విద్యాకల్పనలో ఈ వివక్ష ఏంటి?
ఆధునిక యుగారంభంలో యూరప్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవ ఫలితాలతో మిగులు ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఆసియా, ఆఫ్రికా దేశాలకు
ఆధునిక యుగారంభంలో యూరప్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవ ఫలితాలతో మిగులు ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఆసియా, ఆఫ్రికా దేశాలకు వచ్చిన యూరోపియన్లు, మనదేశంలో కూడా వలస రాజ్యాలు స్థాపించుకొని వ్యాపార, రాజ్యపాలనతో పాటు ఆంగ్ల విద్యను పరిచయం చేసినా, ఆంగ్లేయులు ఎక్కడ కూడా విద్యా సౌకర్య సదుపాయాలలో ఎలాంటి కుల, మత వివక్ష చూపలేదు. కానీ 1990 దశకంలో ఆంక్షలు లేని ప్రపంచ వాణిజ్యాన్ని ఏర్పర్చాలనే తలంపుతో తెచ్చిన డంకెల్ ప్రతిపాదనలను 1994లో మనదేశం అంగీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు స్వేచ్ఛ, వ్యాపార, వాణిజ్య విధానాలు ఏర్పడి ఉత్పత్తి రంగంతో పాటు విద్య కూడా లాభాలను ఆర్జించే ఒక వ్యాపార సరుకుగా మారడం ఆరంభమైంది.
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక ఉత్పత్తి, వ్యాపార, వాణిజ్య, సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి విద్యారంగంలో ప్రవేటు విద్యాసంస్థల ప్రవేశం వేగవంతం కావడంతో ప్రభుత్వ పాఠశాలలు తీవ్రమైన పోటీని ఎదుర్కోవడం, సరిగ్గా ఇక్కడే కామన్ స్కూల్ విధానం పటిష్టం చేయాల్సిన సందర్భంలో కులాల పేరుతో ప్రత్యేక గురు'కుల' పాఠశాలల ఏర్పాటుకు పూనుకున్నారు. ఇవి మొదట్లో మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ రాను రాను ఇవే ఒక ఆధునిక 'విద్యా వివక్ష' ప్రతిరూప కేంద్రాలుగా రూపాంతరం చెందడం ఆక్షేపణీయం.
సౌకర్యాల లేమిలో కూడా..
రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల అధ్వర్యంలో కులం, మతం ఆధారంగా దాదాపు వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. పేద పిల్లలకు ప్రత్యేక అవకాశాలు కల్పించడాన్ని ఎవరు కాదనరు.. కానీ కులం, మతం ఆధారంగా సౌకర్యాలు కల్పించడం ఏ మేరకు సమానత్వం సాధించడానికి దోహదం చేస్తుందనేదే ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలపై, గురుకులాల్లో చదివే పిల్లలపై వెచ్చిస్తున్న ఖర్చులో భారీ వ్యత్యాసం ఉన్నది. పెరిగిన ధరల అధారంగా గురుకులాల్లో చదివే విద్యార్థిపై సంవత్సరానికి లక్ష అరవై వేల రూపాయలు ఖర్చుచేస్తుండగా, సాధారణ పాఠశాలల్లో చదివే విద్యార్థిపై కేవలం యాభై వేలు మాత్రమే ఖర్చుచేస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే గురుకులాల్లో చదివే పిల్లల కంటే, సాధారణ పాఠశాలల్లో చదివే పిల్లల కుటుంబాలు మరింత వెనుకబడిన నిరక్షరాస్యతా కుటుంబాలే అనేవి అంగీకరించాలి. సకల సౌకర్యాలు ఒక వైపుంటే సౌకర్యాల లేమిలో కూడా వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. కొన్ని పాఠశాలలు 10/10 జీపీఏతో పాటు 100 శాతం ఉత్తీర్ణతతో గురుకుల పాఠశాల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇలాంటి పాఠశాలల విద్యార్థులకు గత నెల రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానం చేయడం ఎంతో అభినందనీయం.
గురుకుల విద్యార్థులతో పోల్చితే..
కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం, గడచినా మూడేళ్లలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు (4,41,559) గణనీయంగా పడిపోయి ప్రవేటు బడుల్లో దాదాపు ఏడు లక్షల నమోదు పెరిగిందని ప్రకటించింది. ఇది ప్రభుత్వ విద్యపై ప్రమాద ఘంటికలను సూచిస్తున్నది. మరొకవైపు ప్రచారంలో ఎంత కృత్రిమ డిమాండ్ సృష్టించినా, వివిధ సంక్షేమ గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 1,34,174 ఖాళీలు మిగిలిపోయినవి. వీరిపై చేస్తున్న ఖర్చు మిగిల్చే అవకాశం లేకపోవడంతో ప్రయోజనం లేకుండానే 2,147 కోట్ల వ్యయం వృధా అయినట్టయింది. విద్యా సౌకర్యాలలో అధునాతన భవనాలు ఒకవైపు, మరుగుదొడ్లకు వెతికే స్థితి మరోవైపు, మూడు పూటల పౌష్టికాహారం ఒకవైపు ఒకపూట భోజనం మరోవైపు,కాస్మోటిక్ చార్జీలు, బూట్లు, టై బ్యాగులు ఒకవైపు, తలనూనె లేని చింపిరిజుట్టు, తెగిపోయిన స్లిప్పర్లు, చినిగిపోయిన బ్యాగులు మరోవైపు, ఇరవైనాలుగు గంటలూ ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఒకవైపు, ఎనిమిది గంటల పాఠశాలలు మరోవైపు.. ఇలా సాధారణ పాఠశాలల్లో చదివే విద్యార్థులను, గురుకులాల్లో చదివే విద్యార్థులతో పోల్చితే అధికారిక వివక్షకు గురికాబడుతున్నారు.
కులవివక్ష కనుమరుగవుతున్న సమయంలో..
కులవివక్ష భౌతికంగా అమలవుతున్నప్పుడు కూడా ఆంగ్లేయుల పాలనా కాలంలో విద్యా సౌకర్యాలలో వివక్షలేదు. అలాంటిది ఆధునిక కాలంలో కుల వివక్ష భౌతికంగా కనుమరుగు అవుతున్నపుడు విద్యాసౌకర్యాల కల్పనలో అధికారిక వివక్షను వికసింపచేసి, స్థిరపరచడం సమాజానికి ఆమోదయోగ్య పరిణామం కాదు. రాజ్యాంగంలోని అర్టికల్ 45 ప్రకారం కనీసం పదవతరగతి వరకు నిర్బంధ ఉచిత, అంతరాలులేని ఆధునిక విద్యను కులమతాలకు అతీతంగా అందరికి సమానంగా అందించడం ప్రభుత్వ విధిగా ఉండాలి. అప్పుడే సమాజంలో అంతరాలు కుదించబడి నవసమాజం వికసితమౌతుంది. ప్రభుత్వ చల్లని దీవెనలకు ఆతృత పడే వారి సలహాలతో పాటు ముంచుకొచ్చే ముప్పును ముందుగానే హెచ్చరించే వారి సూచనలను ముందుగా పరిగణలోకి తీసుకుని విద్యా ప్రణాళికలు తయారుచేసి అమలు చేసినపుడే వివక్ష లేని ఆధునిక సమాజ నిర్మాణం కోసం చేసిన విద్యావ్యయ ఫలితాలు ఫలప్రదమౌతాయి.
మామిడి నారాయణ
సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ పౌండేషన్
94410 66032