ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త కష్టం!ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందేనా

రాష్ట్రంలో దాదాపు 3.10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.63 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. సగటున నలుగురి చొప్పున లెక్కేస్తే వీరి మొత్తం

Update: 2022-07-29 18:30 GMT

రాష్ట్రంలో దాదాపు 3.10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.63 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. సగటున నలుగురి చొప్పున లెక్కేస్తే వీరి మొత్తం కుటుంబసభ్యుల సంఖ్య దాదాపుగా 23 లక్షలు ఉంటుంది. వీరిలో ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనా సొంత డబ్బుతో వైద్య పరీక్షలు, చికిత్సలు చేయించుకోవాలి. ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. చికిత్సకు ఎన్ని లక్షలు ఖర్చయినా ప్రభుత్వం గరిష్టంగా ఇచ్చేది రెండు లక్షలు మాత్రమే. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం నిర్థారించిన పరిమితి నేటికీ కొనసాగుతోంది. వస్తు సేవల ధరలు ఎంత పెరిగినా పరిమితి పెంచకపోవడం శోచనీయం. కరోనాకు అయితే ప్రభుత్వం ఇచ్చింది లక్షరూపాయలే. అదీ తొందరగా ఇవ్వడం లేదు.

మెడికల్ బిల్లుల స్క్రూటినీ పేరుతో ఎనిమిది నెలల నుండి పది నెలలు, ఈ-కుబేర్‌లో బిల్లు పాస్ కావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. దీంతో అప్పులు తెచ్చి వైద్యం చేయించుకుంటున్నవారు అరిగోస పడుతున్నారు. హెల్త్ కార్డులు పేరుకే. యేళ్ల తరబడి చికిత్స రేట్లను ప్రభుత్వం హేతుబద్ధం చేయకపోవడంతో వాటి మీద వైద్యం చేయడానికి కార్పొరేటు హాస్పిటల్స్ ససేమిరా అంటున్నాయి. దీంతో రీయింబర్స్‌మెంట్ మాత్రమే దిక్కవుతున్నది. అది కూడా ఇప్పుడు సక్రమంగా లేదు. ఇటీవలి కాలంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రపోజల్స్ పెద్దయెత్తున తిరస్కరణకు గురవుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ వరకు బిల్లులు తీసుకొని ప్రపోజల్స్ సమర్పించే వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే రీయింబర్స్‌మెంట్ మంజూరులో జాప్యం జరగడమే కాకుండా, పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి.

జత చేయవలసినవి!

రీయింబర్స్‌మెంట్ ప్రతిపాదనలకు వేతన మంజూరు పంపిణీ అధికారి (డీడీఓ) ధ్రువీకరించిన అపెండిక్స్-2 ఫామ్ జత చేయాలి. ఉద్యోగి / పెన్షనర్ పూర్తి రెసిడెన్షియల్ అడ్రస్ రాసి ఎమర్జెన్సీ సర్టిఫికెట్, ఎస్సెన్షియాలిటీ సర్టిఫికెట్, డిశ్చార్జ్ సమ్మరీ, డిటైల్డ్ మెడికల్ బిల్ జత చేయాలి. డీడీఓ ధ్రువీకరించిన నాన్ డ్రాయల్ సర్టిఫికెట్ కూడా జత చేయాలి. కుటుంబ సభ్యుల రీయింబర్స్‌మెంట్ అయితే డిక్లరేషన్ సమర్పించాలి. రెఫరల్ హాస్పిటల్‌గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఉత్తర్వుల ప్రతిని జత చేయాలి. రిటైర్డ్ ఉద్యోగి అయితే, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) కాపీని ఎన్‌క్లోజ్ చేయాలి. ఒక సెట్ ఒరిజినల్ బిల్లు, ఒక సెట్ డూప్లికేట్ బిల్లు మొత్తం రెండు సెట్ల మెడికల్ బిల్లు విధిగా జత చేయాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా తిరస్కరిస్తారు.

ట్రీట్‌మెంట్ కంటిన్యూగా తీసుకున్నప్పుడు ఒకే ప్రపోజల్‌లో రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేయాలి. అలా కాకుండా, రెండు, మూడు ప్రపోజల్స్ సమర్పిస్తే తిరస్కరిస్తారు. హాస్పిటల్ జారీ చేసే సర్టిఫికెట్లలో పేషంట్ పేరుతోపాటు ఉద్యోగి / ఉపాధ్యాయుడి / పెన్షనర్ పేరు హోదా, పని చేస్తున్న / చేస్తున్న డిపార్టుమెంటు వివరాలు, పేషంట్‌తో ఉన్న రిలేషన్ నమోదు చేయాలి. ట్రీట్‌మెంట్‌కి ముందు, తర్వాత జరిగిన వైద్య ఖర్చులను క్లబ్ చేసి రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేస్తే, రిప్యూజ్ చేస్తారు. నిర్దేశించిన జబ్బులకు లభించే లైఫ్ లాంగ్ ట్రీట్‌మెంట్ విషయంలో, ఫాలో‌అప్ ట్రీట్‌మెంట్‌కి ప్రతి ఆరు నెలలకోసారి ప్రభుత్వ డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ రివాలిడేషన్ చేయించి, జత చేయాలి. ప్రతిపాదనలను ఫార్వర్డ్ చేసే అధికారులు ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా వెరిఫై చేసి, ఆ తర్వాతే పై అధికారులకు సమర్పించడం మంచిది. తిరస్కరణకు గురయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి.

పనిష్మెంట్ తప్పదు!

భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగులైతే ఎవరి వైద్య ఖర్చులు వారే క్లెయిమ్ చేసుకోవాలి. భార్య వైద్య ఖర్చులు భర్త, భర్త వైద్య ఖర్చులు భార్య క్లెయిమ్ చేయడం నిబంధనలకు విరుద్ధం. పెన్షనర్ అయిన తల్లిదండ్రులు / స్పౌజ్ మెడికల్ బిల్లులను క్లెయిమ్ చేయడం కూడా తప్పు. ఎందుకంటే, ప్రతి నెలా జీతం / పెన్షన్ పొందుతున్న తల్లిదండ్రులు / స్పౌజ్‌ని తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ తప్పుడు డిక్లరేషన్ ఇవ్వడం తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండన్స్ రూల్స్ (టీఎస్ఐఎంఏఆర్)-1972 కి విరుద్ధం. ఈ తప్పు చేసిన వారికి సీసీఏ రూల్స్-1991 ప్రకారం తొలుత సర్వీస్ నుంచి సస్పెండ్ చేసి, ఆ తర్వాత విచారణ జరిపి మేజర్ పెనాల్టీ విధించడం ఖాయం.

తమ తల్లిదండ్రుల వైద్య ఖర్చులను తిరిగి పొందడానికి దరఖాస్తు పెట్టుకునే మహిళా టీచర్లు, ఉద్యోగులకు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. కొడుకులు ఉండగా కూతుళ్లు ఎలా తల్లిదండ్రుల రీయింబర్స్ మెంట్ క్లెయిమ్ చేస్తారంటూ మాట్లాడుతున్నారు. వాస్తవానికి టీఎస్ఐఎంఏఆర్-1972 ప్రకారం పురుష ఉపాధ్యాయులు, ఉద్యోగులపై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, దత్తపుత్రుడు, స్టెప్ చిల్డ్రన్ కుటుంబం పరిధిలోకి వస్తారు. అదే విధంగా మహిళా టీచర్లు, ఎంప్లాయీస్ మీద ఆధారపడిన తల్లిదండ్రులు, భర్త, పిల్లలు కుటుంబం పరిధిలోకి వస్తారు. వీరంతా రీయింబర్స్‌మెంట్‌కి వంద శాతం అర్హులే. లింగ వివక్ష చూపే అధికారులను వదిలిపెట్టకూడదు. ఉన్నతాధికారులతో పాటు మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు చేయాలి.

ఇలా చేయాలి

ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా సమర్పించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రతిపాదనలను రాగద్వేషాలకు అతీతంగా అధికారులు అనుమతించాలి. హెల్త్ కార్డుల విధానంలో ఉన్న లోపాలను వెంటనే తొలగించాలి. అప్పటి వరకు ప్రస్తుతం రెండు లక్షల రూపాయలు ఉన్న రీయింబర్స్ మెంట్ సీలింగ్ ఐదు లక్షల రూపాయలకు పెంచాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ సంఘాలతో చర్చించి అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ హెల్త్ కార్డులపై వైద్యం అందించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. 

మానేటి ప్రతాపరెడ్డి

టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు

98484 81028

Tags:    

Similar News