తెలంగాణ బచావో అనరెందుకు?

When cpi parties question anti popular movements in telangana

Update: 2023-05-19 00:45 GMT

ల్లెపల్లెకు సీపీఐ, ప్రజల వద్దకు సీపీఐ, ప్రజాచైతన్య యాత్ర పేరుతో ఏప్రిల్ 16 నుండి తలపెట్టిన యాత్ర ఉమ్మడి కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో మొత్తం 74 మండల కేంద్రాల్లో కొనసాగి మే 15న విజయవంతంగా ముగిసింది. అయితే ఈ సభలో ప్రకటించిన భారీ ఆశయాలు ఏ మేరకు అమలవుతాయో చూడాలి. ఒకవైపు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, కులం మతం, వర్గం, వివక్ష వంటి అరాచక పాలన నుండి దేశాన్ని పరిరక్షించాలని సీపీఐ నినాదం ఇస్తుంది. అందుకే బీజేపీ పార్టీ నుండి ఏర్పడిన ప్రమాదాన్ని అరికట్టడానికి సీపీఐ రాష్ట్రంలో బీఆర్ఎస్ తో జత కట్టినట్టు గతంలో తెలియజేసింది. ఆ పార్టీతో అవసరమైన మేరకు సహకరించుకోవడం ద్వారా దేశాన్ని మతతత్వ పార్టీ నుంచి కాపాడుకోవడమే లక్ష్యమని పేర్కొంది. అయితే బీఆర్ఎస్ పార్టీ గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఇచ్చిన హామీలను మరిచిపోవడంతో పాటు, ప్రజలను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య హక్కులను అపహాస్యం చేయడం, నియంతృత్వ నిరంకుశ ధోరణిలో వ్యవహరించడం, వారిని ఎదిరించిన వారిని నిర్బంధించి ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ ఎందుకు ప్రశ్నించలేదు? బీజేపీ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలుగా 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ధరణి ద్వారా భూ సమస్యలు మరింత జటిలమైతే, నిర్బంధ అణచివేత విధానాలతో ధర్నా చౌక్‌ను మూసివేస్తే, ఇచ్చిన హామీలు పక్కదారి పడితే సీపీఐ మౌనంగా చూస్తూ ఉన్నది కానీ ఏనాడు ప్రశ్నించలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఉపఎన్నికలలో ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్ర పరిపాలనను పక్కకు పెట్టి ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటే సీపీఐ ఏనాడైనా ప్రశ్నించిందా? పనిచేయని కాలానికి మంత్రులు వేతనం తీసుకుంటే ఎందుకు ప్రతిఘటించలేదు?

పెద్దదొంగ కోసం చిన్నదొంగతో సావాసమా?

కేంద్ర ప్రభుత్వ దమనకాండ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వీర్యం, గుజరాత్‌లో జరుగుతున్న మారణకాండ, లాకప్ డెత్‌లు, అత్యాచారాలు ఏవైతేనేమి అన్నీ బీజేపీ కనుసన్నుల్లో జరుగుతున్నాయని సీపీఐతో పాటు అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుని నడ్డి విరుస్తుంటే, జీఎస్టీ పన్నుల భారం సగటు మనిషిపై అన్ని రకాలుగా పడుతుంటే ఈ దేశంలో సామాన్యునికి కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమిటో ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలి. దేశ సంపదలో 40 శాతం పైగా డబ్బు ప్రధాని మోడీ వచ్చిన తర్వాత సంపన్న వర్గాల జేబుల్లోకి పోయిందని అదానీ, అంబానీ లాంటి వారు రోజుకు 1000 కోట్లు ఆర్జిస్తున్నారంటే ఈ దేశంలో రాజ్యాంగం అమలు కావడం లేదా? అని ప్రశ్నించుకోవాలి. గత తొమ్మిది ఏళ్లలో కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయల రాయితీలు, రద్దులు ప్రకటించి, సామాన్య ప్రజలకు ఉచిత దొడ్డు బియ్యంతో సరిపెట్టడంపై దేశంలో వివక్షత ఏ స్థాయిలో కొనసాగుతున్నదో అర్థం చేయించాలి. విద్య, వైద్యం, సామాజిక న్యాయం, ప్రభుత్వ రంగంలో కొనసాగే బదులు కార్పొరేట్ సంస్థల చేతిలో శల్యమైపోతుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వామపక్షాలు ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? కేవలం సభలతో, సమావేశాలతో విమర్శలతో కాలయాపన చేసే బదులు ప్రజా ఉద్యమాన్ని ఉధృతంగా చేసినప్పుడు మాత్రమే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఆ చైతన్యాన్ని, సామాజిక స్ఫూర్తిని, సామాజిక వారసత్వాన్ని ఇవ్వాల్సినటువంటి సీపీఐ మిగతా కమ్యూనిస్టు పార్టీలతో జతకట్టి బహుళస్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించినప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలైనా, 57 సంవత్సరాల పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు, టీఎస్‌పీఎస్సీ లీకేజీ అంశంపైన వామపక్షాలు ఏనాడు నోరు మొదపలేదు. పేదల భూ పంపిణీ చేసే కార్యక్రమాన్ని, పేదరిక నిర్మూలన పైనా, ప్రభుత్వ భూములకు కార్పొరేట్ సంస్థలకు ఇష్టారాజ్యంగా ధారాదత్తం చేయడంపై సీపీఐ ఏనాడైనా ఎండగట్టిందా? బీజేపీ పార్టీ నుంచి దేశాన్ని రక్షించడం కోసం బీఆర్ఎస్‌తో జతకడతామని చెప్పడం వామపక్షాల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం కాదా? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి లక్షలాది ఎకరాల భూమిని ప్రజలకు పంపిణీ చేసి మూడువేల గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలను స్థాపించినటువంటి చైతన్యం ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ సాంప్రదాయ పద్ధతిలో కేవలం డబ్బుల పంపిణీ ప్రభుత్వం అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీతో జతకట్టడం అంటే హాస్యాస్పదం కాదా? దీనివల్ల కమ్యూనిస్టు కార్యకర్తలు వామపక్ష పార్టీలకు దూరమవుతున్న విషయాన్ని అధినాయకత్వం ఏనాడైనా ఆలోచించిందా? జాతీయ స్థాయిలో సీపీఐ ఏనాడైనా పోరాట కార్యక్రమం నిర్వహించిందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలోని డొల్లతనాన్ని ప్రశ్నించకపోగా, పెద్ద దొంగను పట్టుకోవడానికి చిన్నదొంగతో సహవాసం చేయడం తప్పదు అని సమర్థించుకుంటారా?

మీ పార్టీ విధానమేమిటి?

నిజానికి కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ, ఒక రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భర్తీలు, పేదరిక నిర్మూలన, ప్రజా వ్యతిరేక విధానాలు, హామీలు అమలు చేయకపోవడంపై, విద్య, వైద్యాన్ని గాలికి వదిలేయడం, సెక్రటేరియట్ నిర్మాణ సమయంలో ప్రతిపక్షాల సలహా తీసుకోకపోవడం, ప్రభుత్వ భూముల అమ్మకంపై, పాలకులు సంక్షేమం పేరుతో తమ జేబు నుంచి డబ్బులు ఇస్తున్నట్టు డాంభికాలు పలకడంపై సీపీఐ పార్టీ కఠిన వైఖరి అవలంబించడంతోపాటు పార్టీ ఎజెండాలో కూడా అవి పొందుపరిస్తేనే పార్టీ కార్యకర్తలను పెంచుకొని పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి, భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి, ప్రజా ఉద్యమాలు నిర్మించుకోవడానికి, ప్రజలతో నిత్యం మమేకం కావడానికి అవకాశం ఉంటుంది. అంతే కానీ అధికార పార్టీలతో జతకడితే భవిష్యత్తు శూన్యమే అని గుర్తిస్తే మంచిది. తెలంగాణ సాయుధ పోరాటం నడిపి ఈ దేశంలో స్వాతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవం మీకు ఉన్నప్పటికీ, ప్రజావ్యతిరేక ప్రభుత్వాలతో జతకట్టడం మీ యొక్క వైఫల్యానికి నిదర్శనం కాదా? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పైన నిక్కచ్చిగా వ్యవహరించి వెంటనే ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి కార్యాచరణను ప్రకటించాలి. అధికారం కోసం, అక్రమార్జన కోసం, అధికార పార్టీల మెప్పుకోసం కాకుండా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం కోసం మాత్రమే మీ ఉద్యమ శంఖారావం పూరించాలని ఇది దేశంలో అందరికీ స్ఫూర్తి కావాలని మనసారా కోరుకుంటూ ....

వడ్డేపల్లి మల్లేశం

సామాజిక, రాజకీయ విశ్లేషకుడు

90142 06412

Tags:    

Similar News