తెలంగాణ గీతాన్ని ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటి?

తెలంగాణ మలిదశ పోరాట ఉద్యమ కాలంలో ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే గీతం భూమి పుత్రుడు, సహజ కవి

Update: 2024-05-31 01:00 GMT

తెలంగాణ మలిదశ పోరాట ఉద్యమ కాలంలో ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే గీతం భూమి పుత్రుడు, సహజ కవి, డా. అందెశ్రీ హృదయాంతరంగం నుండి తన్నుకువచ్చిన గీతం. అది ఆయన మధుర, గంభీర స్వరంతో అలవోకగా తనదైన సహజ బాణీతో రూపుదిద్దుకున్న పాట. ఆ గీతం అతి సహజంగా మధురంగా పురుడు పోసుకుంది. ప్రొ.జయశంకర్, ప్రొ.హరగోపాల్, ప్రొ.కోదండరాం, కేసీఆర్ హృదయాలను కదిలించిన గీతం అది. వారితో పాటు కోట్లాది ఉద్యమకారుల నాల్కలపై నడయాడిన గీతం. ఆ గీతం ఉద్యమకారులను ఉర్రూతలూగించింది. అప్పుడు కట్టిన సంగీతపు బాణీ, చాలా గొప్పగా వచ్చింది. దానికి కీరవాణి కొత్తగా నగిషీలు చెక్కవలసిన పనిలేదు.

తెలంగాణ చరిత్ర, మాట, పాట, సంగీతం, సంస్కృతిని ప్రతిబింబించే అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని సినిమా పాట స్థాయికి తెచ్చి కీరవాణితో పాట బాణీని మార్చే ప్రయత్నం చేయొద్దు. ఈ పాట ఉద్యమనేతలు, మేధావులను కదిలించడమే కాకుండా కోట్లాది ఉద్యమ కారుల నాల్కలపై నడయాడిన గీతం అది. ఆ గీతం ఉద్యమ కారులను ఉర్రూతలూగించింది. కేసీఆర్ తప్పిదం వల్ల ఆ గీతం..గత పదేళ్ళలో రాష్ట్ర గీతంగా రూపుదిద్దుకోలేదు. అంతమాత్రం చేత ఆ గీతానికి విలువ లేదని కాదు.

రాష్ట్ర గీతం సినిమా పాట కాదే?

తెలంగాణ జాతీయ గీతంగా పేరు పడిన రాష్ట్ర గీతాన్ని, మాట, భావం, బాణీ, చరిత్ర, సంస్కృతికి ప్రతీకైన గీతాన్ని మార్చటం కోట్లాది తెలంగాణ ప్రజల హృదయాలను గాయం చేస్తుంది. ఆ గీతం సృష్టికర్త, కవిగా ఆ పాట గేయంపై డా. అందెశ్రీకి అన్ని హక్కులూ ఉన్నాయి. దానిని ఎవరూ కాదనడం లేదు. కానీ కేవలం కేసీఆర్‌పై వ్యక్తిగత కోపంతో ఆ రాష్ట్ర గీతానికి అవమానం చేయవద్దని మనవి. కీరవాణి గొప్ప సినీ సంగీత దర్శకుడు. ఆయనను అభిమానించని తెలుగు వారు లేరు. ఆయన తెలుగు పాటకు చక్కటి సంగీతం సమకూర్చి ఎన్నో పాటలను సంగీత ప్రియులకు దగ్గర చేశారు. ప్రపంచ స్థాయిలో తెలుగు పాటకు మొదటిసారి ఆస్కార్ అవార్డు సాధించి పెట్టిన ఘనుడు ఆయన. ఆయన మన తెలుగు వారి కీర్తి కిరీటం. ఆయన శక్తి సామర్ధ్యాలను ఎవరూ శంకించడం లేదు. కానీ ఇది సినిమా పాట కాదు.

సహజ నడకను మార్చొద్దు..!

ఈ రాష్ట్ర గీతం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భావోద్వేగాలకు సంబంధించినది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకుని ఉండి ఉంటే బాగుండేది. తద్వారా ఆయన కోట్లాది తెలంగాణా ప్రజల హృదయాలలో ఉన్న ప్రేమను గౌరవాన్ని నిలుపుకున్నట్లు అవుతుంది. ఉద్యమ కాలంలో స్థిరంగా ముద్రపడిన రాష్ట్ర గీతాన్ని కృత్రిమ బాణీలతో దిగజార్చవద్దు. మీ చర్యతో రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి, మెలిసి ఉన్న తెలుగువారి మధ్య మరో అఘాతం సృష్టించకండి. మీ చరిత్రను తెలంగాణలో మీకు మీరు కళంకితం చేసుకోకండి.

ఆ గీతాన్ని యధాతథంగా ఉండనివ్వండి. మీ కొత్త సొబగులు, నగిషీలు అవసరం లేదు. దాని బాణీ సహజమైనది. మీ రంగులు, హంగులు అవసరం లేదు. అది ఉద్యమకాలంలో జనులంతా ఆబాలగోపాలం సొంతం చేసుకున్న ప్రార్ధనా గీతం. తెలంగాణలో కాళోజీ, గద్దర్, విమలక్క, గోరేటి వెంకన్న, రసమయి బాలకిషన్, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, వరంగల్ శ్రీనివాస్, అంతడుపుల నాగరాజు మొదలైన కవులకు, కళాకారులకు కొదువ లేదు. మీరు తగుదునమ్మా అంటూ జీవనదిలా సహజ నడకతో సాగిపోయే మా బతుకు చిత్రంలో వేలు పెట్టి, మా తెలంగాణ చరిత్రను, సాహిత్య, సంగీతాన్ని మార్చవలసిన అవసరం లేదు.

ఉద్యమ పాటకు కళంకమా?

ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా పోరాటం చేశారు. ఇప్పుడు కేసీఆర్ పై కోపంతో తెలంగాణ చరిత్రకు, ఉద్యమానికి, సంగీత, సాహిత్యానికి చెడు చేస్తే...పాటకు కొత్త బాణీ కట్టడాన్ని అడ్డుకోకపోతే ప్రొ. కోదండరామ్‌తో సహా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. డా.అందె శ్రీ మరోసారి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ నుండి పుట్టిన పాట, మీ గళంలో భాస్వరంలా వెలిగి నిలిచిన పాట తెలంగాణ జన జీవితంలో భాగమైంది. ప్రజల హృదయాలలో నాటుకుపోయింది. ప్రజల నాలుకలపై నాట్యమాడింది. అలాంటి రాష్ట్ర గీతాన్ని ఎవరిపైనో కోపంతో కళంకితం చేయకండి. చరిత్ర క్షమించదు. భావితరాలు హర్షించరు.

డా. కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Tags:    

Similar News