మానవీయ విలువల పరిమళం ఈదుల్ ఫితర్
మానవీయ విలువల పరిమళం ఈదుల్ ఫితర్... What is RamaZan and Why Do Muslims Fast During RamaZan
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకునే పండుగ ఈదుల్ ఫితర్. ఇదే రమాజాన్. ఈద్ అంటే పండుగ.. ఫితర్ అంటే దానం.. వెరసి ఇది దానధర్మాల పండుగ. అందుకే ఈ నెలలో ముస్లిం సోదరులు దానధర్మాలు చేయడానికి ప్రయత్నిస్తారు. సదఖా.. ఖైరాత్ .. జకాత్ .. ఫిత్రా పేర్లతో పేదలకు ఎంతో కొంత సహాయం చెయ్యాలని ప్రయత్నిస్తుంటారు. మానవులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తిగతంగానో, సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు అంతరంగం ఆనందంతో పులకించడం సహజం. ముస్లిం సోదరులు జరుపుకునే ‘ఈద్’ కూడా అలాంటి సందర్భమే. రమజాన్ నెలతో దీనికి సంబంధం ఉండడంతో అదే పేరుతో ప్రసిద్ధిగాంచింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదో నెల పేరు. దీనికంతటికి ప్రత్యేకత ప్రాప్తం కావడానికి కారణం పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించడం. మానవజాతికి వెలుగును, జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్య జ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగా దీనికింతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి.
మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే 'రోజా' (ఉపవాస వ్రతం) అనే గొప్ప ఆరాధనను సైతం దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జన హృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసుపోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహన శక్తి పెరిగి జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సద్గుణాలు అలవడతాయి. స్థితి పరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా ఎన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజెసే ఏర్పాటు చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా రమజాన్ నెల ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. రమజాన్ మాసాంతంలో ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజుకు వెళతారు. ఆరోజు దైవం తన భక్తులకు నెలరోజుల సత్కార్యాలకు అనంతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ‘ఈద్’ దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం. తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయబోమని, సత్యమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపుకు మరలాలి.
ఒక విషయం సత్యమని తెలిసినా దానికనుగుణంగా తమ జీవితాలను మలచుకోవడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదన్న విషయం ఎంత సత్యమో, ఈ అశాశ్విత దేహం నుండి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో తెలియదన్నది కూడా సత్యం. అందుకే ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతం కావాలి. జరిగిన తప్పుల్ని సవరించుకొని రుజుమార్గం పైకి రావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ నెల్లాళ్ళు ఎంతటి నియమనిష్టలతో గడిపారో ఇకముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఈ విధంగా నెల్లాళ్ళ పాటు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, రంజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు ఈద్ రోజున దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటారు.
పండుగ రోజు వేకువ జామునే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజ్ చేస్తారు. అందరూ ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేస్తారు. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ చేస్తారు. సమస్త మానవాళి సుఖ సంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వ్యాధుల బారి నుంచి, అప్పుల బారినుండి, శతృవు బారినుండి, దుష్ట పాలకులు బారినుండి, కరువుకాటకాల నుండి, దారిద్ర్యం నుండి తమను, తమ దేశాన్ని, యావత్ భూ ప్రపంచాన్ని రక్షించమని, విశ్వ మానవాళి నంతటినీ కాపాడమని కడు దీనంగా విశ్వ ప్రభువును వేడుకుంటారు. ఈ విధంగా ఈదుల్ ఫితర్ పండుగ సమాజంలో ఒక చక్కని సుహృద్భావ పూర్వకమైన, ప్రేమపూరితమైన, సామరస్య కుసుమాలను వికసింపజేస్తుంది. మానవీయ విలువల పరిమళాన్ని వెదజల్లుతుంది. దైవభక్తిని, దైవభీతిని, బాధ్యత భావాన్ని, జవాబుదారీతనాన్ని జనింపజేస్తుంది. మానవులను ఉత్తములుగా, ఉన్నత మానవీయ గుణ సంపన్నులుగా తీర్చిదిద్దుతుంది. కనుక పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావిజీవితాలు సుఖసంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. ఒక చక్కని సుందర సమాజం ఆవిష్క్ళతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం.
(ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలతో...)
యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645