ఉన్నది ఉన్నట్టు: ప్రజలు చేసిన పాపమేంటి?

unnadi unnattu

Update: 2022-03-16 18:45 GMT

ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యం మనది. 'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే కేంద్రంగా' ఇలాంటి మాటలను మన రాజకీయ నేతలు చాలా గొప్పగా వల్లె వేస్తుంటారు. భారీ లెక్చర్లే ఇస్తుంటారు. ఆచరణలో మాత్రం దానికి తూట్లు పొడుస్తారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే తంతు. చట్టసభలలో ప్రతిపక్షం ఉంటేనే సమర్థవంతమైన చర్చలు జరుగుతాయి.. ప్రతిపక్షాలు లేకుంటే ఆ సభ సంపూర్ణం కాదు. ఈ మాటలూ వినిపిస్తూ ఉంటాయి. నిజమే. అదంతా మాటల వరకే. ప్రశ్నించే ప్రజలను, నేతలను పక్కన పెట్టడం నయా పొలిటికల్ ట్రెండ్. తాజాగా రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో అదే జరిగింది. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. మొత్తం సెషన్‌‌కే వారు హాజరుకాలేకపోయారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలోని ప్రజల సమస్యల సంగతేంటి? వాటికి ప్రభుత్వం చెప్పే పరిష్కారం ఏమిటి? వీటిని ప్రస్తావించే అవకాశమే లేకుండా పోయింది.

ఫలితంగా ప్రజల సమస్యలు 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న తరహాలో మిగిలిపోయాయి. ఒకవైపు ప్రశ్నించడం, నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని గొప్పగా చెబుతూనే వాటిని అణచివేసే చర్యలు అమలవుతున్నాయి. సభ నుంచి ముగ్గురిని గెంటేయడం ద్వారా దాదాపు పది లక్షల మంది ప్రజలను సమాజం నుంచి వెలి వేసినట్లయింది. వారిని గుర్తించడానికి నిరాకరించినట్లయింది. అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయకపోవడమే వారు చేసిన నేరమా? మరో పార్టీకి ఓటు వేస్తే వారి సమస్యలు, బాధలు ప్రభుత్వానికి పట్టవా? వారిని ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలు వారి తరఫున చట్టసభలలో గొంతు విప్పాలన్న బాధ్యతను కట్టబెట్టారు. కారణాలేవైనా స్పీకర్ సస్పెన్షన్‌తో వారికి ఆ అవకాశం లేకుండాపోయింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రజల గొంతు వినిపించకుండా పోయింది.

అప్పుడు మీరూ చేశారుగా!

ఆ ప్రజలు చేసుకున్న పాపమేంటి? వారు చేసిన నేరమేంటి? చివరకు బాధితులుగా మిగిలిపోయారు. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులే సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ సభలో ఏకరువు పెడుతున్నారు. బడ్జెట్ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌లో అన్నీ ఇలాంటి ఫిర్యాదులు, విజ్ఞప్తులే. మంత్రులు 'నోట్ చేసుకున్నాం అధ్యక్షా'తో సరిపెడుతున్నారు. ఇలాంటప్పుడు విపక్షాల సభ్యుల నియోజకవర్గాలలో సమస్యలు ఏంటో ప్రభుత్వానికి తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. వీటిని పరిష్కరించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకున్నది. కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా ప్రతిపక్షాల పట్ల వివక్ష అక్షర సత్యం. స్వయంగా ముఖ్యమంత్రే ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు.

తెలంగాణ పట్ల కేంద్రం వివక్షగా వ్యవహరిస్తున్నదంటూ విమర్శలే చేశారు. సభా నియమాలకు విరుద్ధంగా వెల్‌లోకి దూసుకొచ్చినందుకు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ నిర్ణయాన్ని మంత్రి హరీశ్‌రావు సమర్ధించారు. అది సమంజసమైన కారణమే అయితే వెల్‌లోకి రాకుండా కుర్చీలకే పరిమితమైన మరో ఇద్దరిపై ఎందుకు వేటు వేసినట్లు? వెల్‌లోకి రావడం నిబంధనల ఉల్లంఘన అని తెలిసినా టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభ వెల్‌లోకి ఎందుకు దూసుకెళ్లినట్లు? ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను ఉల్లంఘించారనుకోవాలా? తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా సమైక్య రాష్ట్ర అసెంబ్లీలో బల్లలు ఎక్కడం, గవర్నర్ చేతిలోని స్పీచ్ కాపీని చించేయడం, ఆయన కుర్చీని లాగేయడం జరిగింది నిజమే కదా!

మాటలు వేరు, చేతలు వేరు

ఇవి చేయడం వల్లనే తెలంగాణ ఏర్పడిందంటూ ఓ మంత్రి సభా వేదికగానే సమర్థించుకున్నారు. ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రే నిర్మాణాత్మక చర్చలు జరగాలని నొక్కి చెబుతున్నారు. 'బడ్జెట్ అద్భుతంగా ఉందని అధికార పార్టీ చెప్పుకుంటుంది. పస లేనిదని, పనికిమాలినదని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ఇవి సహజం. కానీ, ప్రజాస్వామ్యం పరిణతి చెందే క్రమంలో చట్టసభలలో జరగాల్సిన చర్చల సరళి మారాలి. రాజకీయాలలోకి కొత్తగా ఎంటర్ అయ్యే యువ నాయకత్వానికి ఇది చాలా ఉపయోగం. విస్తృత స్థాయి చర్చలు జరిగితేనే మంచి ఫలితాలు ఉంటాయి' అని ముగింపు ఉపన్యాసంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు. మాటలకూ చేతలకూ పొంతన ఉండడంలేదు.

నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుకు ప్రత్యేక స్థానమే ఉన్నది.దురదృష్టవశాత్తూ పాలకులను ప్రశ్నించడం నేరంగా మారుతున్నది. ప్రశ్నించడాన్ని, నిలదీయడాన్ని అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పొగడ్తలకు అలవాటుపడ్డారు. అందుకే తాజా సమావేశాలలోనూ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రిని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కీర్తించారు. ఎంత ఎక్కువగా పొగిడితే అన్ని బెటర్ అవకాశాలు, ప్రమోషన్ వస్తుందనే సాధారణ అభిప్రాయం నెలకొన్నది. పోటీపడి మరీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రశ్నిస్తే మైక్ కట్ అవుతుంది. ఒక్కసారిగా అధికార ఎమ్మెల్యేలు విరుచుకుపడతారు.

ప్రతిపక్షాల బాధ్యత ఎక్కడ?

చట్టసభలలోనే కాదు, బైట కూడా ఇదే జరుగుతున్నది. నిరసనలకు అవకాశమే లేకుండా పోయింది. బలమైన ప్రతిపక్షం లేకుండా పాలక పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. రకరకాల ప్రలోభాలతో వారిని చేర్చేసుకుంటున్నాయి. వీలైనంతగా బలహీనం చేయాలనుకుంటున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అదే జరుగుతున్నది. అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా జరగాలని అధికార పార్టీ కోరుకుంటున్నది. అందుకే పాలకులలో జవాబుదారీతనం కొరవడింది. విధానాల అమలులో పారదర్శకత లోపించింది. ఒకవైపు రాజ్యాంగాన్ని రీ రైట్ చేయాలని సీఎం బలంగా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చట్టసభలలో నిర్ణయాలు జరుగుతున్నాయి.

ప్రతిపక్షాలు లేని సభ సంపూర్ణం కాదని రాష్ట్రపతి మొదలు సీనియర్ పార్లమెంటేరియన్‌లు గొంతు చించుకుంటున్నారు. నిర్మాణాత్మకంగా చర్చలు జరగాలని ప్రతిపక్షాలకు ఆహ్వానం పలుకుతున్నారు. పాలకులు మాత్రం ప్రతిపక్షమే లేని ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. దాన్ని ఒక నేరంగా భావిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ వైఫల్యాలను, విధానాల అమలులోని లోపాలను సభ ద్వారా పాలకుల దృష్టికి తీసుకెళ్ళడం ప్రతిపక్షాల బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చే అవకాశం కల్పించడం లేదు.

ఆచరణ అంతా భిన్నం

'ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా ముఖ్యం. అది ఎంత సమర్థవంతంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది. అది లేనప్పుడు ప్రజాస్వామ్యంలో పెడధోరణులు ప్రబలుతాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు సహజం. అయినా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా కలిసి పనిచేయాలి. ఇంతటి ప్రాధాన్యం ఉన్నది కాబట్టే రాజ్యాంగంలో దీనిని పొందుపరిచారు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చుగానీ ప్రజా ప్రయోజనాలకు, వారి శ్రేయస్సు మాత్రమే లక్ష్యంగా ఉండాలి.

అందుకే తరచూ మనం ఆరోగ్యకరమైన పోటీ అని చెప్పుకుంటూ ఉంటాం' అని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. 'పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాన్ని కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. అందుకే ఆ స్వభావాన్ని పార్టీలు కోల్పోకుండా చూసుకోవాలి' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెలవిచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా చివరకు చట్టసభలలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతున్నది. స్వల్ప తేడాలు ఉండొచ్చు. అధికారాన్ని హోదాగానే పాలక పార్టీలు భావిస్తున్నాయి. దాన్ని బాధ్యత అని పైకి చెబుతున్నా ఆచరణ మాత్రం అందుకు భిన్నం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. అధికారాన్ని అప్పగించేదీ, గద్దె దించేదీ వారే. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం.


ఎన్. విశ్వనాథ్

99714 82403

Tags:    

Similar News