రెండేళ్లుగా ఈ యుద్ధంతో ఏమి సాధించినట్లు?
What has been achieved with Ukraine - Russia war for two years?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏట ప్రవేశించింది. యుద్ధ నివారణకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దానికి తోడు రెండు దేశాలు పట్టు విడువడం లేదు. అటు రష్యా కానీ, ఇటు ఉక్రెయిన్ కానీ తగ్గడం లేదు. పరస్పరం దాడి చేసుకుంటూనే ఉన్నాయి. కానీ పౌరుల భద్రతను ఏ దేశం కూడా ఆలోచించడం లేదు. శాంతిని కోరుకునే ఐక్యరాజ్యసమితి సైతం చేతులు ఎత్తేసింది.
మీ విమానాలు మేం కూల్చాం, మీ క్షిపణులు మేం కూల్చాం అని రెండు దేశాలూ పరస్పర ప్రకటనలు గుప్పించుకుంటున్నాయి. రాజీ మార్గమేది కనపడటం లేదు. ఒక దశలో, రష్యా స్వాధీనం చేసుకున్న మా ప్రాంతాలు మాకు ఇస్తే యుద్ధం ఆగుతుంది అని ఉక్రెయిన్ అంటే, నాటో కూటమిలో లేను అనే భరోసా ఉక్రెయిన్ ఇస్తే యుద్ధం ఆపేస్తాం అని రష్యా ప్రకటించాయి. కానీ ఇవి కుదిరేవి కాదు. ఉక్రెయిన్‌కు అన్ని విధాలా సహాయం అందిస్తామని కెనడా, బ్రిటన్, అమెరికా ప్రకటించడంతో ఉక్రెయిన్ రెచ్చిపోతోంది. అమెరికా కూడా ఉక్రెయిన్‌కు ఆర్ధిక సహకారం అందిస్తూ యుద్దానికి పరోక్షంగా కారణమైంది. రష్యా, ఉక్రెయిన్ బలాబలాలు సమీక్షిస్తే రష్యానే బలంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాలు సహాయ సహకారాలు లేకపోతే రష్యాదే పైచేయి అయి ఉండేది.
మొత్తం చేసింది అమెరికానే
అమెరికా ఎప్పుడైతే ఉక్రెయిన్ పక్షం నిలిచిందో జెలెన్‌స్కీ ఉబ్బిపోయాడు. అదే అమెరికా చేసిన తప్పిదం. లేకపోతే ఉక్రెయిన్ కొంచెం ప్రతిఘటించినా సరే రష్యా అణచివేసేది. తద్వారా రష్యా అధీనంలో ఉక్రెయిన్ ఉండేది. సమస్య ఇంతవరకు వచ్చేది కాదు. అంటే ఉక్రెయిన్‌కి అమెరికా అండ పుష్కలం. దానికి తోడు జర్మనీ ఒక అడుగు ముందుకేసి ఉక్రెయిన్‌కు సహాయం అందిస్తూనే ఉంటాం అని చెప్పడం గమనార్హం. ఇలా పలు దేశాలు ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించాయి. ఈ పోరులో గెలుపు ఉక్రెయిన్‌దే అని పశ్చిమ దేశాలు చెప్పడంతో ఉక్రెయిన్‌కు ఊతం లభించినట్లు అయింది. అందుకే రష్యా తన బలాన్ని పెంచుకుంటోంది, కొత్త, కొత్త మిసైళ్లను తయారుచేస్తోంది. ఎన్ని మిసైళ్లను రష్యా తయారుచేసినా దీటుగా ఎదుర్కొనే శక్తి ఉక్రెయిన్‌కు ఉంది. ఆ దిశలోనే రష్యా నిఘా విమానం నేలమట్టం చేశాం అని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. అయితే రష్యాకు బాలిస్టిక్ క్షిపణులను సరఫరా చేసేందుకు ఇరాన్ విముఖత చూపింది.
శాంతి సాధనలో భారత్ కీలకం
ఇప్పటికే యుద్ధం ప్రారంభం అయి రెండేళ్లు పూర్తి అయి మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగేటట్లు ఉంది. ఇప్పటికే రెండు దేశాలు చాలావరకు నష్టపోయాయి. ఉక్రెయిన్‌కు అమెరికా సహాయ సహకారాలు అందిస్తున్నంత వరకు ఈ యుద్ధం ఆగదు. రష్యా, అమెరికా దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు అది తెలిసి అయినా శాంతికి, దేశాల భద్రతకు రెండు ముందుకు రావాలి. రష్యా, అమెరికా కలవాలి అంటే భారత్ మార్గం సుగమం చేయాలి. ఇంత యుద్ధం చేసి అటు రష్యా, ఇటు ఉక్రైన్ సాధించింది ఏమీ లేదు. రెండు దేశాల పౌరుల ఆగ్రహావేశాలు తప్పా. యుద్ధం ఆగి శాంతి నెలకొనాలి అని కోరుకుందాం.
కనుమ ఎల్లారెడ్డి,
అమెరికా
93915 23027