసాగుతున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కీసర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏకంగా 8 మండలాలకు ఇంచార్జ్ ఎంఈఓగా కొనసాగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చును. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా విద్యాశాఖాధికారులకు సైతం ఒకటికన్నా ఎక్కువ జిల్లాలను అప్పగించడంతో పాలన కుంటుపడింది. భావితరాల ఉపాధ్యాయులను తయారుచేసే డైట్ కేంద్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రిన్సిపాల్, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో బోధన కొనసాగడం గగనమైంది. ఇదిలా ఉంటే అరవై శాతానికి పైగా బడులలో ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండటంతో స్కూల్ అసిస్టెంట్‌లు ఇంచార్జ్‌లుగా కొనసాగుతున్నారు.

2015లో గత ప్రభుత్వం చివరిసారిగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా పదోన్నతులు కల్పించకపోవడంతోనే నేడు ఈ ఇంచార్జ్‌ల పాలనకు కారణం. సర్వీస్ రూల్స్, కోర్టు కేసులు ఇతరత్రా కారణాలతో పదోన్నతులు వాయిదా పడుతూనే ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని ఎంఈఓ పోస్టులను భర్తీ చేసింది. ఆ ప్రభుత్వానికి అడ్డురాని సర్వీసు రూల్స్ మన రాష్ట్రంలోనే ఎందుకు అడ్డువస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. గతంలోని ముఖ్యమంత్రి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. రెండు కమ్మల్లోని సర్వీసు రూల్స్ తాను దిగి పోయేంతవరకు కార్యాచరణకు నోచుకోలేదు.

సీఎం ప్రత్యేక చొరవ తీసుకుని..

ఒక ప్రధానోపాధ్యాయుడికి 8 మండలాలకు పైగా బాధ్యతలు అప్పగిస్తే వ్యవస్థ ఎటుపోతుందో అర్థంకాని పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు పాఠశాలలకు న్యాయం చేయలేక, ఇటు మండల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేక పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉదంతాలు కోకొల్లలు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఈ నెలాఖరు నుండి ఉద్యోగ విరమణలు మొదలవుతున్నాయి. పాఠశాలల్లో సబ్జెక్టు బోధించే టీచర్లు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. టీచర్లు లేని సందర్భంలో కనీసం విద్యా వాలంటీర్లను నియమించక పోవడం గమనార్హం. అమ్మ ఆదర్శ కమిటీలతో ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు ఇతర సదుపాయాలు కల్పించడానికి సన్నద్ధమవుతున్న నూతన సర్కారు, బడులకు ఉచిత కరెంటును అందిస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కూడా చర్యలు చేపట్టాలి. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు బోధించే టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదలచేసిన ప్రభుత్వం త్వరలో నియామకాలను పూర్తిచేయడం తక్షణ కర్తవ్యంగా భావించాలి. ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి, విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ క్రమంలో సీఎం ప్రత్యేక చొరవ తీసుకొని సర్వీస్ రూల్స్ సమస్య, కోర్టు కేసులను పరిష్కరించి త్వరితగతిన పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టాలి. పండిట్, పీఈటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టుల అప్ గ్రెడేషన్‌ను చేపట్టి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూ ఇతర రాష్ట్రాలకు తెలంగాణ విద్యావ్యవస్థను ఆదర్శంగా నిలపాలని ఉపాధ్యాయ లోకం కోరుకుంటున్నది.

- సుధాకర్.ఏ.వి

-రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Tags:    

Similar News