సర్కారు బడులకు ఎందుకీ పరిస్థితి?

నేను, మా బడికి వచ్చే సార్లను, మేడంలను ఏమైంది టీచర్ మన బడికి ఎక్కువ మంది పిల్లలు అత్తలేరు అని అడిగినా.. అంటే టీచర్

Update: 2024-06-12 01:00 GMT

నేను, మా బడికి వచ్చే సార్లను, మేడంలను ఏమైంది టీచర్ మన బడికి ఎక్కువ మంది పిల్లలు అత్తలేరు అని అడిగినా.. అంటే టీచర్, మన దగ్గరే అన్ని సౌలతులు ఉన్నయి కానీ ఈ జనాలకు అర్థం అయితలే, అందరూ ప్రైవేటు బడులెంట ఉరుకుతున్నరు, గట్ల ఉరికి ఉరికి ఆగమై, పైసలు పోగొట్టుకుంట్రు అన్నది. ఎందుకు టీచర్ మన ప్రభుత్వ బడులకు గీ పరిస్థితి అని అడిగితే..

ప్రతి సంవత్సరం పిల్లలు అత్తరేరని మేమే, బడిబాట పేరుతో.. మా బడికి మీ పిల్లల్ని ఎందుకు పంపుతలేరని పోరగాండ్ల అయ్యా, అవ్వలను అడిగితే ప్రైవేట్ బల్లే పట్టించుకున్నట్టు మీ సర్కారు బల్లే పిల్లని పట్టించుకోరు, మీ బడికి పోరగండ్లను పంపితే ఆగం అయితరు అంటుర్రు. అయినా సర్కార్ బల్లే ఇంగ్లీష్ మీడియం లేక పంప బుద్ది అయితలే అనబట్టిరి. అరే గిదేం కిరికిరి మా బల్లె పట్టించుకున్నట్టు ఎక్కడన్నా పట్టించుకుంటరా మా సార్లు, మేడంలు బాగా చదువుకున్నోళ్లు, మంచిగా పాఠాలు చెప్తరు. మా బల్లె ఆటలు పాటలు అన్ని ఉంటయి, ఇగ ఇంగ్లీష్ మీడియం ఎలాగూ ఉండనే ఉండే. పోరగాండ్లందరికి ఫ్రీగా బుక్స్ ఇత్తం, యూనిఫాం కూడా ఇయ్యవడితిమి, పగటి పూట మంచిగా బువ్వ పెడతాం. ఇంకేం కావాలి. అందరినీ మా బడికి పంపుమని చెప్పినా, చూడాలి మరి ఈసారన్నా పంపిస్తారో లేక ప్రైవేటుకే పంపుతరో.

ఊడ్చేటోల్లు, గంట కొట్టేటోల్లు లేరు

మా పెద్ద సార్‌తో ఈసారి ఎట్లనన్న చేసి మన బడికి ఫుల్‌గా పిల్లలు ఆచ్చేటట్లు చేయాలె సర్ అంటే, ఏం జేసుడో ఏమో.. బల్లె ఊడ్చటోళ్లు, గంట కొట్టేటోళ్లు లేరు. అన్ని సబ్జెక్టులకు సార్లు లేరు. ఎల్ల తెల్లదీసుడే ఉంది. ఇదివరకటి గవర్నమెంట్ కరెంట్ బిల్లు కట్టడానికి, చాక్పీస్ డస్టర్లలకు కూడా సరిగా పైసలు ఇయ్యకపాయే, జేబులకెళ్లి పెట్టుకుంటి ఎట్ల జేశుడో ఏమో అనబట్టే. ఇప్పుడున్న సర్కారోళ్లు జర మా పెద్ద సారుకు టెన్షన్ లేకుండా బడి మంచిగా నడిపేటట్లు చెయిర్రి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఎనుకటి కంటే ఇప్పుడు సర్కారు బల్లల్లో సౌలతులు మంచిగా అయినయి. లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు అన్ని పెట్టిర్రు. జనాలు కూడా జర సోచయించాలే గివన్ని ప్రైవేటులో ఉంటాయా? జర మీరే చెప్పుండ్రి. పుక్కిడి వస్తె జనాలకు నచ్చడం లేదోమో మరి. మంచిగా మా బడికి పంపక ఇదేందో ఏమో.

ప్రమోషన్ లేని బతుకులు

మేడంలు సార్లతో మాట్లాడితే ఈ నౌకరీ జేయబట్టి ఇరువై ఏండ్లు అయితుంది ఓ ప్రమోషన్ లేదు ఏం లేదు, అయినా ఇదే బల్లె 10 ఏండ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్ఫర్ కూడా లేదు. ఏం నౌకరో ఏమో అనిరి. ఇప్పటికన్నా ఇంకా మంచిగా మావోల్లు పనిచేస్తరు, మంచి రిజల్ట్స్ తెస్తరు, అందులో డౌట్ ఏ లేదు. ఈ సారి కూడా మన బడిలో టెన్త్ క్లాస్ ఓల్లు అందరూ పాస్ అయిండ్రు. 10 జీపీఏ లు కూడా వచ్చినయి, బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు వస్తయని పోరగాండ్లు ఫుల్ ఖుషీగా ఉన్నరు. అంతట్లకే మా ఎంఈఓ సర్ వచ్చే, 'ఈ బడి బాటేందో నా సావుకి వచ్చింది. ఒక్కొన్ని ఎనిమిది మండలాలు తిరుగాలే, ఏం తిరుగుడో ఏమో ఎప్పుడు ఎక్కడ ఉంటానో ఏం చేస్తానో నాకే తెలుస్తలేదు, ఏ బడిలో ఏ ఉందో ఏం లేదో కూడా నాకు తెలుస్తలేదు. అటు నా బడి సూస్కోవాలి ఇటు ఎనిమిది మండలాలకు నేనే ఇన్చార్జినీ ఎట్ల జెసుడో ఏమో ఈ టెన్షన్‌కె నాకు బీపీ, షుగర్ వచ్చినయి అయినా కూడా గోళీలు మింగుకుంటూ తిరుగుతున్న' అనబట్టే.

సర్కారు బడులు మంచిగా నడవాలంటే..

ఇవన్నీ విన్నంక నాకు అర్థమైంది మా స్కూల్‌కి పిల్లలెందుకు అత్త లేరో. ఇదివరకటి సర్కారు పట్టించుకోలే ఇప్పుడున్న సర్కారైన పట్టించుకోని బడులు మంచిగా నడుపడానికి పైసలు, ఊడ్చేటోల్లను, గంటకొట్టెటోల్లను ఇచ్చి, సరిపోయేంత టీచర్లు ఉండేటట్లు చేయాలి. మా సార్లకు మేడంలకు జర ప్రమోషన్ల ట్రాన్స్ఫర్ జేయుర్రి. పాపం గా ఏంఈఓ సార్లు ఎన్నని తిరుగుతరు, ఎక్కడోల్లకు అక్కడ ఇయ్యలే స్కూల్‌లను, సార్లను సూసుకోవడం. అందరం మనిషికో చేయి వేస్తే ఏదైనా చేయొచ్చు. అందరం గట్టిగా అనుకుంటే గవర్నమెంట్ బడులు మంచిగా నడుస్తయి. సర్కారీ బడి మంచిగా నడిస్తేనే బీద బిక్కి అందరూ బాగా సదువుకుంటరు.

పాకాల శంకర్ గౌడ్

98483 77734

Tags:    

Similar News