భయపడితే ఎలా?

Update: 2024-04-25 23:30 GMT

నేడేమైనా జరగనీ మిత్రమా

జయమో, అపజయమో

రేపొకటి వుందని..

గెలుపు వెలుగు చిమ్మే

చీకటిని మింగేస్తుందని

నువ్వెప్పుడూ మరువకు..!

అక్షరాలు తడబడకుండా

మహాకవుల మహా కావ్యాలు

ఎలా నిలబడ్డాయి

అడుగుల అలజడి లేకుండా

మండేలా ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడం

ఎలా సాధ్యమయ్యింది

అంకెల ఆరాటంపై రామానుజన్

ఆత్మవిశ్వాసపు ఆయుధం లేనిదే

అనంతంఎలా జవాబిచ్చింది

నీకు తెలియదా చెప్పు..

చిన్నప్పుడే చదివాం మనమంతా..!

ఎడిసన్ ఎదుగుదల

చరిత్రకే ఓ పాఠమయ్యింది.

గాంధీజీ ఉద్యమతీరు

పోరాటాలకు ఓ దిక్సూచయ్యింది.

అర్థం చేసుకోలేక ఐన్ స్టీన్ నే

పిచ్చోడంది ఈ సమాజం..!

ఆకలి మాట్లాడుతుంటే అంతరిక్షపు

జాబిల్లి అందుతుందా అంది ఓ సహచరం..!

గుర్తుపెట్టుకో..

ఎవ్వరి ఎగతాళి లేకుండా ఎవరెస్ట్

ఏనాడు తలొంచలేదు.

జీవితం ఎప్పుడూ ఓ పరీక్షే.

పారిపోవడం, చనిపోవడం

ఎప్పటికీ పరిష్కారం కాదు..!

ఫలితం ఏదైనాకానీ...

ప్రయత్నించు.. మళ్ళీ ప్రయత్నించు..!

ప్రపంచాన్ని పట్టించుకోకుండా

నీ గమ్యం చేరేవరకు ప్రయాణించు..!

నువ్వే.. నువ్వే.. భవిష్యత్

తరాలకు ఓ భానుడివి..!


- ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536


Similar News