ఆధునిక మహాభారత సృష్టికర్త..
గుంటూరు శేషేంద్ర శర్మ సంప్రదాయ సాహిత్యంపై ఎంతో ప్రభుత ఉన్న కవి. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారిగా ప్రజలతో సాన్నిహిత్యం గల కవి. మరే ఇతర కవికీ
గుంటూరు శేషేంద్ర శర్మ సంప్రదాయ సాహిత్యంపై ఎంతో ప్రభుత ఉన్న కవి. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారిగా ప్రజలతో సాన్నిహిత్యం గల కవి. మరే ఇతర కవికీ లభించని సమాజం ప్రత్యక్షానుశీలనం శేషేంద్ర శర్మ గారికి ఉంది. పైగా విభిన్న దేశాలు, సంస్కృతులు ప్రత్యక్షంగా దర్శించిన కవి. తెలుగు, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ భాషలలోని కవిత్వంతో తలస్పర్శి పాండిత్యం ఉన్న కవి. ఫలితంగా శేషేంద్ర శర్మ గారి కవిత్వం ఆలోచనా నేపథ్యానికి వైశాల్యం ఎక్కువ అయింది. ఆయన కలమెత్తితే అందులోంచి నక్షత్రాలు అక్షరాలుగా రాలతాయి. సూర్యుడు, చంద్రుడు జెండాలెగరేసే శక్తులుగా పర్వత శిఖరాలు నిశ్శబ్ద పరీవాహ ప్రాంతంలోని నిలువెత్తున నిల్చున్న మహర్షుల్లా- వృక్షాలు, అరణ్యాలు శక్తిని నిస్వార్థంగా, చైతన్యశీలంగా వినియోగించే మనుషుల్లా- ఇలా పాంచభౌతిక దేహమూ, పంచభూతాత్మక ప్రపంచమూ రెండూ కవి ఊహా యవనిక మీద విశ్వరూపంలో ప్రదర్శితవౌతాయి.
ఆది కవి నుంచి ఆధునిక కవి దాకా కాలం పరీక్ష నాళికలో కవిత్వాన్ని శాస్త్రీయ దృష్టితో మైక్రో ఎనాలసిస్ చేస్తే ఒక ప్రగతిశీలమైన తత్వ చింతనకు ప్రాతినిధ్యం వహిస్తూ రచించిన సృజనా స్వరూపాలే శాశ్వతత్వాన్ని పొందుతున్నాయి. సమాజ నిష్టం కానీ వైయక్తిక అనుభూతుల సృజనా స్వరూపాలకు ఆయువు తక్కువే. వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ఖండకావ్యాలు, వచన కవిత్వం, మినీ కవిత్వం-హైకూలు - నానీలు- ఇలా విభిన్న రూపాలలో సృజన జరిగింది. జరుగుతోంది. ప్రతిరూపం వెనుక సమకాలీన సమాజం, కాలం స్వభావం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సమర్థంగా ప్రతిబింబించినవి ప్రజల నోళ్లకెక్కాయి. అసమర్థంగా ప్రతిబింబించినవి అజ్ఞాతంగా మిగిలిపోయాయి.
కవి కాదు... సమాజం కనిపించాలి!
సమర్థత- అసమర్థత అన్నవి కవి పరిణతిపై ఆధారపడి ఉంటుంది. ఇతివృత్తం, తీసుకున్న చందం- అలంకారిక పదబంధ ప్రయోగ నైపుణ్యం, అన్నింటికి మించి కవి చిత్తశుద్ధి- అతనికి గల మేధాశక్తి, ఆత్మశక్తి అన్నీ కలిసి శక్తివంతమైన అభివ్యక్తిగా రూపొందుతాయి. వేదకాలపు సమాజంలో వున్న అభివ్యక్తి ఈ కాలానికి పనికిరాదు. అభివ్యక్తి సమాజ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఉండాలి కూడా. అలాగే ఒక కవి తన జీవన కాలంలో రచించిన కవిత్వం అంతా ఒకేలా ఉండదు. శైలీ వైరుధ్యాలు, సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయి. కవి తన జీవితంలో రాసిన కవిత్వంలో సింహభాగాన్ని ఒక చోట చేర్చి సింహావలోకనం చేసుకుంటే అందులో తాను కనిపించకూడదు. తను నివసించిన సమాజం కన్పించాలి. కాలస్వభావం కనిపించాలి. అప్పుడే అతడు కవిగా సఫలమైనట్లు. ఈ నేపథ్యంలో గుంటూరు శేషేంద్ర శర్మగారి ఆధునిక మహాభారతాన్ని అనుశీలిద్దాం.
ప్రాచీన పరిభాష... అధునాతన భావ స్పర్శ
అంతటి భావనోల్బణాన్ని వ్యక్తీకరించడానికి కవి కొత్త పరిభాష కోసం సహజంగా తహతహపడతాడు. ఆ పరిభాష కొన్ని సందర్భాల్లో అయత్నకృతంగాను, కొన్నిచోట్ల ప్రయత్నపూర్వకంగానూ వ్యక్తమవుతుంది. శేషేంద్ర ఆధునిక మహాభారతానికి అనుబంధ కావ్యంగా జనవంశం అనే కృతిని సంకలనం చేశారు. అందులో కవిగా శేషేంద్ర అభివ్యక్తి కోసం చేసిన ప్రయత్నాలన్నీ కనబడతాయి. ‘విధి నా చేతికిచ్చిన విషపాత్రిక నగరం /ఇక్కడే వెయ్యిసార్లు నా లోకాల్ని కోల్పోయా’ కవికి మానవ నాగరితా పరిణామంలో తాను ప్రజలు- నగరం- ప్రకృతి మధ్య లోపించిన ఆత్మీయ సమతుల్యాన్ని తిరిగి పొందే తీవ్ర వాంఛ వ్యక్తపరుస్తాడు. ‘రాళ్ల కన్నీళ్లు వ్యాపించిన ఈ భూములపైన వేస్తాడు ఒకడు- ఇనుప కండరాల దేహం మీద సుళ్లు తిరిగేము’- అని అంటూ ‘అరే నా దేశంలోనే నా గొంతు పరాయిదైపోయిందే’ అని బాధపడతాడు. ‘అరే ఈ గుంపుకు ఎలా మేల్కొనాలో తెలియదు- / ఎలా బాహువులు చాపి తన ఇనుపకాళ్లు / ఇలాతలంలో మోపాలని తెలియదు’.
సంప్రదాయ పరిమళాల ఆనందపు రుచి
నా దేశం - నా ప్రజలు అన్న ఒక్క పర్వంలోనే ఆధునిక మహాభారత హృదయం ఉంది. అయితే కవి ప్రేయసిని మధ్యలో సంబోధించుకుంటూ తనలోని భావాలకు ఆనందపు రుచి కలిగిస్తాడు. బహుశా కావ్యంలో నాయకునితో పాటు నాయకి కూడా ఉండాలనే సాంప్రదాయిక స్పృహేమో అయినా ప్రాచీన కావ్య నిర్మాణ పరిస్థితులని దీంట్లో వెదకడం తప్పు. భౌతిక రూపం మాత్రం ఆశ్వాసాంత గద్య, విభజించిన సర్గలో మాత్రం సంప్రదాయ పరిమళాల్ని నింపుకున్నాయి.
కావ్య పరిభాషని అభివ్యక్తి మింగేస్తే...
ఇక సూర్య పర్వం. సూర్య ప్రతీకగా సాగుతుంది. ‘‘నోటినిండా సూర్యుణ్ణి కొరుక్కు తింటున్నా- / పెదవుల కొసల నుంచి ఎర్ర కాంతులు రసం జారిపడుతోంది / అడవుల్లో సంచరిస్తూ దారి తప్పిన లంబాడీ ఒంటరితనం నా యెదుట పడ్డాయి’’. ‘‘కొండల విశ్శబ్దాన్ని బొట్లు బొట్లుగా చప్పరిస్తున్నపుడు చప్పుడు చేసే నా గుండెను కూడా క్షమించలేను’’ అంటాడు కవి.
సహజ కృత్రిమాల మధ్య జరిగే సంఘర్షణ కవిలోంచి అప్రయత్నంగా తన్నుకొని వస్తుంది. ఆకాశాలు ఒరిసే అడవుల నిశ్శబ్దంలో / చెట్లని ముక్కుతో కొట్టి / శబ్దాలు ప్రతిధ్వనింపజేసే వడ్రంగి పక్షి / క్రోటన్ మొక్కల్లో ఏం చేస్తుంది? ఇక్కడ కవి వడ్రంగి పక్షిలా కనపడతాడు. ‘‘పళ్లు తిన్నట్లు దినాలు తిన్న నేను/ ద్రాక్ష పళ్లంత కన్నీటి బిందువులు తింటున్నాను’’. చెప్పే భావాన్ని ఆకర్షణీయమైన అభివ్యక్తి కావ్య పరిభాష మింగేస్తుందేమో అన్న భయం కలుగుతుంది. ఫలితంగా శేషేంద్ర శైలి బాగా వుంది. గొప్ప ఎక్స్‌ప్రెషన్ అని ఆపివేస్తే ప్రతిపాదించిన మూల సిద్ధాంతాన్ని విస్మరించే ప్రమాదం వాటిల్లింది.
వాడే.. రచనలకు ప్రథమ శత్రువు!
చలం ఎప్పుడో ఒకసారి అన్నారట. ‘‘ఎవడైనా వచ్చి ‘చలంగారూ మీ శైలి అమోఘంగా వుంది’ అన్నాడంటే- వాడే తన రచనలకు ప్రథమ శత్రువు’’ అని. అదే శేషేంద్రకు వర్తిస్తుంది. శేషేంద్ర సభలలో కవిత్వానికి చప్పట్లు కొట్టిన చేతులు- ఆ చేతులలోంచి చేతనలోకి ఎంత అనుభూతి ప్రసరించింది అనేది ఆలోచించాలి. ప్రతి పర్వంలో ప్రతి వాక్యమూ కవితా పౌష్కల్యంతో ఉక్కిరి బిక్కిరవుతుంది. ‘‘మరణించి నదులు మాట్లాడతాయి/ మూసీ నదిలా/ మీసాలొస్తే గాలి తుఫానుగా మారుతుంది/ అతనితోపాటు అతని స్వప్నాలు కూడా / కాలుతున్న పరిమళం/ అతడు ఒక శతాబ్దంపై నిల్చున్న వీరుడు’’. అది ఆద్మ పర్వంలో వుంది. అసలు ఆద్మ పర్వం ఆనడమే కొత్త. సమాసాల వ్యాకరణ సూత్రాలు తెలిసిన శేషేంద్ర తన కవిత్వంలో సూత్రాలు భేదించుకొని పద ప్రయోగాలు చేస్తాడు.
వ్యాకరణాన్ని కాళ్లతో తొక్కగల సాహసం
మానవ జీవిత పొలాలు, పురాతన గొంతు, విశాల కిటికీ, కఠోర తుపాను, పురాతన అడవి ఇలా కావాలనే ప్రయోగిస్తాడు శేషేంద్ర. కారణం అభివక్తి అడ్డం వచ్చే వ్యాకరణాన్ని కాళ్లతో తొక్కగల సాహసం లేకపోతే... ‘శ్రీమన్మంగళ కల్కిమూర్తి పరిశుష్క్భిత ధర్మావనో / ద్దామక్షేత్ర పవిత్ర కీర్తి ఘన ధారా ఘోర ఖడ్గమ్మునన్ / భూమీ జీవ పరిశ్రమాహరణ సంభూతార్థ గర్వాంధులన్ / గ్రామ గ్రామ కబంధులన్ బిలిచి సత్కారంబుగావించుతన్... వంటి దీర్ఘ సమాసాలు గల పద్యాలు రాసిన కవికి, ఆద్మపర్వం వంటి పదాలు కొత్త అభివ్యక్తికోసమే.
కావ్య పరిభాషను ఇచ్చిన విలక్షణ కవి
శేషేంద్ర ప్రేమ కవిత్వంలోనూ, ఉద్యమస్ఫూర్తినందించే కవిత్వంలోనూ, అంతశ్చేతనను సృజించే కవిత్వంలోను అభివ్యక్తికి ప్రాధాన్యం ఇస్తాడు. కొత్త కొత్త ఉపమలు, కొంగ్రొత్త రూపకాలు పద చిత్రాలు ప్రయోగిస్తాడు. సూర్యుడు, సముద్రాల మీద వంగి/ నీళ్లు తాగే గుర్రం / ఆకాశం నగరాల మీది వంగి గర్జించే సింహం/ భూమి శూన్యంలో తిరిగే బొంగరం / జీవితం మనం అడగకుండా వచ్చిన సంగరం... ఆశ్చర్యం కలిగించే కావ్య పరిభాషను ఈ శతాబ్దానికి ఇచ్చిన విలక్షణమైన కవిగా శేషేంద్ర మిగులుతారు.
(గుంటూరు శేషేంద్రశర్మ శతజయంతి సందర్భంగా)
(1988 విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి ఆకాశవాణి విజయవాడ వారి సౌజన్యంతో)
-డా . రాళ్లబండి కవితాప్రసాద్
విద్వత్కవి, అవధాని, విద్వాంసులు